కశ్మీర్ కథాంశంగా విధు వినోద్ చోప్రా సినిమా
ఇటీవలి కాలంలో బాక్సాఫీస్ హిట్‌ను సాధించి.. ఎంతో ప్రేక్షకాదరణ పొందిన 'త్రీ ఇడియట్స్', 'పీకే' వంటి ప్రముఖ సినిమాల నిర్మాత.. విధు వినోద్ చోప్రా మరో ప్రత్యేక కథాంశంతో ప్రేక్షకుల ముందుకు రానున్నారు. తన కొత్త చిత్రానికి కశ్మీర్‌ను కథాంశంగా ఎంచుకున్నఆయన... నూతన తన ప్రాజెక్టుపై కేంద్రమంత్రి జితేంద్ర సింగ్‌తో చర్చించారు.
నిజానికి తన జీవితంలో ఎక్కువ భాగాన్ని జమ్మూ కశ్మీర్‌లోనే గడిపానని, పాఠశాల, కళాశాల విద్యను శ్రీనగర్‌లోనే పూర్తి చేశానని చోప్రా తెలిపారు. అందుకే ముఖ్యంగా కశ్మీరీ పండిట్ కమ్యూనిటీ దురవస్థ నేపథ్యాన్ని వర్ణిస్తూ చోప్రా చలనచిత్ర నిర్మాణం చేపట్టనున్నట్లు మంత్రి కార్యాలయం విడుదల చేసిన ఓ ప్రకటనలో పేర్కొంది.
ఈ సందర్భంలో చోప్రా, అతని సభ్యులు చెప్పిన విషయాలను ఎంతో ఓపిగ్గా విన్న మంత్రి జితేంద్ర సింగ్.. ప్రాజెక్టులోని ప్రధానాంశాలను క్లుప్తంగా ఓ నోట్ రూపంలో అందజేయాలని కోరారు. అంతేకాక ప్రభుత్వం నుంచి వారు కచ్చితంగా ఏం కావాలని కోరుకుంటున్నారో కూడా వివరంగా తెలపాలని సూచించారు.