మేం భద్రత కల్పించగలం!
- ఒబామా పర్యటనపై అమెరికాకు భారత్ స్పష్టీకరణ
న్యూఢిల్లీ: ఈ నెల 26న భారత గణతంత్ర వేడుకల ముఖ్య అతిథిగా అమెరికా అధ్యక్షుడు ఒబామా హాజరవుతున్న దృష్ట్యా.. ఆ రోజు పరేడ్ జరిగే ఢిల్లీలోని రాజ్‌పథ్ చుట్టుపక్కల ఉన్న భవనాల పైన తమ దేశ సాయుధులే(స్నైపర్స్) పహారా ఉంటారన్న అమెరికా ప్రతిపాదనను భారత్ తోసిపుచ్చింది. మరో ఐదు రోజుల్లో ఒబామా భారత్‌లో అడుగిడుతుండటంతో.. ఆయన పర్యటన సమయంలో చేపట్టాల్సిన భద్రత చర్యలపై ఇరుదేశాల అధికారులు సంప్రదింపులను ముమ్మరం చేశారు.
ఈ సందర్భంగా అమెరికా సీక్రెట్ సర్వీసెస్ అధికారులు భారతీయ అధికారులకు పై స్నైపర్ ప్రతిపాదన చేశారని, దాన్ని భారతీయ అధికారులు తిరస్కరించారని భద్రతా ఏర్పాట్లలో భాగస్వామి అయిన అధికారి వెల్లడించారు. భారతీయ భద్రతాధికారులు సుశిక్షితులని, ప్రపంచంలోనే అత్యంత కట్టుదిట్టమైన భద్రతావలయం గల ఒబామాకు రక్షణ కల్పించగల శక్తియుక్తులున్నవారని, ఒబామాకు భద్రత విషయంలో అమెరికా అధికారుల జోక్యం అవసరం లేదని వివరించారన్నారు. భారత రాష్ట్రపతి, ప్రధాని, ప్రతిపక్ష నేత తదితర ప్రముఖులు కూడా హాజరవుతున్నందువల్ల భద్రత ఏర్పాట్లను వేరేవారికి అప్పగించలేమని తేల్చిచెప్పారన్నారు. వేడుకలు జరిగే ప్రాంతాన్ని ‘నో ఫ్లై జోన్’గా ప్రకటించాలన్న అమెరికా విజ్ఞప్తిని కూడా భారత్ తోసిపుచ్చింది.
‘బీస్ట్’లోనా?.. ‘లైమో’లోనా?.. గణతంత్ర వేడుకలు జరిగే వేదిక వద్దకు ఒబామా ఏ వాహనంలో రావాలనే విషయంపై కూడా ఇరుదేశాల మధ్య చర్చలు జరిగాయి. ప్రత్యేకంగా తన అత్యంత భద్రతాయుత వాహనం ‘బీస్ట్’లో ఒబామా వేదిక వద్దకు వస్తారని అమెరికా ఒత్తిడి తెచ్చింది. సాధారణంగా ముఖ్య అతిథి రాష్ట్రపతితో కలిసి వేదిక వద్దకు రావడం సంప్రదాయం.
ఒకవేళ భారత రాష్ట్రపతి వచ్చే బుల్లెట్‌ప్రూఫ్ వాహనం లైమోజిన్‌లో ప్రణబ్‌తో కలసి ఒబామా వేదిక వద్దకు వస్తే.. విదేశంలో సొంత వాహనం ‘బీస్ట్’లో ప్రయాణించని తొలి అమెరికా అధ్యక్షుడిగా ఒబామా నిలుస్తారు. అలాగే, భారత్‌లో ఒబామా ప్రయాణించేందుకు మూడు మార్గాలను ప్రత్యేకంగా ఏర్పాటు చేయాలని, వాటిలో ఆ సమయంలో మరే భారతీయ వీఐపీ ప్రయాణించకూడదని అమెరికా కోరింది. భారత్ దీన్ని తోసిపుచ్చింది. ఒబామా ప్రయాణించే మార్గంలోనే భారత రాష్ట్రపతి, ప్రధాని తదితర వీఐపీలు ప్రయాణిస్తారని తెలిపింది.