వాస్కోడిగామాలు క్యూ కడతారు! | whole world will search for india, says Narendra modi | Sakshi
Sakshi News home page

వాస్కోడిగామాలు క్యూ కడతారు!

Published Fri, Sep 26 2014 12:30 AM | Last Updated on Thu, Oct 4 2018 5:15 PM

వాస్కోడిగామాలు క్యూ కడతారు! - Sakshi

వాస్కోడిగామాలు క్యూ కడతారు!

ప్రపంచం మనదేశాన్ని వెతుకుతుంది: ప్రధాని మోదీ
భారత్‌ను అంతర్జాతీయ ఉత్పత్తి కేంద్రంగా తీర్చిదిద్దుతాం
సానుకూల, సులభ, శ్రేష్ట విధానాలను అవలంబిస్తాం
ఎఫ్‌డీఐ అంటే.. ‘ఫస్ట్ డెవలప్ ఇండియా’ అని కూడా!
ఇండియా ఒక మార్కెట్ కాదు.. అభివృద్ధికి ఒక అవకాశం
పెట్టుబడిదారుల రూపాయిని నష్టపోనివ్వం
‘మేక్ ఇన్ ఇండియా’ ప్రచార కార్యక్రమం ప్రారంభం

 
సాక్షి, న్యూఢిల్లీ: ఎఫ్‌డీఐ అంటే.. విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు(ఫారిన్ డెరైక్ట్ ఇన్వెస్ట్‌మెంట్) అనే కాకుండా ‘మొదట భారత్ అభివృద్ధి’(ఫస్ట్ డెవలప్ ఇండియా) అనే దృష్టితోనూ అర్థం చేసుకోవాలని దేశ విదేశీ పెట్టుబడిదారులకు ప్రధానమంత్రి నరేంద్రమోదీ సూచించారు. భారతదేశాన్ని ఒక మార్కెట్‌లా కాకుండా అభివృద్ధికి ఒక అవకాశంగా గుర్తించాలన్నారు. ఉపాధి అవకాశాలను పెంచి, దేశంలోని పేదలను పేదరికం నుంచి మధ్యతరగతిలోకి భారీగా తీసుకురాగలిగినప్పుడు.. వారి కొనుగోలు శక్తి పెరుగుతుందని, ఆ మేరకు మార్కెట్ విస్తరిస్తుందని, తద్వారా అభివృద్ధి సాధ్యమవుతుందని వివరించారు.

భారతదేశాన్ని అంతర్జాతీయ ఉత్పత్తి కేంద్రంగా మార్చే దిశగా చేపట్టిన ప్రతిష్టాత్మక ‘మేక్ ఇన్ ఇండియా’ ప్రచార కార్యక్రమాన్ని ప్రధాని గురువారం ప్రారంభించారు. ఢిల్లీలోని విజ్ఞాన్‌భవన్‌లో ‘మేక్ ఇన్ ఇండియా’ లోగోను ఆవిష్కరించి, స్వదేశీ, విదేశీ పారిశ్రామికవేత్తలను ఉద్దేశించి ప్రసంగించారు. కార్యక్రమంలో కేంద్ర వాణిజ్య, పరిశ్రమల శాఖ సహాయమంత్రి నిర్మలా సీతారామన్‌తో పాటు ప్రముఖ పారిశ్రామికవేత్తలు ముకేశ్ అంబానీ(రిలయన్స్), సైరస్ మిస్త్రీ(టాటా గ్రూప్), అజీమ్ ప్రేమ్‌జీ (విప్రో), కుమారమంగళం బిర్లా(ఆదిత్య బిర్లా గ్రూప్), కెనిచి అయుకువ(మారుతి సుజుకి), ఫిల్ షా(లాక్‌హీడ్ మార్టిన్).. తదితరులు పాల్గొన్నారు.
 
కార్మిక చట్టాల సవరణ
ఈ సందర్భంగా మోదీ మాట్లాడుతూ.. పెట్టుబడిదారులకు అనుకూలమైన, సులభ, శ్రేష్ట విధానాలను తమ ప్రభుత్వం అవలంబిస్తుందన్నారు. కార్ల నుంచి సాఫ్ట్‌వేర్ వరకు, ఉపగ్రహాల నుంచి జలాంతర్గాముల వరకు, ఔషధాల నుంచి నౌకాశ్రయాల వరకు, కాగితం నుంచి విద్యుత్ వరకు అన్నిటినీ ఉత్పత్తి చేయగల కేంద్రంగా భారత్‌ను రూపొందిస్తామని, అందుకవసరమైన మౌలిక వసతులను, డిజిటల్ నెట్‌వర్క్‌ను సిద్ధం చేస్తున్నామని తెలిపారు. మనదేశంలో వనరులు పుష్కలంగా ఉన్నాయని, దేశాన్ని వదిలివెళ్లకూడదని దేశ పారిశ్రామికవేత్తలను మోదీ కోరారు. పని గంటల్లో సౌలభ్యం పెంచేందుకు పలు కార్మిక చట్టాలకు సవరణలు చేస్తున్నామని మంత్రి నిర్మలా సీతారామన్ వెల్లడించారు. పెట్టుబడులకు సంబంధించి అనుమతుల్లో అనవసర జాప్యానికి, తనిఖీ వ్యవస్థకు, కుప్పలుతెప్పలుగా ఉండే నిబంధనలకు భారత్ పేరు గాంచిందని, ఆ పరిస్థితిని మారుస్తామని ఆమె హామీ ఇచ్చారు. కార్యక్రమంలో పారిశ్రామికవేత్తలకు అవసరమైన విధానపరమైన సమాచారం అందించేందుకు www.makeinindia.com వెబ్‌సైట్‌ను ఆవిష్కరించారు.
 
మోదీ ప్రసంగంలోని ముఖ్యాంశాలు..
- ప్రజాస్వామ్యం(డెమొక్రసీ), భౌగోళిక సౌలభ్యం(డెమోగ్రాఫిక్ డివిడెండ్), డిమాండ్.. ఈ మూడు సదుపాయాలు ఉన్నది ఒక్క భారతదేశానికే.
- ఇకపై భారత దేశ చిరునామా చెప్పడానికి బయటకు వెళ్లాల్సిన అవసరంలేదు. ప్రపంచం మన దేశాన్ని వెదుకుతుంది. ప్రపంచంలోని ప్రతీ వీధిలోనూ వాస్కోడిగామాలు పుడతారు. అన్వేషిస్తూ భారత్‌కు క్యూ కడ్తారు.
- మన దేశ పారిశ్రామికవేత్తలు తప్పనిసరి పరిస్థితుల్లో సొంత దేశం వదులుతున్నారు. మేక్ ఇన్ ఇండియా కార్యక్రమంతో ఈ పరిస్థితిని మార్చుతాం. కార్పొరేటు సామాజిక బాధ్యత తరహాలోనే కార్పొరేటు ప్రభుత్వ బాధ్యత ఉంటుంది. ఎక్కడైనా లోపాలు వస్తే ప్రభుత్వం జోక్యం చేసుకుంటుంది.
- పారిశ్రామికవేత్తలు పెట్టుబడిగా పెట్టిన ‘రూపాయి’ని నష్టపోనివ్వం. పెట్టుబడులకు, పరిశ్రమలకు భద్రత కల్పిస్తాం.
- ఉత్పత్తి రంగాన్ని అభివృద్ధి చేసి దేశ ఆర్ధిక వ్యవస్థలో సానుకూల మార్పు తేవాలి. ఈ చక్రాన్ని ముందుకు తీసుకెళ్లడానికి లోగోలో సింహం అడుగును పొందుపర్చాం.
- కొత్త పరిశ్రమల ఏర్పాటు విషయంలో అడ్డంకులు సృష్టించకుండా నా టీంను సున్నితం చేశా. మూడు నెలల అనుభవంతో చెబుతున్నా.. నా టీం , బ్యూరోక్రసీ సకారాత్మకంగా నా కన్నా రెండు అడుగులు ముందుంది.
- మన దగ్గర ప్రతిభకు కొదవలేదు. ప్రతిభ గల మానవశక్తి మనకు ఉందని మామ్ ప్రయోగ విజయంలో మరోసారి స్పష్టమైంది.
- (క్లీన్ ఇండియా కార్యక్రమాన్ని ప్రస్తావిస్తూ) చిన్న చిన్న పట్టణాల్లో ఆదాయాన్ని పెంచుకోడానికి చెత్త నుంచి విద్యుదుత్పత్తికి అవకాశాలు ఉంటాయి. ఆ దిశగా ఔత్సాహిక పారిశ్రామికవేత్తలు ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపించండి.
- కేంద్రం, రాష్ట్రం కలిసి పనిచేస్తేనే మేక్ ఇన్ ఇండియా కార్యక్రమం విజయవంతమవుతుంది. రాష్ట్రం దగ్గరికి ప్రతిపాదన వస్తే సహాయం చేసేందుకు కేంద్రం సిద్ధంగా ఉంటుంది.

యూపీఏపై విమర్శలు
- గత ప్రభుత్వ పాలనలో పారిశ్రామిక వేత్తలు విశ్వాసాన్ని కోల్పోయారు. ప్రభుత్వం ఎప్పుడు ఏ విధానాలు అమలు చేసేదో తెలియదు. సీబీఐ ఎప్పుడు దాడులు చేస్తుందోననే తెలియని భయాన్ని పారిశ్రామిక వేత్తల మాటల్లో విన్నా. భారత్‌లో పరిశ్రమలు పెట్టకూడదని, ఇక్కడి నుంచి వెళ్లిపోవాలనే మాటలను గత రెండు మూడేళ్లుగా వింటున్నా. ప్రతి అంశంపై ప్రజలు అనుమానించేలా గతంలో ప్రభుత్వాన్ని నడిపారు. దాంతో ఆ ప్రభుత్వంపై ప్రజలు విశ్వాసం కోల్పోయారు.
 
‘మేక్ ఇన్ ఇండియా’కు అద్భుత ఉదాహరణ మంగళయాన్!
ఇస్రో విజయంవంతం చేసిన మంగళయాన్ ప్రాజెక్ట్ ప్రధాని ప్రారంభించిన మేక్ ఇన్ ఇండియాకు అద్భుత ఉదాహరణ అని కార్యక్రమంలో పాల్గొన్న పారిశ్రామిక వేత్తలు ప్రశంసించారు. భారతీయ శాస్త్రవేత్తలు సాధించిన మామ్ విజయాన్ని మించిన స్ఫూర్తి మరోటి లేదు. ఆ ప్రాజెక్ట్‌కు అయిన ఖర్చు.. సాధారణ పరిభాషలో చెప్పాలంటే కిలోమీటరుకు రూ. 7 కన్నా తక్కువే’ అని ముకేశ్ అంబానీ పేర్కొన్నారు. కేఎం బిర్లా, ఐసీఐసీఐ ఎండీ, సీఈఓ చందా కొచ్చర్.. తదితరులు కూడా మేక్ ఇన్ ఇండియాను మార్స్ మిషన్‌తో పోలుస్తూ ప్రసంగించారు.
 
నిజాయితీ లేదు: కాంగ్రెస్
గత యూపీఏ ప్రభుత్వం ప్రారంభించిన కార్యక్రమాలనే కొత్త ప్యాకేజీలో, కొత్త పేరుతో మేక్ ఇన్ ఇండియా కార్యక్రమంగా చూపిస్తున్నారని కాంగ్రెస్ విమర్శించింది. మోదీ ప్రభుత్వంలో రాజకీయ నిజాయితీ లోపించిందని ఆరోపించింది.

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement