
మంగళవారం సచివాలయం సీ-బ్లాక్ ఎదుట ధర్నా చేస్తున్న బీజేపీ ఎమ్మెల్సీ, ఎమ్మెల్యేలు
సర్కారు తీరును నిరసిస్తూ ఎమ్మెల్యేల నినాదాలు
కేసీఆర్ అపాయింట్‌మెంట్ ఇవ్వడం లేదని ఆగ్రహం
అరెస్ట్ చేసి బలవంతంగా తీసుకెళ్లిన పోలీసులు
హైదరాబాద్: బీజేపీకి చెందిన ఐదుగురు ఎమ్మెల్యేలు, ఓ ఎమ్మెల్సీ మంగళవారం ఉద యం ముఖ్యమంత్రి కార్యాలయం ముందు మెరుపు ధర్నాకు దిగారు. అకస్మాత్తుగా జరిగిన ఈ పరిణామంతో సచివాలయంలో కలకలం రేగింది. ముఖ్యమంత్రి కార్యాలయ భద్రతా సిబ్బంది సైతం ఉలిక్కిపడ్డారు. ధర్నా చేస్తున్నది చట్టసభ్యులు కావడంతో భద్రతా సిబ్బం దికి కాసేపు ఏంచేయాలో పాలుపోలేదు. గంట తర్వాత సచివాలయ అధికారుల విధులకు ఆటంకం కలిగిస్తున్నారన్న అభియోగం కింద బీజేపీ నేతలను పోలీసులు అరెస్ట్ చేశారు. బలవంతంగా పోలీస్ వాహనంలోకి ఎక్కించి నాంపల్లి పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. అంతకుముందు ఉదయం 11గంటల సమయంలో బీజేపీ ఎమ్మెల్యేలు కిషన్‌రెడ్డి, ఎన్వీఎస్ ప్రభాకర్, చింతల రాంచంద్రారెడ్డి, కె.లక్ష్మణ్, రాజాసింగ్, ఎమ్మెల్సీ రాంచందర్‌రావు ముఖ్యమంత్రిని కలిసి వినతిపత్రం ఇచ్చేందుకని సచివాలయాని(సి-బ్లాక్)కి వచ్చారు. ఈ విషయమై మీడియా ప్రతినిధులకు ముందుగానే ఎస్‌ఎంఎస్ ద్వారా సమాచారమిచ్చారు.
అయితే ఆ సమయంలో సీఎం తన కార్యాలయంలో లేరని భద్రతా సిబ్బంది చెప్పడంతో వారు అప్పటికప్పుడు అక్కడే దర్నాకు దిగారు. నగర ఎమ్మెల్యేలతో ప్రభుత్వం ఇంతవరకు సమావేశం ఏర్పా టు చేయలేదని, ప్రజాసమస్యల పరిష్కారం కోసం పలుమార్లు సీఎం అపాయింట్‌మెంట్ కోరినా స్పందించలేదని ఎమ్మెల్యేలు ఆరోపిం చారు. ప్రజలు కోరుకున్న బంగారు తెలంగాణ ఇదేనా అంటూ నినాదాలు చేశారు. జీహెచ్‌ఎంసీ ఎన్నికలు దగ్గరపడుతున్న నేపథ్యంలో రూ.200 కోట్లతో ప్రభుత్వం ‘స్వచ్ఛ హైదరాబాద్’ను చేపట్టింద ని, ప్రజాధనంతో టీఆర్‌ఎస్ పార్టీ ప్రచారానికే ఈ ఎత్తుగడని ఎమ్మెల్యేలు ధ్వజమెత్తారు. కాగా, ప్రజాప్రతినిధులను అవమానించడంపై గవర్నర్‌కు ఫిర్యాదు చేయాలని బీజేపీ నిర్ణయించింది. బుధవారం ఉదయం 11 గంటలకు రాజ్‌భవన్‌లో గవర్నర్‌ను కలవనున్నట్లు నేతలు తెలిపారు.
మంచి పనులతో బలం పెంచుకో: కె.లక్ష్మణ్
పదవులు, పనుల ఎరతో ఇతర పార్టీల ఎమ్మెల్యేలను లాక్కోవడం కాకుండా, అభివృద్ధి పనులు చేసి టీఆర్‌ఎస్ బలాన్ని పెంచుకోవాలని ముఖ్యమంత్రి కేసీఆర్‌కు బీజేపీ శాసనసభాపక్ష నేత డాక్టర్ కె.లక్ష్మణ్ సూచించారు. పార్టీ రాష్ట్ర కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. ప్రజలు ఇచ్చిన అధికారాన్ని దుర్వినియోగం చేయకుండా, ప్రజలకు మేలు చేయాలని సూచించారు. అధికారమే శాశ్వతమనే భ్రమలో సీఎం కేసీఆర్ ఇష్టారాజ్యంగా, ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. హైదరాబాద్‌లో ప్రజా సమస్యలపై చర్చించడానికి వెళ్తే అపాయింట్‌మెంట్ కూడా ఇవ్వకుండా అరెస్టు చేయించడం అప్రజాస్వామికమని ధ్వజమెత్తారు.