కేరళ సీఎంగా విజయన్
ఏకగ్రీవంగా ఎంపిక చేసిన పార్టీ సెక్రటేరియట్, రాష్ట్ర కమిటీలు
తిరువనంతపురం: కేరళ సీఎంగా సీపీఎం సీనియర్ నాయకుడు పినరయి విజయన్(72) ప్రమాణ స్వీకారానికి ఏకగ్రీవ ఆమోదం లభించింది. సీనియర్ నాయకుడు వీఎస్ అచ్యుతానందన్(92)ను కాదని విజయన్‌నే ఎంపిక చేశారు. దీనిపై అచ్యుతానందన్ తీవ్ర అసంతృప్తితో ఉన్నట్లు తెలిసింది. కాగా, అచ్యుతానందన్‌ను ఫిడెల్ క్యాస్ట్రోతో పోల్చిన పార్టీ నేతలు ఆయన సేవలను పార్టీ అభివృద్ధికి వినియోగించుకుంటామన్నారు. విజయన్ కన్నూర్ జిల్లాలోని ధర్మధోర్ నియోజకవర్గం నుంచి 36 వేల ఓట్ల మెజారిటీతో విజయం సాధించారు. విజయన్ కేరళలో సీపీఎం తరఫున 4వ సీఎం కానున్నారు.
ఎవరీ పినరయి విజయన్..?
1944 మార్చి 21న గీత కార్మిక కుటుంబంలో విజయన్ జన్మించారు. విజయన్ స్వస్థలం కన్నూర్ జిల్లాలోని పినరయి. కేరళలో అందరికీ పినరయి విజయన్‌గా సుపరిచితుడు. కేరళలో రాజకీయ ఆధిపత్యం కలిగిన తియ్యా సామాజిక వర్గానికి చెందినవారు. విద్యార్థి సంఘాల ద్వారా ఆయన రాజకీయాల్లోకి ప్రవేశించారు. 1964లో కమ్యూనిస్టు పార్టీలో చేరారు. కేరళ స్టూడెంట్ ఫెడరేషన్ రాష్ట్ర అధ్యక్షునిగా, కార్యదర్శిగా పనిచేశారు. 1970, 1977, 1991, 1996లో అసెంబ్లీకి ఎన్నికయ్యారు. 1996-98లో విద్యుత్ మంత్రిగా ఉన్నారు. 2007లో పార్టీ పొలిట్‌బ్యూరో నుంచి సస్పెండైనా.. కొంత కాలానికే తిరిగి పార్టీలో స్థానం సంపాదించారు.
అవేవీ ఎల్డీఎఫ్ విజయాన్ని ఆపలేదు!
తిరువనంతపురం: ఎన్నికలకు ముందు రాజకీయ ఘర్షణలు, అవినీతి ఆరోపణలున్నా ఇవేవీ ఎల్డీఎఫ్ విజయాన్ని అడ్డుకోలేక పోయాయి. కేరళలో ఎల్డీఎఫ్ వోటు వాటా కాస్తంత తగ్గినా సీట్లు మాత్రం గణనీయంగా (91) పెరిగాయి. బీజేపీ-బీడీజేస్ కూటమి ఆవిర్భావంతో చాలా నియోజకవర్గాల్లో ముక్కోణపు పోటీ కనిపించింది. ఇదే కాంగ్రెస్ నేతృత్వంలోని యూడీఎఫ్ తన ఓటు వాటాను కోల్పోయేందుకు కారణమైంది. కేరళలో ఎక్కువగా ఉన్న మహిళా ఓటర్ల (1.05 కోట్లు)ను ఆకర్షించేందుకు యూడీఎఫ్ సర్కారు మద్యనిషేధం చేపట్టినా దీని ప్రభావం కనిపించలేదు. ఈ ఓట్లు చీలిపోయాయి. బీజేపీ ఒక సీటు మాత్రమే గెలిచినా.. ఏడు చోట్ల రెండో స్థానంలో నిలిచింది. 2011లో 6.06శాతం ఉన్న ఎన్డీఏ ఓటు వాటా ఈసారి 14.4 శాతానికి పెరిగింది. ఇతరులు కూడా చాలాచోట్ల ఓట్లను పంచుకోవటం యూడీఎఫ్ అవకాశాలను దెబ్బకొట్టింది.