కంటికి కనిపించని సూక్ష్మ క్రిమి కంటి మీద కునుకు లేకుండా చేస్తోంది. కరోనా మహమ్మారి భారత్‌పై పంజా విసిరి 200 రోజులైంది. ఈ ఆరునెలల కాలంలో అత్యధిక కేసులున్న దేశాల్లో ప్రపంచంలో మూడో స్థానానికి చేరుకున్నాం. కేసుల పెరుగుదల భయపెడుతున్నప్పటికీ రికార్డు స్థాయిలో రికవరీ భారత్ సాధించిన విజయంగా చెప్పాలి.
జనాభాతో కిటకిటలాడే భారత్‌కి కరోనా మహమ్మారిని ఎదుర్కొనే శక్తి లేదని తొలుత అందరూ భావించారు. కరోనాని కట్టడి చేసే ఏకైక ఆయుధమైన భౌతిక దూరం మన దేశంలో పాటించడం దుర్లభమని అనుకున్నారు. కానీ అందరి అంచనాలను పటాపంచలు చేస్తూ భారత్ వైరస్‌ను సమర్థంగా ఎదుర్కొంటోంది. ముఖ్యంగా రికవరీ, మరణాలు, కరోనా పరీక్షల్లో మన దేశం బాగా ముందుంది.
కేరళలో జనవరి 30న తొలి కేసు నమోదైన దగ్గర్నుంచి ఇప్పటి వరకు కేంద్రం పకడ్బందీ ప్రణాళికతోనే ముందుకు అడుగులు వేస్తోంది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సరైన సమయంలో స్పందించి మార్చి 25 నుంచి లాక్‌డౌన్ విధించడంతో కేసులు పెరగకుండా అడ్డుకోగలిగారు. మే 3 నుంచి లాక్‌డౌన్‌పై ఆంక్షలు సడలించడంతో కేసుల సంఖ్య పెరగడం మొదలైంది. ఈ 200 రోజుల్లోనే కేసుల సంఖ్య 26 లక్షలకి చేరుకుంది. మొత్తం కేసుల్లో 92% లాక్‌డౌన్ తర్వాతే నమోదయ్యాయి.
అయితే రికవరీ అంశంలో భారత్ అనూహ్యమైన పురోగతిని సాధించింది. ఏప్రిల్‌లో 26% మాత్రమే ఉన్న రికవరీ రేటు ఆగస్టు నాటికి 72శాతానికి పెరిగింది. మొత్తం మృతుల సంఖ్య 50 వేలు దాటినప్పటికీ మరణాల రేటు 1.9% ఉండడం భారీగా ఊరటనిస్తోంది. అగ్రరాజ్యం అమెరికాలో తొలి మరణం నమోదైన 23 రోజుల్లోనే 50 వేల మంది ప్రాణాలు కోల్పోతే భారత్‌కి తొలి మరణం నుంచి 50 వేలకు చేరుకోవడానికి 156 రోజులు పట్టింది.
కరోనాకి వ్యాక్సిన్ కనుక్కోవడంలో అడుగులు ముందుకు పడుతున్నాయి. హైదరా బాద్ కేంద్రంగా పనిచేసే భారత్ బయోటెక్, అహ్మదాబాద్‌లోని జైడస్ కేడిలా లిమిటెడ్ ప్రయోగాలు తుది దశలో ఉన్నాయి. కరోనా కొమ్ముల్ని సమర్థంగా వంచిన కేరళ ముఖ్యమంత్రి పి.విజయన్ కరోనా వైరస్ సందర్భంలో ట్వీట్ చేస్తూ మనం అనుభవిస్తున్న కష్టనష్టాల కంటే మహమ్మారిని ఎదుర్కొనే ధైర్యసాహసాలు, మనుగడ కోసం సాగిస్తున్న ప్రయత్నాలు, సంక్షోభాన్ని సానుకూలంగా మార్చుకోగలిగే శక్తి సామర్థ్యాలు స్ఫూర్తిని ఇస్తున్నాయని అన్నారు.
ఏడాది చివరికి కోటి ?
ప్రపంచంలోని కేసుల్లో ప్రస్తుతం 23% భారత్‌లోనే నమోదవుతున్నాయి. ప్రతీ 10 లక్షల మందిలో 1857 మందికి వైరస్ సోకుతోంది. 25 లక్షలకు పైగా కేసులు నమోదైన దేశాల్లో అమెరికా, బ్రెజిల్ తర్వాత భారత్ నిలిచింది. పెరుగుదల ఇలాగే కొనసాగితే ఈ ఏడాది చివరికి కోటికి పైగా కేసులు నమోదవుతాయని ఆరోగ్య రంగ నిపుణులు హెచ్చరిస్తున్నారు. మృతుల సంఖ్య 1.74 లక్షల వరకు చేరే అవకాశం ఉంది.
జూన్ 8 నుంచి అన్‌లాక్ 1.0 ప్రక్రియ మొదలయ్యాక దేశంలో కేసుల సంఖ్య చాలా త్వరగా రెట్టింపవుతోంది. అమెరికా, బ్రెజిల్‌తో పోల్చి చూస్తే 5 లక్షలు దాటిన తర్వాత మన దేశంలో తక్కువ రోజుల్లోనే ఎక్కువ కేసులు నమోదయ్యాయి. మొదట్లో మహారాష్ట్ర, ఢిల్లీ, తమిళనాడు కోవిడ్ హాట్‌స్పాట్‌లుగా ఉంటే ఇప్పుడు కర్ణాటక, ఉత్తరప్రదేశ్, ఆంధ్రప్రదేశ్‌నుంచి అత్యధిక కేసులు వస్తున్నాయి. సెప్టెంబర్ రెండో వారానికి కేసుల సంఖ్య అత్యధిక స్థాయికి చేరుకుంటుందని ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ సైన్సెస్ (ఐఐఎస్‌సీ) తన తాజా నివేదికలో వెల్లడించింది.
రికవరీ పెరిగిందిలా .. !
కోవిడ్–19 రికవరీ రేటు జూన్ నుంచి బాగా పెరగడం మొదలైంది. వైరస్‌పై ప్రజల్లో అవగాహన పెంచడానికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చేసిన ప్రయత్నాలు ఫలించడం, వైద్య సదుపాయాలు మెరుగుపరచడం, పరీక్షలు కూడా భారీగా పెంచి తొలి దశలోనే కోవిడ్ రోగుల్ని గుర్తించడం రికవరీలో రికార్డులు సృష్టిస్తున్నాం. తొలుత పుణేలో ఒక్క ల్యాబ్‌లో మాత్రమే పరీక్షలు జరిగేవి, అలాంటిది ఇప్పుడు దేశవ్యాప్తంగా 1433 ల్యాబొరేటరీల్లో పరీక్షలు నిర్వహిస్తున్నారు. ఆంధ్రప్రదేశ్, ఢిల్లీ, కర్ణాట క, పశ్చిమ బెంగాల్ లో అత్యధికంగా పరీక్షలు జరుగుతున్నాయి.
దేశ వ్యాప్తంగా రోజుకి 8 లక్షలకు పైగా పరీక్షలు నిర్వహిస్తున్నారు. రోజుకి 10 లక్షల టెస్టులు జరపాలని కేంద్రం లక్ష్యంగా నిర్ణయించింది. ఇప్పటివరకు 2.9 కోట్ల మందికి పరీక్షలు నిర్వహిస్తే పాజిటివ్ కేసులు 9% నమోదయ్యాయి. ఇక ఢిల్లీలో 10 వేల పడకలతో ప్రపంచంలోనే అతి పెద్ద కోవిడ్ ఆస్పత్రి సర్దార్ పటేల్ కోవిడ్ కేర్ సెంటర్ నిర్మించారు. కోవిడ్ నుంచి కోలుకున్న వారి ప్లాస్మా సేకరించడానికి ఢిల్లీలో ప్లాస్మా బ్యాంకు ఏర్పాటు చేశారు. ప్రైవేటు ఆస్పత్రుల్లో కూడా కోవిడ్ చికిత్సకి అనుమతినివ్వడంతో రికవరీ రేటు భారీగా పెరిగింది.
Comments
Please login to add a commentAdd a comment