ఫైల్ ఫోటో
సాక్షి, న్యూఢిల్లీ : కోవిడ్-19 కారణంగా ఇండియాలో చిక్కుకు పోయిన విదేశీయులకు భారత ప్రభుత్వం ఊరట కల్పించింది. విదేశీయుల వీసా గడువును పొడిగించింది. విదేశీయుల వీసాల చెల్లుబాటును ఏప్రిల్ 30 వరకు పొడిగిస్తూ హోం మంత్రిత్వ శాఖ ఉత్తరువులిచ్చింది. కరోనా వైరస్ కారణంగా బారతదేశంలో చిక్కుకుపోయిన విదేశీ పౌరుల రెగ్యులర్ వీసా, ఇ-వీసా లేదా స్టే నిబంధనలను 30.04.2020 (అర్ధరాత్రి) వరకు పొడిగించినట్టు తెలిపింది. అటువంటి విదేశీ పౌరుల వీసాలను ఎలాంటి జరిమానా లేకుండా ఉచితంగా ఏప్రిల్ 30 వరకు పొడిగించినట్టు హోం వ్యవహారాల మంత్రిత్వ శాఖ ఒక ప్రకటనలో వెల్లడించింది. కరోనా వైరస్ మహమ్మారి విజృంభణ, లాక్ డౌన్ నేపథ్యంలో దేశీయంగా రవాణా వ్యవస్థ స్థంభించిపోయింది. అలాగే ఇతర దేశాలకు రాకపోకలను కూడా నిషేధించిన సంగతి విదితమే.
కాగా దేశంలో 21 రోజుల లాక్‌డౌన్ రేపటితో ముగియనుంది. ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్‌తో సహా పలువురు ముఖ్యమంత్రులు లాక్‌డౌన్ పొడిగించాలని కోరుకుంటుండగా. ఒడిశా, పంజాబ్, మహారాష్ట్ర, తెలంగాణ, తమిళనాడు రాష్ట్రాలు ఇప్పటికే ఈ నెల చివరి వరకు లాక్ డౌన్ ను పొడిగించాయి. ఈ నేపథ్యంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రేపు (మంగళవారం) ఉదయం జాతినుద్దేశించి ప్రసంగించనున్నారని తెలుస్తోంది.
Comments
Please login to add a commentAdd a comment