ప్రపంచం అంతా భారత్ వైపు చూస్తోంది : మోడీ
న్యూఢిల్లీ : భారతదేశం ఒక అవకాశాల స్వర్గం అని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అభివర్ణించారు. మేక్ ఇన్ ఇండియా లోగోను ఆయన గురువారమిక్కడ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మేక్ ఇన్ ఇండియా ప్రచార కార్యక్రమానికి వచ్చిన పారిశ్రామికవేత్తలకు మోడీ వందనాలు తెలిపారు. 125 కోట్ల ప్రజానీకానికి ఇప్పుడు విదేశీ పెట్టుబడులు అవసరమన్నారు.
ప్రపంచ పెట్టబడిదారులకు ఇచ్చే భరోసా ఇదేనని మోడీ అన్నారు. భారతీయుల కొనుగోలు శక్తి పెరిగినప్పుడే మార్కెట్ పెరుగుతుందన్నారు. మన పెట్టుబడులు ఇతర దేశాలకు తరలివెళ్లినప్పుడు తీవ్రమైన బాధ కలుగుతుంది. వ్యవసాయ రంగం కుదేలైందని... ఇలా ఎందుకైందో అర్థం కావడం లేదు.
ప్రపంచమంతా భారత్ను ఇప్పటికీ ఒక విపణిగానే చూస్తోందని మోడీ వ్యాఖ్యానించారు. భారతీయ కొనుగోలు శక్తిని ఇప్పటివరకూ అంచనా వేయలేదని ఆయన అన్నారు. అభివృద్ధి జరగాలంటే పెట్టుబడులు, ఉత్పాదకతకు అనువైన వాతావరణం కల్పించాలని మోడీ అభిప్రాయపడ్డారు. ఉత్పాదకత, ఉద్యోగిత పెరిగితే మధ్య తరగతి మరింత అభివృద్ధి చెందుతుందన్నారు. ప్రపంచం అంతా భారత్ వైపు చూస్తోందని ఆయన అన్నారు.