త్వరలో కొత్త రూ.100 నోట్లు
పాత 100 నోట్లు కూడా చెల్లుతాయన్న ఆర్‌బీఐ
- నోట్ల రద్దు అనంతరం రూ.130 కోట్ల నగదు, ఆభరణాలు స్వాధీనం
- 2 వేల కోట్ల నల్లధనం వెల్లడి : సీబీటీడీ
- నేడు సెకండ్ పే డే... భారీ క్యూలపై బ్యాంకుల ఆందోళన
న్యూఢిల్లీ: రూ. 20, రూ. 50 కొత్త నోట్ల జాబితాలో తాజాగా 100 నోటు కూడ చేరనుంది. త్వరలో కొత్త రూ. 100 నోటును మార్కెట్‌లోకి విడుదల చేస్తామని ఆర్‌బీఐ మంగళవారం అధికారిక ప్రకటనలో వెల్లడించింది. పాత 100 నోటు డిజైన్, భద్రతా ప్రమాణాలే కొనసాగుతాయని, అయితే కొన్ని మార్పులు చేస్తున్నట్లు ప్రకటించింది. కొత్త నోటు అమల్లోకి వచ్చినా పాత 100 నోట్లు చలామణి అవుతాయని పేర్కొంది. మహాత్మా గాంధీ సిరీస్-2005లోనే కొత్త 100 నోట్లను చలామణిలోకి తీసుకువస్తామని, రెండు నెంబరింగ్ ప్యానెళ్లలో ఇన్‌సెట్ అక్షరం ఉండదని పేర్కొంది. డిజైన్ మాత్రం మహాత్మా గాంధీ సిరీస్-2005 నోట్ల మాదిరిగానే ఉంటుందని, ఆరోహణ క్రమంలో నంబర్ ప్యానెల్ కొనసాగుతుందని వెల్లడించింది. అయితే బ్లీడ్ లైన్‌స, పెద్ద గుర్తింపు చిహ్నం వంటి అదనపు ఫీచర్లు ఉంటాయని వివరించింది.
ఈడీ, సీబీఐలకు 30 కేసుల సిఫార్సు
నోట్ల రద్దు నిర్ణయం అనంతరం దేశ వ్యాప్తంగా రూ. 130 కోట్ల విలువైన నగదు, ఆభరణాల్ని స్వాధీనం చేసుకున్నామని సీబీడీటీ(కేంద్ర ప్రత్యక్ష పన్నుల బోర్డు) ఒక ప్రకటనలో పేర్కొంది. అలాగే రూ. 2 వేల కోట్ల మేర అప్రకటిత ఆదాయం వెల్లడైందని తెలిపింది. విచారణ కోసం 30కి పైగా కేసుల్ని ఈడీ, సీబీఐలకు సిఫార్సు చేసినట్లు వెల్లడించింది. నవంబర్ నుంచి 400కు పైగా కేసుల్లో విచారణ వేగవంతం చేశామని, ఆదాయపు పన్ను శాఖ పరిధిలోలేని అక్రమాలను ఎన్‌ఫోర్స్‌మెంట్ డెరైక్టరేట్, సీబీఐలకు సిఫార్సు చేస్తున్నట్లు సీబీడీటీ చెప్పింది. ఐటీ ముంబై విభాగం రూ. 80 లక్షల కొత్త నోట్లను స్వాధీనం చేసుకుని కేసును విచారణ సంస్థలకు బదిలీ చేసిందని, బెంగళూరు ఐటీ విభాగం 18 కేసుల్ని ఈడీకి సిఫార్సు చేసినట్లు వెల్లడించింది. లూధియానా విభాగం రెండు కేసుల్లో 14 వేల యూఎస్ డాలర్లు, 72 లక్షల నగదు, హైదరాబాద్ విభాగం ఐదుగురి నుంచి రూ. 95 లక్షలు స్వాధీనం చేసుకున్నట్లు తెలిపింది. ఇక పుణెలో రూ.20 లక్షలు స్వాధీనం చేసుకోగా అందులో రూ. 10 లక్షలు కొత్త కరెన్సీ నోట్లు ఉన్నాయని పేర్కొంది.
వినియోగంలో లేని ఖాతాలతో జాగ్రత్త
ప్రజలు పాత నోట్ల డిపాజిట్ల కోసం వినియోగంలో లేని ఖాతాలు వాడే సమయంలో అన్ని నిబంధనలు పాటించాలని బ్యాంకులకు ఆర్‌బీఐ సూచించింది. అలాంటి ఖాతాల్ని పునరుద్ధరించేటప్పుడు ఖాతాదారుల వివరాల్ని పూర్తిగా పరిశీలించాలని కోరింది. దేశవ్యాప్తంగా నేడు అనేక సంస్థలు తమ ఉద్యోగులకు జీతాలు చెల్లించనున్న నేపథ్యంలో మరోసారి నగదు కొరత తీవ్రమయ్యే అవకాశాలు కన్పిస్తున్నాయి. బ్యాంకులు వెల్లడించిన వివరాల ప్రకారం నేడు రెండో పే డే కావడంతో బ్యాంకుల ముందు భారీ క్యూలు కొనసాగుతాయనే ఆందోళన వ్యక్తమవుతోంది. డిజిటల్ చెల్లింపుల కోసం ఇప్పటికే 6 లక్షల పీఓఎస్ మిషన్ల కోసం ఆర్డర్లు ఇచ్చారని, కొద్ది రోజుల్లో మరో 4 లక్షల మిషన్ల కోసం ఆర్డర్లిస్తామని ఆర్థిక శాఖ పేర్కొంది.
అక్రమాధికారులపై కేసులు
అవినీతి బ్యాంకు అధికారులపై సీబీఐ దాడులు కొనసాగుతున్నాయి. తాజాగా బెంగళూరులోని సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా బసవనగుడి బ్రాంచ్ సీనియర్ మేనేజర్ ఎస్.లక్షీ్ష్మనారాయణ అక్రమాలకు పాల్పడినట్లు గుర్తించి సీబీఐ కేసు నమోదు చేసింది. ఓంకార్ పరిమల్ మందిర్ డెరైక్టర్లు ఎస్.గోపాల్, అశ్విన్ జీ సుంకుర్‌లపై కూడా ఐపీసీ, అవినీతి నిరోధక చట్టం కింద కేసులు పెట్టింది. నవంబర్ 15 నుంచి 18 వరకూ లక్షీ్ష్మనారాయణ 50 వేల కంటే తక్కువ విలువగల 149 డీడీలు జారీ చేశారని ఇవి ఆర్‌బీఐ నిబంధనలకు వ్యతిరేకమని సీబీఐ పేర్కొంది. డ్రాఫ్ట్‌ల మొత్తం విలువ రూ. 71 లక్షలని, ఇందుకోసం మేనేజర్ పాత నోట్లను అంగీకరించారని తెలిపింది.
నోట్ల రద్దు అనంతరం అక్రమాలకు పాల్పడ్డ 19 మంది అధికారులను సస్పెండ్ చేసినట్లు యాక్సిస్ బ్యాంక్ ప్రకటించింది. అక్రమాలకు తావులేకుండా ఫోరెన్సిక్ ఆడిట్ కోసం కేపీఎంజీ సేవల్ని వినియోగించుకుంటున్నట్లు తెలిపింది. 19 మందిలో ఢిల్లీ కశ్మీరీ గేట్ బ్రాంచ్‌కు చెందిన ఆరుగురు ఉద్యోగులు ఉన్నట్లు యాక్సిస్ బ్యాంక్ ఎగ్జిక్యుటివ్ డైరక్టర్ రాజేష్ దహియా చెప్పారు. కర్ణాటకలోని మైసూరు నగరాభివృద్ధి సంస్థ కార్యాలయ సహాయ ఇంజినీర్ మహేష్ ఇంటిపై మంగళవారం ఉదయం ఏసీబీ అధికారులు దాడి చేసి దాదాపు రూ.14 కోట్ల విలువైన అక్రమాస్తులు గుర్తించారు. కోట్ల విలువైన బంగారు ఆభరణాలు, నగదు, రద్దరుున రూ.వెరుు్య, రూ.500 నోట్లతో పాటు కొత్త రూ. 2000 నోట్లు, స్థలాల డాక్యుమెంట్లు లభించారుు.
ఆభరణాలపై పన్ను ఆలోచన లేదు: రవిశంకర్
వ్యవసాయ ఉత్పత్తులు, మహిళల బంగారు ఆభరణాలపై పన్ను విధించే ఆలోచన కేంద్రానికి లేదని కేంద్ర మంత్రి రవిశంకర్ ప్రసాద్ తెలిపారు. ప్రజల్ని తప్పుదారి పట్టించేందుకు పుకార్లు వ్యాపింపచేస్తున్నారని, వాటిని నమ్మొద్దన్నారు. ఉత్తరాఖండ్ నైనిటాల్‌లో బీజేపీ పరివర్తన్ యాత్రలో మంగళవారం మాట్లాడుతూ... ప్రధాని నరేంద్ర మోదీ నాయకత్వంలో దేశం నగదు రహిత వ్యవస్థ వైపు పయనిస్తోందని చెప్పారు. కొత్త పన్నులు రైతులపై విధించడం లేదని, అలాగే బంగారానికి సంబంధించి ఎలాంటి కొత్త చట్టాలు రూపొందించడం లేదన్నారు.
రష్యా ఎంబసీకీ తప్పని నోట్ల తిప్పలు
నోట్ల రద్దు నిర్ణయం దేశ ప్రజలకే కాకుండా భారత్‌లోని రష్యా రాయబార కార్యాలయం సిబ్బందికీ తంటాలు తెచ్చిపెట్టింది. వారానికి రూ. 50 వేల విత్ డ్రా పరిమితితో ఇబ్బంది పడుతున్నామంటూ రష్యా ఎంబసీ తీవ్ర నిరసన తెలిపింది. వీలైనంత త్వరగా పరిష్కారం చూపాలని, లేకపోతే మాస్కోలోని భారత రాయబారికి సమన్లు జారీ చేస్తామని హెచ్చరించింది. సమస్య పరిష్కారం కాకపోతే భారత రాయబార ప్రతినిధికి సమన్లు జారీ చేయడమో, లేక రష్యాలోని భారత దౌత్య ప్రతినిధులకు కూడా నగదు విత్ డ్రాపై పరిమితులు పెట్టడమో చేస్తామని హెచ్చరించింది.