‘విదర్భ’ తెలుగు వీరులు వీరే.. | Vidarbha telugu party leaders.. | Sakshi
Sakshi News home page

‘విదర్భ’ తెలుగు వీరులు వీరే..

Published Sun, Oct 12 2014 10:03 PM | Last Updated on Fri, Mar 29 2019 9:24 PM

‘విదర్భ’ తెలుగు వీరులు వీరే.. - Sakshi

‘విదర్భ’ తెలుగు వీరులు వీరే..

విదర్భ రాజకీయాల్లో తెలుగు ప్రజలు క్రియాశీలకంగా వ్యవహరిస్తున్నారు. ఇక్కడ నుంచి పలు పార్టీల నుంచి రాష్ట్ర స్థాయి పదవులను అలంకరించినవారూ ఉండటం విశేషం. ఒకప్పుడు ఇద్దరు ఎమ్మెల్యేలుగా ఎన్నికయ్యారు. అలాగే రాష్ట్ర మంత్రిగా కూడా పనిచేశారు. ఈ ఎన్నికల్లో ఎంతమంది గెలిచి తెలుగు వారి కీర్తిని పెంచుతారో వేచి చూడాల్సిందే..
 

సాక్షి, ముంబై:  విదర్భలోని వివిధ నియోజకవర్గాల్లో ఆరుగురు తెలుగు అభ్యర్థులు పోటీ పడుతున్నారు. ముఖ్యంగా చంద్రాపూర్ జిల్లా బల్లార్షా (బల్లార్‌పూర్) నియోజకవర్గం నుంచి మహారాష్ట్ర బీజేపీ మాజీ అధ్యక్షుడు సుధీర్ మునగంటివార్, చంద్రాపూర్ నుంచి కిషోర్ జోరగేవార్, యావత్మాల్ జిల్లా వనీ నియోజకవర్గం నుంచి కాసవార్ వామన్‌రావ్, బొద్కూర్‌వార్ సంజీవ్‌రెడ్డి, యావత్మాల్ నుంచి మదన్ యేర్వార్, దిలీప్ ముక్కావార్‌లు బరిలో ఉన్నారు. గత ఎన్నికల్లో విదర్భలో ఇద్దరు తెలుగువాళ్లు ఎమ్మెల్యేలుగా పదవులు అలంకరించారు. ఈసారి ఆ సంఖ్య పెరుగుతుందన్న నమ్మకాన్ని తెలుగు ప్రజలు వ్యక్తం చేస్తున్నారు.
 
బల్లార్షా (బల్లార్‌పూర్)లో....
జిల్లాతోపాటు రాష్ట్ర రాజకీయాల్లో కీలకపాత్ర పోషిస్తున్న సుధీర్ మునగంటివార్ మరోసారి చంద్రాపూర్ జిల్లా బల్లార్షా నుంచి బీజేపీ టిక్కెట్‌పై బరిలోకి దిగారు. మరోవైపు శివసేన తరఫున కేశవ్ కత్రే, కాంగ్రెస్ నుంచి మూల్‌చందాని గన్‌శ్యాం, వామన్ జడే (ఎన్సీపీ), దహివడే రమేష్‌చంద్ర (సీపీఎం), హర్షల్ చిప్లూన్కర్ (ఎమ్మెన్నెస్)లతోపాటు మొత్తం 15 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. దీంతో పోటీ రసవత్తరంగా మారినప్పటికీ సుధీర్ మునగంటివార్‌కు విజయావకాశాలు మెండుగా ఉన్నాయి.

బీజేపీ పార్టీలో కార్యకర్త స్థాయి నుంచి రాష్ట్ర బీజేపీ అధ్యక్షుని వరకు అనేక కీలక పదవులు అలంకరించిన ఆయన ఇప్పటి వరకు వరుసగా మూడు సార్లు (చంద్రాపూర్ నుంచి రెండు సార్లు, ఒకసారి బల్లార్షా నుంచి) ఎమ్మెల్యేగా గెలుపొందారు. నాలుగవ సారి మళ్లీ బరిలో ఉన్నారు. ఆయన చేసిన అనేక సంక్షేమ కార్యక్రమాలతోపాటు అభివృద్ధి పనులు రాష్ట్ర రాజకీయాల్లో మంచి గుర్తింపును తెచ్చిపెట్టాయి. ముఖ్యంగా శివసేన, బీజేపీల కూటమి అధికారంలోకి వచ్చిన సమయంలో నారాయణరాణే ముఖ్యమంత్రిగా ఉండగా పర్యాటక శాఖ మంత్రిగా విధులు నిర్వహించారు. ఇలా వివిధ పదవులు చేపట్టిన ఆయనకు 1999లో ఉత్తమ శాసన సభ్యునిగా అవార్డు లభించింది.

చంద్రాపూర్‌లో...
చంద్రాపూర్ అసెంబ్లీ నియోజకవర్గంలో తెలుగు వ్యక్తి అయిన కిషోర్ జోరగేవార్ శివసేన టిక్కెట్‌పై బరిలోఉన్నారు. మెన్దే మహేష్ (కాంగ్రెస్), అశోక్ నాగపూరే (ఎన్సీపీ), శమ్కులే నాన్జీ (బీజేపీ), సునితా గైక్వాడ్ (ఎమ్మెన్నెస్)లతోపాటు మొత్తం 13 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. ముఖ్యంగా తెలుగు అభ్యర్థి కిషోర్ జోరగేవార్ విజయం సాధిస్తానన్న ధీమాను వ్యక్తం చేస్తున్నారు.

బడుగు బలహీనవర్గాల కోసం నిత్యం ముందుండే కిషోర్ చాందా తెలుగు సేవా సమితి సంఘం స్థాపించి తెలుగు వారి ఐక్యతతోపాటు సంక్షేమం కోసం పాటుపడుతున్నారు. అదే విధంగా విదర్భ బురుడ్ సమాజం అధ్యక్షుడిగా కొనసాగుతున్నారు. స్వచ్ఛంద సేవా కార్యక్రమాలతోపాటు ప్రతి ఏడాది రక్తదాన శిబిరాలు నిర్వహించడంతో చంద్రాపూర్‌లో తనదైన ముద్రను వేసుకున్నారు. దీంతో ఆయనకు శివసేన టిక్కెట్ ఇచ్చింది. తాను గెలిస్తే చంద్రాపూర్‌ను మరింత అభివృద్ధి చేస్తానని చెబుతున్నారు.
 
యావాత్మల్, వనీలలో..

యావత్మాల్ అసెంబ్లీ నియోజకవర్గంలో ఇద్దరు తెలుగు అభ్యర్థులు పోటీ పడుతున్నారు. ప్రముఖ పార్టీలపై బీజేపీ నుంచి మదన్ యేర్వార్, పీడబ్ల్యూపీ నుంచి దిలీప్ ముక్కావార్‌లు బరిలో ఉన్నారు. వీరితోపాటు కాంగ్రెస్ నుంచి రాహుల్ ఠాక్రే, సంతోష్ డవలే (శివసేన), సందీప్ బజోరియా (ఎన్సీపీ), రాజనే భానుదాస్ (ఎమ్మెన్నెస్)తోపాటు మొత్తం 22 మంది బరిలో ఉన్నారు. మరోవైపు యావత్మాల్ జిల్లాలోని వనీ నియోజకవర్గంలో కూడా ఇద్దరు తెలుగు అభ్యర్థులు పోటీ పడుతున్నారు. కాంగ్రెస్ టిక్కెట్‌పై సిట్టింగ్ ఎమ్మెల్యే కాసావార్ వామన్‌రావ్, బీజేపీ నుంచి బోద్కువార్ సంజీవ్‌రెడ్డి బరిలో ఉన్నారు. ఎన్సీపీ నుంచి సంజయ్ దేర్కర్, నాందేకర్ విశ్వాస్ (శివసేన), రాజు ఉంబార్కర్ (ఎమ్మెన్నెస్)తోపాటు మొత్తం 13 మంది అభ్యర్థులు అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement