దేశానికే రోల్ మోడల్ గా చేస్తాను..!
అహ్మదాబాద్ః గుజరాత్ రాష్ట్రాన్ని దేశానికే రోల్ మోడల్ గా చేస్తానని గుజరాత్ ముఖ్యమంత్రిగా ఎన్నికైన విజయ్ రూపానీ పేర్కొన్నారు. తనకు గొప్ప బాధ్యతలను అప్పగించినందుకు ధన్యవాదాలు చెప్పిన ఆయన.... పటేల్ తనకీ అవకాశాన్ని ఇచ్చినందుకు కృతజ్ఞతలు తెలిపారు.
ఆనందీ బెన్ పటేల్ రాజీనామాతో.. గుజరాత్ ముఖ్యమంత్రి పీఠాన్నిదక్కించుకున్నవిజయ్ రూపానీ పటేల్ కు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. ఆనందీబెన్ పటేల్ ప్రభుత్వంలో రవాణా మంత్రిగా పని చేసిన ఆయన.. తనకప్పగించిన బాధ్యతలను సద్వినియోగం చేసుకొని, గుజరాత్ రాష్ట్రాన్ని అభివృద్ధి పరచడంలో ముందుంటానన్నారు. అంతేకాక దేశంలోని రాష్ట్రాలన్నింటిలో ప్రత్యేకంగా తీర్చి దిద్దుతానని, దేశానికే రోల్ మోడల్ గా మారుస్తానని అన్నారు. భారతీయ జనతాపార్టీ నిర్ణయంమేరకు కేంద్ర రోడ్డు రవాణా మంత్రి నితిన్ గడ్కరీ.. మీడియా ముందు రూపానీని ముఖ్యమంత్రిగా ప్రకటించారు. ప్రధాని నరేంద్ర మోదీతో సహా ప్రతి ఒక్కరితో చర్చించి నిర్ణయం తీసుకున్నట్లు ఆయన ఈ సందర్భంగా తెలిపారు.
మొత్తం పదిమంది బిజేపీ మంత్రులు రూపానీని ముఖ్యమంత్రిగా, డిప్యూటీ సీఎంగా నితిన్ పటేల్ ను చేసేందుకు మద్దతు పలికినట్లు గడ్కరీ తెలిపారు. అంతకు ముందు ఆనందీబెన్ పటేల్ ప్రభుత్వంలో మంత్రిగా పనిచేసిన నితిన్ పటేల్ ముఖ్యమంత్రి పదవిని దక్కించుకుంటారని ఊహాగానాలు వచ్చినా.. పార్టీ నిర్ణయం మేరకు ఆయనను డిప్యూటీ సీఎంగా ఎంపిక చేశారు.