ప్రతీకాత్మక చిత్రం
కోల్‌కతా : ఓ మహిళ అండాశయంలో ఏర్పడిన రెండు భారీ కణతులను విజయవంతగా తొలగించిన వైద్యులు ఆమెకి తిరిగి ప్రాణం పోశారు. వివరాల్లోకి వెళ్తే.. పశ్చిమ బెంగాల్‌లోని నదియా జిల్లాకు చెందిన అర్తి అధీకరీ అనే 60 ఏళ్ల మహిళకు తీవ్రమైన కడుపు నొప్పి రావడంతో ఆమె జూలై 14న జేఎన్‌ఎమ్ ఆస్పత్రి లో చేరారు. తొలుత వైద్యులకు ఆమె కడుపు నొప్పికి గల కారణం తెలియరాలేదు. దీంతో ఆమెకు అల్ట్రాసోనోగ్రఫీ పరీక్ష నిర్వహించిన వైద్యులు.. అండాశయంలో రెండు భారీ కణతులు ఉన్నట్టు గుర్తించారు.
కణతులు పరిమాణం పెద్దదిగా ఉండటంతో వాటిని తొలగించడానికి తీసుకోవాల్సిన చర్యలపై తొలుత ఆస్పత్రి సిబ్బంది సమీక్ష సమావేశం నిర్వహించింది. ఆపరేషన్ కోసం ప్రముఖ గైనకాలజిస్టు, అసిస్టెంట్ ప్రొఫెసర్ మ్రిగాంకా మౌలి షా సారథ్యంలో ఓ టీమ్‌ను ఏర్పాటు చేశారు. శనివారం రెండు గంటల పాటు శ్రమించిన మౌలి షా నేతృత్వంలోని వైద్యుల బృందం అర్తి అండాశయంలోని ఉన్న రెండు భారీ కణతులను విజయవంతగా తొలగించారు. ఆపరేషన్ అనంతరం మౌలి షా మాట్లాడుతూ.. అండాశయం నుంచి తొలగించిన రెండు కణతులు బరువు 35 కిలోల 300 గ్రాముల ఉన్నట్టు తెలిపారు. ఇంత పెద్ద పరిమాణం ఉన్న కణతులను తొలగించడం తమకు ఇదే తొలిసారి అని వెల్లడించారు. ప్రస్తుతం అర్తి పరిస్థితి నిలకడగా ఉందని.. 48 గంటల పాటు పర్యవేక్షణలో ఉంచామని పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment