ముస్లింల అభ్యున్నతికి వైఎస్ అహర్నిశలు శ్రమించారు
♦ వైఎస్ చేసిన సేవలను కొనియాడిన నేతలు
♦ రిజర్వేషన్లపై షబ్బీర్ అలీ రాసిన పుస్తకాన్ని ఆవిష్కరించిన ఉపరాష్ట్రపతి
సాక్షి, న్యూఢిల్లీ: ముస్లింల అభ్యున్నతి కోసం దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి అహర్నిశలు శ్రమించారని నేతలు కొని యాడారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో వైఎస్ ముఖ్యమంత్రిగా ఉన్న కాలంలో ముస్లిం మైనారిటీలకు రిజర్వేషన్లు అమలు చేయ డంవల్ల కలిగిన ప్రయోజనాలపై తెలంగాణ శాసన మండలి ప్రతిపక్ష నేత షబ్బీర్ అలీ రచించిన పుస్తకాన్ని ఉప రాష్ట్రపతి హమీద్ అన్సారీ ఆవిష్కరించారు. ‘ముస్లిం తహఫుజాహత్ జిద్దొ జెహాత్’ పేరుతో షబ్బీర్ అలీ రచించిన ఈ పుస్తక ఆవిష్కరణ కార్యక్రమం బుధవారం ఢిల్లీలోని ఉప రాష్ట్రపతి నివాసంలో జరిగింది.
రాజ్యసభ ప్రతిపక్ష నేత గులాంనబీ ఆజాద్, కాంగ్రెస్ నేతలు సల్మాన్ ఖుర్షీద్, దిగ్విజయ్ సింగ్, జైపాల్‌రెడ్డి, జానారెడ్డి, ఏపీ, తెలంగాణ పీసీసీ చీఫ్‌లు రఘువీరారెడ్డి, ఉత్తమ్‌కుమార్‌రెడ్డి తదితరులు ఇందులో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఉప రాష్ట్రపతి హమీద్ అన్సారీ మాట్లాడుతూ.. సమాజంలో అందరికీ సమాన హక్కులు లభించినప్పుడే సబ్‌కా సాత్, సబ్‌కా వికాస్ సాధ్యమవుతుందన్నారు. అందరూ కలసి అభివృద్ధి చెందాలనేదే రాజ్యాంగ లక్ష్యమని పేర్కొన్నారు. తాను పార్టీ ఇన్‌చార్జ్‌గా ఉన్నప్పుడు వైఎస్‌తో కలసి రిజర్వేషన్లు తీసుకొచ్చామని గులాంనబీ ఆజాద్ గుర్తు చేసుకున్నారు. ముస్లిం రిజర్వేషన్ల అమలులో దివంగత ముఖ్యమంత్రి వైఎస్సార్ నిబద్ధతను దిగ్విజయ్‌సింగ్, జైపాల్‌రెడ్డిలు కొనియాడారు. ముస్లింల అభ్యున్నతి కోసం ఆయన అహర్నిశలు శ్రమించారని పేర్కొన్నారు.
వైఎస్ రాజశేఖరరెడ్డి ముఖ్యమంత్రిగా పదవీ బాధ్యతలు స్వీకరించిన 58 రోజుల్లో ఉస్మానియా వర్సిటీ, మైనారిటీ కమిషనరేట్‌ల సామాజిక, ఆర్థిక సర్వే ఆధారంగా జీవో నంబర్ 33 విడుదల చేసి ముస్లింలకు 5 శాతం రిజర్వేషన్లు కల్పించారని షబ్బీర్ అలీ తన పుస్తకంలో వివరించారు. తదనంతరం పలు సమస్యల వల్ల రిజర్వేషన్ల నిలుపుదల.. అనంతరం బీసీ ఈని ప్రవేశపెట్టి నాలుగు శాతం రిజర్వేషన్లు అమలు చేయడం ద్వారా ముస్లింలకు కలుగుతున్న ప్రయోజనాలను ఆయన వివరించారు. రిజర్వేషన్ల అమలు వల్ల 2004–2014 మధ్య కాలంలో 12 లక్షల మంది ముస్లిం విద్యార్థులు విద్య, ఉద్యోగ రంగాల్లో ప్రయోజనం పొందారని ఆయన పేర్కొన్నారు. కేవలం విద్య, ఉద్యోగాల్లోనే కాకుండా రాజకీయంగానూ ముస్లింల సాధికారతకు రిజర్వేషన్ ఫలాలు తోడ్పడ్డాయని వివరించారు.