
చేతుల్లేకుండా కారు డ్రైవింగ్!
చేతుల్లేకుండా కారును నడపగలమా? నేను నడపగలనంటున్నాడు మధ్యప్రదేశ్‌లోని ఇండోర్‌కు చెందిన విక్రం అగ్నిహోత్రి(45). అంతేకాదు.. ఇతడికి తాజాగా ఆ రాష్ట్ర ప్రభుత్వం డ్రైవింగ్ లెసైన్స్ కూడా జారీ చేసింది. చిన్నప్పుడు ఓ ప్రమాదంలో చేతులను కోల్పోయిన విక్రంకు కారును నడపాలన్న కోరిక అలాగే ఉండిపోయింది. అయితే.. అందరిలా నిరాశలో మునిగిపోకుండా తన కల సాకారానికి నడుం బిగించాడు.
కాళ్లతో కారును నడపడం నేర్చుకున్నాడు. దీనికి తగ్గట్లుగా తన వాహనంలో చిన్నచిన్న మార్పులు చేసుకున్నాడు. ఒక కాలుతో స్టీరింగ్ తిప్పుతూ.. మరో కాలుతో గేర్ వేస్తుంటాడు. లెసైన్స్ ఇవ్వాలన్న ఇతడి వినతిని తొలుత ఆర్టీఏ అధికారులు అంగీకరించలేదు. నెలల పోరాటం అనంతరం విక్రం కారు నడిపిన తీరును గమనించిన తర్వాత అతడికి లెసైన్స్ ఇచ్చారు. దేశంలో చేతులు లేని వ్యక్తికి డ్రైవింగ్ లెసైన్స్ ఇవ్వడం ఇదే తొలిసారని చెబుతున్నారు.