ఆగస్టు 5న ఉపరాష్ట్రపతి ఎన్నికలు
► జూలై 4న నోటిఫికేషన్...
► ఎన్నికల షెడ్యూల్ విడుదల
న్యూఢిల్లీ: ఉపరాష్ట్రపతి ఎన్నికలకు నగారా మోగింది. ఆగస్టు 5న ఎన్నికలు జరగనున్నట్టు కేంద్ర ఎన్నికల కమిషన్ ప్రకటించింది. ప్రస్తుత ఉపరాష్ట్రపతి హమీద్ అన్సారీ పదవీకాలం ఆగస్టు 10తో ముగియనున్న నేపథ్యంలో ప్రధాన ఎన్నికల కమిషనర్ నసీమ్ జైదీ ఎన్నికల షెడ్యూల్‌ను గురువారం ఇక్కడ విడుదల చేశారు. జూలై 4న నోటిఫికేషన్ విడుదల చేస్తామని, 18 వరకు నామినేషన్ల స్వీకరణ ఉంటుందని చెప్పారు. అలాగే జూలై 19న నామినేషన్ల పరిశీలన జరుగుతుందని, ఉపసంహరణ గడువు 21తో ముగుస్తుందని తెలిపారు. ఒకవేళ అవసరమైతే ఆగస్టు 5న పోలింగ్ నిర్వహిస్తామని, అదే రోజు కౌంటింగ్ ఉంటుందని వెల్లడించారు.
మార్కింగ్‌కు ప్రత్యేక పెన్ను...
గత ఏడాది రాజ్యసభ ఎన్నికల సందర్భంగా హరియాణాలో చోటుచేసుకున్న గందరగోళం నేపథ్యం లో ఈసారి రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి పోలింగ్‌లో ప్రత్యేక పెన్నులు ఉపయో గించనున్నట్టు జైదీ చెప్పారు. ఓటర్లు ఈ పెన్నుతో మాత్రమే తమ అభ్యర్థికి మార్కింగ్ చేయాలన్నారు. వేరే ఏ పెన్ను వాడినా ఓట్లు చెల్లవని జైదీ స్పష్టం చేశారు. రహస్య బ్యాలెట్ ద్వారా జరిగే ఈ ఎన్నికల్లో రాజకీయ పార్టీలు ఎలాంటి విప్ జారీ చేయడానికి వీల్లేదన్నారు.
రాష్ట్రపతి నామినేషన్ల తిరస్కరణ...
రాష్ట్రపతి ఎన్నికలకు అధికార ఎన్‌డీఏ, ప్రతిపక్షాల అభ్యర్థులైన రామ్‌నాథ్ కోవింద్, మీరాకుమార్ మినహా ఇతర నామినేషన్లు తిరస్కరణకు గురయ్యాయి. దాదాపు 95 మంది నామినేషన్ వేయగా... కోవింద్, మీరాకుమార్ మినహా మరెవరూ అవసరమైన బల నిరూపణ చేయలేకపోయినందుకు వాటిని తిరస్కరించినట్టు లోక్‌సభ వర్గాలు తెలిపాయి. నిబంధనల ప్రకారం రాష్ట్రపతి అభ్యర్థిగా నామినేషన్ వేసేవారిని ఎలక్టోరల్ కాలేజీలోని 56 మంది సభ్యులు ప్రతిపాదించాలి.