మోదీ ‘మేకిన్ ఇండియా’కు 500 మంది టాప్ సీఈఓలు
న్యూఢిల్లీ: ప్రధాని నరేంద్ర మోదీ తలపెట్టిన ప్రతిష్టాత్మక ‘మేకిన్ ఇండియా’ కార్యక్రమానికి దేశవిదేశాలకు చెందిన 500 మందికిపైగా టాప్ సీఈఓలు హాజరుకానున్నారు. గురువారమిక్కడ మోదీ ఈ ప్రచారాన్ని తొలిసారిగా ప్రారంభించనున్నారు. భారత్‌ను ప్రపంచ తయారీ రంగ కేంద్రంగా మార్చడం... తద్వారా భారీగా ఉద్యోగాలను కల్పించడమే లక్ష్యంగా మోదీ ఈ మేకిన్ ఇండియా ప్రచారానికి తెరతీశారు.
దేశీ, బహుళజాతి దిగ్గజాలు(ఎంఎన్‌సీలు) భారత్‌లో తమ తయారీ కేంద్రాలను విస్తరించడం ద్వారా భారీగా పెట్టుబడులను పెట్టేవిధంగా ప్రోత్సహించడమే మేకిన్ ఇండియా నినాదం ప్రదానోద్దేశం. కాగా, ఈ కార్యక్రమంలో పాల్గొనే దేశీయ పారిశ్రామిక దిగ్గజాల్లో రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముకేశ్ అంబానీ, టాటా గ్రూప్ చైర్మన్ సైరస్ మిస్త్రీ, మహీంద్రా గ్రూప్ సీఎండీ ఆనంద్ మహీంద్రా, ఐటీసీ చైర్మన్ వైసీ దేవేశ్వర్, బయోకాన్ సీఎండీ కిరణ్ మజుందార్ షా తదితరులు ఉన్నట్లు ప్రభుత్వ వర్గాలు పేర్కొన్నాయి.
ఇక మెర్సిడెస్, ఎయిర్‌బస్, వొడాఫోన్, హోండా, శామ్‌సంగ్ వంటి బడా ఎంఎన్‌సీల టాప్ ఎగ్జిక్యూటివ్‌లు దీనికి హాజరుకానున్నారు. ముంబై, చెన్నై, బెంగళూరుతోపాటు వివిధ రాష్ట్రాల రాజధానుల్లోనూ మేకిన్ ఇండియా ప్రచారాన్ని ఇదే సమాయానికి ప్రారంభించనున్నారు.