మరోసారి లాక్‌డౌన్‌ విధిస్తారా ?! | What Can Be Done In India Whether Lockdown Imposes Or Not | Sakshi
Sakshi News home page

మరోసారి లాక్‌డౌన్‌ విధిస్తారా ?!

Published Sat, Jun 13 2020 2:39 PM | Last Updated on Sat, Jun 13 2020 6:39 PM

What Can Be Done In India Whether Lockdown Imposes Or Not - Sakshi

సాక్షి, న్యూఢిల్లీ: ప్రపంచంలో పలు దేశాలను కరోనా మహమ్మారి భయాందోళనలకు గురి చేస్తున్నప్పటికీ అది మన దేశానికి విస్తరించకుండా తగిన చర్యలు తీసుకునే విషయంలో భారత్‌ ఆలస్యంగా మేల్కొంది. భారత్‌లో జనవరి 30వ తేదీనాడే తొలి కరోనా కేసు బయట పడినప్పటికీ అంతర్జాతీయ విమాన సర్వీసులను మార్చి చివరి వారం వరకు అనుమతించడం పెద్ద పొరపాటని నిపుణులు ఎప్పటి నుంచో చెబుతూ వస్తున్నారు.

చైనాలోని వుహాన్‌ నగరంలో చిక్కుకున్న భారతీయులను ప్రత్యేక విమానంలో ఫిబ్రవరి మూడవ తేదీన భారత్‌కు తీసుకువచ్చి, వారికి సైన్యం ద్వారా ప్రత్యేక క్వారెంటైన్‌ శిబిరం ఏర్పాటు చేయించిన కేంద్ర ప్రభుత్వం ఆ స్ఫూర్తిని అలాగే కొనసాగించడంలో పూర్తిగా విఫలమైందన్నది వారి వాదన. అప్పుడే అంతర్జాతీయ విమాన సర్వీసులను రద్దు చేసి, మిలటరీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన క్వారెంటైన్‌ శిబిరాన్ని అలానే కొనసాగించి ఉన్నట్లయితే పరిస్థితి నేడు ఇంత తీవ్రంగా ఉండేది కాదని వారంటున్నారు.
(చదవండి: కరోనా కేసులు: 134 రోజుల్లో 3 లక్షలు)

అందుకనే దేశ ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ మార్చి 24వ తేదీ నుంచి దేశవ్యాప్తంగా లాక్‌డౌన్‌ను ప్రకటించి కఠినంగా అమలు చేయాల్సి వచ్చింది. విదేశాలకన్నా కఠినంగా దేశంలో లాక్‌డౌన్‌ను దాదాపు 75 రోజులపాటు భారత ప్రభుత్వం కొనసాగించింది. లాక్‌డౌన్‌ను జూన్‌ 8వ తేదీ నాటికి దశలవారిగా భారీగా సడలిస్తూ వచ్చింది. లాక్‌డౌన్‌ను సడలిస్తూ వస్తున్న క్రమంలో దేశంలో కరోనా కేసులు భారీగా పెరుగుతూ వచ్చాయి. లాక్‌డౌన్‌ నాటికి వందల్లో ఉన్న కేసులు నేటికి మూడు లక్షలు దాటాయి. ఏప్రిల్‌ ఆరో తేదీ నాటికి దేశంలోని 417 జిల్లాల్లో కరోనా కేసు ఒక్కటి కూడా నమోదు కాలేదు. ఆ తర్వాత రెండు నెలల్లోనే కరోనా లేని జిల్లాల సంఖ్య 49కి పడి పోయింది. ఈ నేపథ్యంలో జూన్‌ 25వ తేదీ నుంచి దేశంలో లాక్‌డౌన్‌ను తిరిగి విధిస్తారని, ఆ విషయాన్ని సీఎంలతో ప్రధాని నరేంద్ర మోదీ త్వరలో వీడియో కాన్ఫరెన్స్‌ జరపుతారనే వార్త రుజువు చేస్తోందంటూ తెగ ప్రచారం జరగుతోంది. అది నిజమవుతుందా? అందుకు అవకాశం ఉందా? ఇప్పటి వరకు విధించిన లాక్‌డౌన్‌ను ఫలించిందా ? 

‘భారత్‌ లాక్‌డౌన్‌కు కరోనా లొంగలేదు’ అని కేంద్ర ఆరోగ్య శాఖకు సలహా సంస్థగా పని చేస్తున్న ‘నేషనల్‌ హెల్త్‌ సిస్టమ్స్‌ రిసోర్స్‌ సెంటర్‌’ మాజీ ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్‌ టీ.సుందరరామన్‌ వ్యాఖ్యానించారు. ‘భారత్‌ లాంటి అధిక జనాభా కలిగిన దేశంలో లాక్‌డౌన్‌లు పని చేయవు’ అని ప్రముఖ ఎపిడమాలోజిస్ట్‌ జయప్రకాష్‌ ములియాల్‌  అన్నారు. ఈ సమయంలో అందరిపైనా కాకుండా మధ్య వయస్కులు, వద్ధులపై ప్రధానంగా దృష్టి పెట్టడం మంచిదని ఆయన చెబుతున్నారు.

ప్రముఖ వైరాలజిస్ట్‌ జాకబ్‌ జాన్‌ కూడా ఇదే వాదనతో ఏకీభవిస్తున్నారు. ‘నీటి ద్వారా కలరా విస్తరిస్తుంది. అలా అని ప్రజలకు నీటి సరఫరాను నిలిపివేస్తామా! ఫిల్టర్‌ చేసి సరఫరా చేయాల్సి ఉంటుంది. లాక్‌డౌన్‌ను విధించడం అంటే ఇక్కడ నీటి సరఫరాను నిలిపి వేయడం లాంటిదే’ అని వాయన వ్యాఖ్యానించారు. ప్రజలను అప్రమత్తం చేసి, స్వచ్ఛందంగా మాస్క్‌లు ధరించి, సామాజిక దూరం పాటించాలిగానీ లాక్‌డౌన్‌ పునరుద్ధరణ వల్ల ప్రయోజనం ఉండదని ఆయన హెచ్చరించారు. మరోసారి లాక్‌డౌన్‌ విధించే అవకాశం లేదని తాను చెప్పలేనని, విధించినా ప్రయోజనం ఉంటుందన్న గ్యారంటీ లేదని టీ. సుందరరామన్‌ అభిప్రాయపడ్డారు.
(చదవండి: లాక్‌డౌన్‌ ఎఫెక్ట్‌: 18.5 లక్షల అసురక్షిత అబార్షన్లు)

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement