తేజస్వీ యాదవ్
సాక్షి, పట్నా: బిహార్ మాజీ ముఖ్యమంత్రి, ఆర్జేడీ చీఫ్ లాలూ ప్రసాద్ యాదవ్ ఆరోగ్యంపై ఆయన కుమారుడు, మాజీ మంత్రి తేజస్వీ యాదవ్ ఆందోళన వ్యక్తం చేశారు. తన తండ్రి ఆరోగ్యం కుదటపడక ముందే, ఆయన ఇష్టం లేకున్నా న్యూఢిల్లీ ఎయిమ్స్ నుంచి జార్ఖండ్ ఆస్పత్రికి ఎందుకు తరలించాలని నిర్ణయించుకున్నారని తేజస్వీ ప్రశ్నించారు. పట్నాలో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఎయిమ్స్ వైద్యులు తీసుకున్న తొందరపాటు నిర్ణయం తనను షాక్‌కు గురిచేసిందన్నారు. ఎయిమ్స్ నుంచి లాలూను ఎందుకు డిశ్ఛార్జ్ చేయాలనుకున్నారో సంబంధిత అధికారులు కారణాలు చెప్పాలని డిమాండ్ చేశారు. జార్ఖండ్ హాస్పిటల్‌తో పోల్చితే ఎయిమ్స్ బెస్ట్ హాస్పిటల్ అని తన తండ్రి లాలూను అక్కడే ఉంచి చికిత్స అందించాలని తేజస్వీ కోరారు.
ఎయిమ్స్‌కు లాలూ లేఖ
తన ఆరోగ్యం ఇంకా మెరుగుపడలేదని, ఎయిమ్స్‌లోనే చికిత్స తీసుకోవాలని భావిస్తున్నాను. రాంచీ హాస్పిటల్‌కు నన్ను ఇప్పుడే షిఫ్ట్ చేయవద్దు. రాంచీలో పూర్తి సౌకర్యాలు లేవు. నాకు ఎదైనా జరిగితే ఎయిమ్స్ బృందం బాధ్యత వహించాల్సి ఉంటుందంటూ లాలూ ప్రసాద్ యాదవ్ లేఖ రాశారు. కాగా, లాలూ సోమవారం ఆస్పత్రి నుంచి డిశ్ఛార్జి కావాల్సి ఉంది. ఈ నేపథ్యంలో రాంచీ జైలు అధికారులతో చర్చించి వైద్యులు ఓ నిర్ణయం తీసుకోనున్నారు. మరోవైపు లాలూకు మద్దతుగా ఎయిమ్స్ వద్ద ఆర్జేడీ కార్యకర్తలు ధర్నాకు దిగి నిరసన చేపట్టారు.
ఇప్పటికే గడ్డి స్కాంలో ఇరుక్కుని జైలు పాలైన లాలూపై రైల్వే టెండర్ల కేసులోనూ అవినీతి ఆరోపణలున్నాయి. అయితే జార్ఖండ్‌లోని బిర్సా ముండా జైల్లో శిక్ష అనుభవిస్తున్న సమయంలో అనారోగ్యం కారణంగా లాలూను రాంచీలోని రాజేంద్ర ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్‌కు తరలించారు. మెరుగైన వైద్యం కోసం న్యూఢిల్లీలోని ఎయిమ్స్‌కు తరలించి చికిత్స అందిస్తున్న విషయం తెలిసిందే.
Comments
Please login to add a commentAdd a comment