అన్సారీపై వెంకయ్య ఎటాక్
సాక్షి, న్యూఢిల్లీ: దేశంలోని ముస్లింలలో అభద్రతా భావం నెలకొందని, అసంతృప్తి పోగైందంటూ ఉప రాష్ట్రపతి హమీద్ అన్సారీ అనడాన్ని ఉప రాష్ట్రపతిగా ఎన్నికైన వెంకయ్యనాయుడు తప్పుబట్టారు. అన్సారీ వ్యాఖ్యలు రాజకీయ దురుద్దేశంతో చేస్తున్న అసత్య ప్రచారం అని మండిపడ్డారు. మరోపక్క, బీజేపీ కూడా అన్సారీ వ్యాఖ్యలు తప్పుపట్టింది. అత్యున్నత హోదాలో ఉన్న ఓ వ్యక్తి ఇలాంటి వ్యాఖ్యలు చేయడం తగదని పేర్కొంది. ఆయన రాజకీయ ఆశ్రయం కోరేందుకు ఇలా మాట్లాడినట్లుందని బీజేపీ ప్రధాన కార్యదర్శి కైలాష్ విజయ్ వర్గీయ విమర్శించారు.
పదవీ విరమణ సమయంలో ఉపరాష్ట్రపతి హోదాలో ఉండగానే ఇలాంటి మాటలు సరికాదన్నారు. తాము ఆయన వ్యాఖ్యలతో ఏకీభవించబోమని స్పష్టం చేశారు. రాజ్యసభలో అన్సారీ ఉభయపక్షం వహిస్తున్నారని భావిస్తున్నారా అని ప్రశ్నించగా 'ఆయన తప్పు చేశారు.. అది ఉద్దేశపూర్వకంగా చేశారా? కాదా అనేది నేను చెప్పలేను' తెలిపారు. గురువారంతో పదవీ విరమణ చేయనున్న హమీద్ అన్సారీ ఓ ఇంటర్వ్యూలో పై వ్యాఖ్యలు చేశారు. గోరక్షకుల పేరిట కొందరు వ్యక్తులు గోవధకు పాల్పడిన వారిపై దాడులకు పాల్పడటం, హత్యలు చేయటంపై పరోక్షంగా ఆయన ఈ వ్యాఖ్యలు చేసి ఉంటారని భావిస్తున్నారు.
‘ముస్లింలలో అభద్రత, అసౌకర్య భావనలు వ్యాపిస్తున్నాయి. దేశపౌరుల భారతీయతను ప్రశ్నించడమనేది ఇబ్బందికరమైన విషయం. జాతీయవాదాన్ని ప్రతిరోజూ ప్రకటించుకోవాల్సిన అవసరం లేదు.. నేను భారతీయుడిని.. అంతే’ అని హమీద్ అన్సారీ అన్నారు. ఇదిలా ఉండగా, అన్సారీ దిగిపోతున్న వేళ 'మీ నుంచి మేం చాలా నేర్చుకున్నాం' అని ప్రధాని నరేంద్రమోదీ అన్నారు.