గుజరాత్ కొత్త సీఎం ఎవరు? | Who will succeed Anandiben Patel in Gujarat? | Sakshi
Sakshi News home page

గుజరాత్ కొత్త సీఎం ఎవరు?

Published Tue, Aug 2 2016 11:36 AM | Last Updated on Tue, Aug 21 2018 2:43 PM

పురుషోత్తం రూపాల, విజయ్ రూపాని - Sakshi

పురుషోత్తం రూపాల, విజయ్ రూపాని

న్యూఢిల్లీ: గుజరాత్ తొలి మహిళా ముఖ్యమంత్రి ఆనందీబెన్ పటేల్ రాజీనామా ప్రకటన చేయడంతో ఆమె స్థానంలో ఎవరిని నియమిస్తారనే దానిపై చర్చ మొదలైంది. రెండుమూడు రోజుల్లో నూతన ముఖ్యమంత్రి పేరు ప్రకటించే అవకాశముంది. గుజరాత్ కొత్త సీఎంగా బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా తో పాటు పలువురి పేర్లు వినిపిస్తున్నాయి.

నారన్పురా అసెంబ్లీ నియోజక వర్గానికి ప్రాతినిథ్యం వహిస్తున్న అమిత్ షా... గతంలో గుజరాత్ హోంమంత్రిగా పనిచేశారు. ఉత్తరప్రదేశ్, గోవా, గుజరాత్ రాష్ట్రాలకు అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో అమిత్ షా పార్టీ అధ్యక్ష పదవి వదులుకోవడాన్ని ప్రధాని మోదీ అంగీకరిస్తారా, లేదా అనేది చూడాలి. అమిత్ షా తర్వాత పురుషోత్తం రూపాల(62), నితిన్ పటేల్(60), విజయ్ రూపాని(60), భికుభాయ్ దాల్సానియా(52), శంకర్ చౌదరి(46) పేర్లు బలంగా విన్పిస్తున్నాయి.

అమిత్ షాను గుజరాత్ సీఎంగా పంపకపోతే వీరిలో ఒకరిని ఎంపిక చేసే అవకాశముందని ప్రచారం జరుగుతోంది. కేంద్ర సహాయక మంత్రిగా ఉన్న పురుషోత్తం రేసులో ముందున్నారు. సౌరాష్ట్రలోని కడవా పటేల్ సామాజిక వర్గానికి చెందిన ఆయన గుజరాత్ బీజేపీలో మోదీ తర్వాత మంచి వక్తగా పేరు గాంచారు. అమిత్ షా కంటే సీనియర్ అయిన ఆయన  కొన్నేళ్లుగా ప్రాధాన్యం కోల్పోయారు.

గుజరాత్ ప్రభుత్వంలో అధికారికంగా నంబర్ టూగా కొనసాగుతున్న ఆరోగ్య శాఖ మంత్రి నితిన్ పటేల్ కూడా సీఎం పదవిపై ఆశ పెట్టుకున్నారు. ఆర్ఎస్ఎస్ తో ఆయనకు మంచి సంబంధాలున్నాయి. ఆనందీబెన్ వారసుడిగా గుజరాత్ బీజేపీ అధ్యక్షుడు విజయ్ రూపాని పేరు కూడా విన్పిస్తోంది. జైన్ సామాజిక వర్గానికి చెందిన ఆయన రాజకీయ సంక్షోభాలను ఎదుర్కొవడంలో సిద్ధహస్తుడు.

సంఘ పరివార్ ఆశీస్సులు పుష్కలంగా ఉన్న రాష్ట్ర బీజేపీ ప్రధాన కార్యదర్శి భికుభాయ్ దాల్సానియా తన అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు. మోదీ హాయంలో శక్తివంతమైన నేతగా ఉన్న ఆయన బీజేపీకి, ఆర్ఎస్ఎస్ కు సంధానకర్తగా కీలకభూమిక పోషించారు. ఉత్తర గుజరాత్ కు చెందిన బీసీ నాయకుడు శంకర్ చౌదరి పేరు విన్పిస్తున్నా ఆయన ముఖ్యమంత్రి అవకాశాలు తక్కువగా ఉన్నాయని పార్టీ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి.

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement