
2030 నుంచి బైకులపై నిషేధం
రయ్..మంటూ బైక్‌పై దూసుకెళ్లే యువకులకు ఇది ఇబ్బందికరమైన వార్తే. ఎందుకంటే 2030 నుంచి మెట్రో నగరాల్లో బైక్‌లను పూర్తిగా నిషేధిస్తున్నారు.
హెనాయ్: రయ్..మంటూ బైక్‌పై దూసుకెళ్లే యువకులకు ఇది ఇబ్బందికరమైన వార్తే. ఎందుకంటే 2030 నుంచి మెట్రో నగరాల్లో బైక్‌లను పూర్తిగా నిషేధిస్తున్నారు. అయితే మనం కంగారు పడాల్సిన పనిలేదు. ఎందుకంటే ఈ నిషేధం అమలయ్యేది మనదేశంలో కాదు.. వియత్నాంలో. ఎందుకంటే తాజాగా ఈ ఉత్తర్వులు జారీ చేసింది వియత్నామే మరి. రహదారులపై పెరిగిపోతున్న ట్రాఫిక్ సమస్యను పరిష్కరించేందుకు, వాహనాల నుంచి వెలువడుతున్న పొగ వల్ల కలిగే కాలుష్యాన్ని తగ్గించేందుకు వియత్నాం ఈ నిర్ణయం తీసుకుంది.
ఈ నిర్ణయంతో ప్రజారవాణా సదుపాయాలు మరింత మెరుగుపడతాయని, మరెన్నో సమస్యలు పరిష్కారమవుతాయని హెనాయ్ నగర పీపుల్స్ కమిటీ తెలిపింది. ఒక్క హెనాయ్ నగరంలోనే 7.5 మిలియన్ల మంది ప్రజలున్నారు. వీరికి 50 లక్షల బైకులు, 5 లక్షల కార్లు ఉన్నాయట. అసలే చిన్న నగరం, దీంతో లక్షలాది వాహనాలు రోడ్లపైకి రావడంతో తీవ్రమైన ట్రాఫిక్ సమస్యలు ఏర్పడుతున్నాయి. దీంతో దేశంలోని ప్రధాన నగరాలన్నింటిలో మోటార్ బైక్‌లపై నిషేధం అమలు చేయాలని నిర్ణయించారు. అయితే ప్రస్తుతానికి మాత్రం రాజధాని హెనాయ్‌లో ముందుగా అమలు చేస్తారు.