
‘ఆయనను ముఖ్యమంత్రి చేసింది మేమే’
పట్నా: తన కుమారుడిని రాజీనామా చేయాలని బిహార్ సీఎం నితీశ్ కుమార్ అడలేదని ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్ యాదవ్ తెలిపారు. అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న ఉప ముఖ్యమంత్రి తేజశ్వి యాదవ్‌పై వేటు వేసేందుకు నితీశ్ సిద్ధమవుతున్నారని వచ్చిన వార్తలపై లాలూ స్పందించారు. తాము మహాకూటమిగా ఏర్పడి నితీశ్ కుమార్‌ను ముఖ్యమంత్రిని చేశామని, తామే కూటమిని ముక్కలు చేస్తామా అని లాలూ ప్రశ్నించారు. నితీశ్ కుమార్ మహాకూటమి నాయకుడని, ఆయనను అవమానిస్తే సహించబోమని హెచ్చరించారు.
తనను రాజీనామా చేయమని ఎవరూ అడగలేదని బిహార్ డిప్యూటీ సీఎం తేజశ్వి యాదవ్ తెలిపారు. మహాకూటమిని విడగొట్టాలని ఆర్‌ఎస్‌ఎస్-బీజేపీ కోరుకుంటున్నాయని, వీరి కుట్రలను ప్రజలు గమనిస్తున్నారని పేర్కొన్నారు. ప్రతి రాష్ట్రంలో తమ పార్టీ అధికారంలోకి రావాలని కోరుకుంటున్న బీజేపీ అధ్యక్షుడు అమిత్ షా చెప్పారని, ఇందులో భాగంగానే మహాకూటమిని చీల్చేందుకు ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు.
బీజేపీ నాయకుడు సుశీల్ కుమార్ మోదీ బిహారి కాదని, బయటి నాయకుడని విమర్శించారు. బిహార్ ప్రజలు, అభివృద్ధి గురించి పట్టించుకోకుండా ఇష్టమొచ్చినట్టు ఆయన వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న తేజశ్వి యాదవ్‌ను పదవి నుంచి తప్పించాలని బీజేపీ గట్టిగా డిమాండ్ చేస్తోంది. ఈ నేపథ్యంలో జేడీ(యూ) కీలక నిర్ణయం తీసుకోనుందని జాతీయ మీడియాలో వార్తలు వచ్చాయి.