
ప్రతీకాత్మక చిత్రం
లక్నో: కరోనా వైరస్ భయాలు వెంటాడుతున్న వేళ ఎనిమిది గబ్బిలాలు మృత్యువాత పడటం ఓ గ్రామంలో కలకలం రేపింది. ఈ ఘటన ఉత్తరప్రదేశ్‌లో చోటుచేసుకుంది. మీరట్ శివారులోని మెహ్రోలీ గ్రామ సమీపంలోని నీటి గుంటలో ఏప్రిల్ 29న గబ్బిలాల కళేబరాలు బయటపడ్డాయి. కరోనా వ్యాప్తికి గబ్బిలాలే కారణమన్న వార్తల నేపథ్యంలో గ్రామస్తులు ఆందోళనకు గురయ్యారు. సమాచారం అందుకున్న అటవీ శాఖ అధికారి అదితి శర్మ ఘటనాస్థలికి చేరుకుని పరిస్థితిని సమీక్షించారు. అనంతరం బరేలిలోని ఇండియన్ వెటర్నరీ రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్(ఐవీఆర్‌ఐ)కి గబ్బిలాల నమూనాలు పంపించారు. ఇక ఈ విషయంపై పరిశోధన జరిపిన ఐవీఆర్‌ఐ శాస్త్రవేత్తలు కరెంట్ షాక్ తగిలినందు వల్లే గబ్బిలాలు మృత్యువాత పడ్డాయని తాజాగా స్పష్టం చేశారు. (కరోనా.. 53 వేలకు చేరువలో కేసులు)
ఈ విషయం గురించి డీఎఫ్‌ఓ అదితి శర్మ మాట్లాడుతూ.. నీటి కుంట సమీపంలోని పండ్ల తోటలో వెదజల్లిన రసాయనాల వల్లే గబ్బిలాలు చనిపోయినట్లు భావించామని.. అయితే ఎలక్ట్రిక్ షాక్ వల్లే ఘటన జరిగిందని.. కాబట్టి ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని పేర్కొన్నారు. కానీ మెహ్రోలి గ్రామస్తులు మాత్రం అదితి మాటలతో ఏకీభవించడం లేదు. ఊరి పెద్ద గంగారాం ఘటన గురించి మాట్లాడుతూ.. గబ్బిలాల మృతదేహాలు లభించిన చోటుకు సమీపంలో ఎలాంటి కరెంట్ లైన్ లేదని తెలిపారు. షాక్ కొట్టడం వల్లే అవి చనిపోయాయని చెబుతున్నారని.. అయితే అక్కడే ఉన్న ఇతర జంతువులు ఎందుకు చనిపోలేదని ప్రశ్నించారు. కరోనా ప్రబలుతున్న నేపథ్యంలో ఈ ఘటనపై లోతుగా విచారణ జరిపాలని విజ్ఞప్తి చేశారు. ఈ విషయాన్ని తేలికగా కొట్టిపారేయవద్దని.. తమ ప్రాణాలతో చెలగాటం ఆడవద్దని అధికారులకు విన్నవించారు. (ఆ రాష్ట్రాల గబ్బిలాల్లో కరోనా పాజిటివ్!)
Comments
Please login to add a commentAdd a comment