డాన్సర్లతో ఎమ్మెల్యే చిందులు.. వీడియో వైరల్
ఆయన అధికారపార్టీకి చెందిన ఎమ్మెల్యే. పవర్ చేతిలో ఉంది కదా.. మనల్ని ఎవరేం చేస్తారులే అనుకున్నట్లున్నారు. అవకాశం దొరికిందే తడవుగా.. డాన్సర్లతో చెలరేగిపోయి అసభ్యంగా ప్రవర్తించారు. దానికి సంబంధించిన వీడియో ఒక్కసారిగా సోషల్ మీడియాలో వైరల్‌గా మారడంతో ప్రతిపక్షాలు ఈ వ్యవహారంపై భగ్గుమన్నాయి. కొన్ని స్థానిక టీవీ చానళ్లలో కూడా ఈ వీడియో ప్రసారమైంది. సమాజ్‌వాదీ పార్టీకి చెందిన జగత్‌రామ్ పాశ్వాన్ అనే ఈ ఎమ్మెల్యే ఓ పెళ్లికి హాజరై.. అక్కడ డాన్సు చేస్తున్న యువతుల మీదకు కరెన్సీ నోట్లు విసరడంతో పాటు వారి పట్ల అసభ్యంగా ప్రవర్తించారు.
దీనిపై ప్రతిపక్షాలు తీవ్ర విమర్శలకు దిగాయి. సమాజ్‌వాదీ పార్టీ అగ్రనాయకత్వం వాళ్లలో వాళ్లే తన్నుకోవడంలో బిజీగా మారిపోతే.. ఆ పార్టీ ప్రజాప్రతినిధులు డాన్సర్ల మీద నోట్లు చల్లుతూ ఆనందం పొందుతున్నారని బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి విజయ్ బహదూర్ పాఠక్ విమర్శించారు. సమాజ్‌వాదీ పార్టీ గూండాలు, మాఫియా శక్తులతో నిండిపోయిందని కాంగ్రెస్ రాష్ట్ర అధికార ప్రతినిధి అరుణ్ ప్రకాష్ సింగ్ మండిపడ్డారు. ఆ పార్టీ అసలు లక్షణం ఇప్పుడు వీడియో రూపంలో బయటకు వచ్చిందని అన్నారు. సమాజ్‌వాదీ పార్టీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఆ పార్టీ ప్రజాప్రతినిధులు ఇలాంటి కార్యకలాపాల్లోనే ఉంటున్నారని పీస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు అబ్దుల్ మన్నన్ అన్నారు.