కూతుర్ని చంపి తీర్థయాత్రలకు వెళ్లాడు
Published Sat, Mar 25 2017 5:40 PM | Last Updated on Mon, Jul 29 2019 5:43 PM
రాంపూర్(ఉత్తరప్రదేశ్): రాష్ట్రంలో జరిగిన పరువు హత్య సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. కుమార్తెను చంపిన ఓ తండ్రి పుణ్యక్షేత్రాలకు వెళ్లి వచ్చాడు. రాంపూర్ ఎస్పీ కేకే చౌదురి తెలిపిన వివరాల ప్రకారం హసన్‌పూర్ గ్రామానికి చెందిన బాలిక(16) సగం కాలిన మృతదేహం మార్చి 16వ తేదీన స్థానికులు గుర్తించారు. దీనిపై పలు కోణాల్లో దర్యాప్తు చేపట్టిన పోలీసులు తండ్రే ఈ దారుణానికి కారణమని గుర్తించి, అదుపులోకి తీసుకున్నారు.
సదరు బాలిక ఉత్తరాఖండ్‌లోని బంధువుల ఇంట్లో చదువుకునే సమయంలో ఓ యువకుడితో ప్రేమలో పడింది. ఈ విషయం తెలిసిన తండ్రి ఆమెను మందలించాడు. అయితే, ఆమె తీరు మారలేదు. దీంతో తండ్రి ఆమెను చంపాలని పథకం వేశాడు. ఈ మేరకు మార్చి 15వ తేదీన ఆమెను ఉరివేసి చంపాడు. అనంతరం పెట్రోల్ పోసి తగులబెట్టాడు. ఆపై పాపానికి ప్రాయశ్చిత్తం చేసుకునేందుకు జమ్మూలోని పుణ్యక్షేత్రాలకు వెళ్లి వచ్చాడు. నిందితుడు నేరం అంగీకరించటంతో వివిధ సెక‌్షన్ల కింద పోలీసులు కేసులు నమోదు చేశారు.
Advertisement
Advertisement