సాక్షి, న్యూఢిల్లీ: 400 ఏళ్లనాటి శివాలయం లోకి అనుమతించే దారిని మూసివేస్తున్నారని ఆరోపిస్తూ విశ్వ హిందూపరిషత్ కార్యకర్తలు దుశ్చర్యకు పాల్పడ్డారు. చారిత్రాత‍్మక కట్టణం తాజ్‌మహల్ పశ్చిమ ద్వారాన్ని (బసాయి ఘాట్) ధ్వంసం చేసి వీరంగం సృష్టించారు. దీంతో అక్కడ ఉద్రిక్త వాతావరణం ఏర్పడింది. ఆదివారం సాయంత్రం ఈ సంఘటన చోటు చేసుకుంది.
తాజ్‌మహల్‌కు సమీపంలోని పురాతన శివాలయానికి వెళ్లే దారిని ఆర్కియాలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా (ఏఎస్‌ఐ) మూసివేస్తోందని వీహెచ్‌పీ సభ్యుల ప్రధాన ఆరోపణ. సిద్ధ్వేశ్వర మహాదేవ్ దేవాలయానికి వెళ్లేందుకు మరో మార్గం ఉందని పోలీసులు సర్ది చెప్పేందుకు ప్రయత్నించినా నినాదాలతో దూసుకు వచ్చిన కార్యకర్తలు విధ్వంసానికి పాల్పడ్డారు. తాజ్‌మహల్, సహేలీ కా బుర్జ్ టిక్కెట్ల సేకరణ కోసం కొత్తగా ఏర్పాటు చేసిన గేటుపై సుత్తులు, ఐరన్‌రాడ్లతో దాడిచేశారు. గేట్‌ను తొలగించి, అక్కడ నుంచి దాదాపు 50 మీటర్ల దూరానికి విసిరి పారేశారు. ఏఎస్‌ఐ ఏర్పాటు చేసిన సీసీటీవీని కూడా ధ్వంసం చేశారు. ఎట్టకేలకు వారిని నిరోధించిన తాజ్ మహల్ సిబ్బంది వారిని అదుపులోకి కున్నారని తాజ్ భద్రతా అధికారి ప్రభాత్‌కుమార్ తెలిపారు. వీహెచ్‌పీ సభ్యులు రవిదుబే, మదన్‌వర్మ, మోహిత్ శర్మ, నిరంజన్ సింగ్ రాథోడ్, గుల్లా సహా మరో 30మంది పై కేసు నమోదు చేశామన్నారు. ప్రభుత్వ ఆస్తుల ధ్వంసం నిరోధక చట్ట సవరణలో సెక్షన్ 7 ప్రకారం ఫిర్యాదు దాఖలు చేశామని ఏఎస్‌ఐ అధికారి పేర్కొన్నారు. అయితే ఇప్పటివరకు ఎవరినీ అరెస్టు చేయలేదని పేర్కొన్నారు.
తాజ్‌మహల్ చుట్టూ ఉన్న హిందూసంస్కృతికి సంబంధించిన అంశాలను ఏఎస్‌ఐ నాశనం చేస్తోందని విహచ్‌పీ ప్రతినిధి దుబే ఆరోపించారు. దాదాపు 15సంవత్సరాల క్రితం వరకు ఇక్కడ సత్‌సంగ్ నిర్వహించుకునే వారని దాన్ని నిలిపివేశారన్నారు. అలాగే దసరా ఉత్సవాలను కూడా ఆపివేశారని మండిపడ్డారు. ఆమ్లా నవమిని నిర్వహించుకునే ఉసిరి చెట్టును ఏఎస్‌ఐ నరికివేయించిదని ఆయన ఆరోపించారు. ఈ కార్యక్రమాలన్నింటికీ 14-15 సంవత్సరాల క్రితం సమాజ్‌వాదీ పార్టీ, బహుజన్ సమాజ్ పార్టీ పాలనలో స్వస్తి చెప్పారు. అయినా ఇకముందు ఇలా జరగడానికి తాము అంగీకరించమని దుబే వాదించారు.
Comments
Please login to add a commentAdd a comment