రిస్క్ చేయండి..పెట్టుబడులు పెంచండి
పారిశ్రామికవేత్తలకు ప్రధాని మోదీ పిలుపు
- భారీ సంఖ్యలో ఉద్యోగాలు కల్పించే రంగాలపై దృష్టిసారించాలి...
- ఆర్థిక వ్యవస్థకు చేయూతనిచ్చేందుకు తీవ్రంగా ప్రయత్నిస్తున్నాం..
- ప్రభుత్వ వ్యయాన్ని పెంచుతున్నాం...
- వ్యాపారాలకు సానుకూల పరిస్థితులను కల్పిస్తున్నామని వెల్లడి
న్యూఢిల్లీ: ఆర్థిక వ్యవస్థ పుంజుకోవడానికి ప్రభుత్వం శతవిధాలా ప్రయత్నిస్తోందని.. దీనికి ఆసరా ఇచ్చేందుకు కొన్ని రిస్కులు చేసైనా సరే పెట్టుబడులను పెంచాలంటూ పారిశ్రామిక రంగానికి ప్రధాని మోదీ పిలుపునిచ్చారు. ముఖ్యంగా ఉద్యోగాలను భారీగా కల్పించే రంగాల్లో అధికంగా నిధులను వెచ్చించాలని సూచించారు. దేశంలో వ్యాపారాలకు మెరుగైన పరిస్థితులను కల్పించడం ద్వారా విదేశీ పెట్టుబడులను ఆకర్షించే చర్యలను ఇప్పటికే తీసుకుంటున్నామని, ప్రభుత్వ వ్యయాన్ని కూడా భారీగా పెంచుతున్నట్లు మోదీ పేర్కొన్నారు.
ప్రపంచవ్యాప్తంగా ఆర్థిక సంక్షోభ పరిస్థితులు నెలకొన్న నేపథ్యంలో దీన్ని భారత్ తనకు సదవకాశంగా ఎలా మలుచుకోవాలన్న అంశాలను చర్చించేందుకు మంగళవారమిక్కడ వ్యాపార, పారిశ్రామిక దిగ్గజాలు, బ్యాంకర్లు, ఆర్థికవేత్తలతో ప్రధాని సమావేశమయ్యారు. దాదాపు మూడున్నర గంటలపాటు జరిగిన ఈ భేటీలో తాజా ప్రపంచ ఆర్థిక పరిణామాలు, భారత్‌పై వీటి ప్రభావాన్ని విశ్లేషించినట్లు సమావేశం అనంతరం ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ విలేకరులకు వెల్లడించారు. కాగా, ప్రస్తుత ప్రపంచ ఆర్థిక పరిస్థితులు.. ముఖ్యంగా స్టాక్, కరెన్సీ మార్కెట్లలో తీవ్ర హెచ్చుతగ్గులు స్వల్పకాలికమైనవేనంటూ దాదాపు 27 మంది అభిప్రాయం వ్యక్తం చేశారని జైట్లీ పేర్కొన్నారు. రియల్ ఎకానమీని పటిష్టం చేసేందుకు మరిన్ని చర్యలు తీసుకోవాల్సిందిగా వారు సూచించారని చెప్పారు.
అపార మానవ వనరులే మన బలం...
దేశీయంగా చౌక తయారీ రంగాన్ని ప్రోత్సహించేందుకు ప్రధాని కట్టుబడి ఉన్నారని జైట్లీ పేర్కొన్నారు. మన ఆర్థిక వ్యవస్థ బలం అంతా అపారంగా ఉన్న మానవ వనరులు, దేశీయ మార్కెట్‌పైనే ఆధారపడి ఉందని.. పూర్తిగా ఎగుమతి ఆధారితం కాదని కూడా ప్రధాని ప్రస్తావించినట్లు చెప్పారు. అదేవిధంగా చిన్న, మధ్యతరహా సంస్థలకు(ఎస్‌ఎంఈ రంగం) మరింతగా ఊతమివ్వడంతోపాటు మహాత్మాగాంధీ జాతీయ ఉపాధి హామీ పథకం(ఎంఎన్‌ఈఆర్‌జీఏ)ను నైపుణ్యాల అభివృద్ధికి ఉపయోగించుకోవాలని కూడా మోదీ దిశానిర్దేశం చేశారన్నారు. అసంఘటిత రంగ తోడ్పాటుకు ముద్రా బ్యాంక్ దోహదం చేస్తుందని చెప్పారు. పాలనలో పారదర్శకత ద్వారా త్వరితగతిన నిర్ణయాలకు ఆస్కారం ఉంటుందని జైట్లీ వివరించారు. అంతర్జాతీయంగా క్రూడ్, కమోడిటీ ధరల తగ్గుదల భారత్‌కు మంచి అవకాశమని.. ఎందుకంటే వీటి దిగుమతులపై మనం అధికంగా ఆధారపడటమే కారణమని ఆయన పేర్కొన్నారు.
బ్యాంక్రప్సీ చట్టానికి తుదిమెరుగులు...
కార్పొరేట్ల వడ్డీరేట్ల కోత డిమాండ్‌లపై స్పందిస్తూ... పరపతి విధాన నిర్ణయం అంతా ఆర్‌బీఐ చేతిలో ఉంటుందని, దీనిపై తాజా భేటీలో గవర్నర్ రఘురామ్ రాజన్‌తో ఎలాంటి చర్చా జరగలేదని జైట్లీ పేర్కొన్నారు. అంతర్జాతీయ ఆర్థిక అనిశ్చితి ప్రభావం భారత్‌పై తక్కువగానే ఉండొచ్చని కార్పొరేట్ సారథులు అభిప్రాయపడ్డారని.. మన ఆర్థిక వ్యవస్థ మూలాలు చాలా పటిష్టంగా ఉండటమే దీనికి కారణమని ఆర్థిక మంత్రి చెప్పారు. అయితే, చైనా కరెన్సీ విలువ కోత, భవిష్యత్తులో అమెరికా సెంట్రల్ బ్యాంక్ ఫెడరల్ రిజర్వ్ వడ్డీరేట్లు పెంచడం వల్ల తలెత్తే పరిణామాలను మరింత దీటుగా ఎదుర్కోవడంతోపాటు ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేయడం కోసం విభిన్న చర్యలపై దృష్టి సారిస్తున్నామన్నారు.
ముఖ్యంగా మౌలిక, సాగునీటి రంగంలో పెట్టుబడుల జోరు, వ్యాపారాలకు సానుకూల పరిస్థితుల కల్పన, విదేశీ పెట్టుబడులను మరింత ఆకర్షించడం, ప్రైవేటు రంగంలో పెట్టుబడుల పెంపు వంటివి ఈ చర్యలో ముఖ్యమైనవిగా జైట్లీ వివరించారు. తీవ్ర సమస్యలను ఎదుర్కొంటున్న ఉక్కు, టెక్స్‌టైల్, విద్యుత్ పంపిణీ, పర్యాటకం వంటి రంగాలకు ఊరట కల్పించేందుకు సంబంధించి కార్పొరేట్ల నుంచి పలు సలహాలు, సూచనలు వచ్చాయని ఆయన పేర్కొన్నారు. చౌక పెట్టుబడి నిధులు, నిలిచిపోయిన ప్రాజెక్టులను పట్టాలెక్కించడం, విదేశీ చౌక దిగుమతులకు అడ్డుకట్టవేయడానికి చర్యలు వంటివి ఇందులో ఉన్నాయని జైట్లీ వెల్లడించారు. పార్లమెంటులో ప్రతిష్టంభన తొలగి... వస్తు-సేవల పన్ను(జీఎస్‌టీ) బిల్లుకు ఆమోదింపజేసేందుకు ప్రభుత్వం చొరవ చూపాలని కూడా కార్పొరేట్లు ఈ భేటీలో ప్రధానంగా పేర్కొన్నారు. దివాలా చట్టానికి(బ్యాంక్రప్సీ కోడ్) తుదిమెరుగులు దిద్దుతున్నట్లు జైట్లీ చెప్పారు.