వచ్చే ఏడాదిన్నర కాలంలో 1.25 లక్షల ఉద్యోగాలు
న్యూఢిల్లీ : భారత్ను డిజిటల్ ఇండియాగా మార్చటానికి సహకారం అందిస్తామని రిలయన్స్ అధినేత ముఖేష్ అంబానీ తెలిపారు. మేక్ ఇన్ ఇండియా ప్రచారం కార్యక్రమంలో పాల్గొన్న ఆయన ప్రధాని మోడీ తీసుకున్న చొరవ అభినందనీయమన్నారు. జీఎస్‌టీ ద్వారా దేశం మార్కెట్ అంతా ఏకతాటిపైకి వస్తుందన్నారు. జీటీఎస్ని వీలైనంత త్వరగా అమలు చేయాలని ఆయన కోరారు. వచ్చే ఏడాదిన్నర కాలంలో 1.25 లక్షల ఉద్యోగాలు కల్పిస్తామని ముఖేష్ అంబానీ తెలిపారు.
దేశంలో పెట్టుబడులు పెట్టేందుకు టాటా గ్రూప్ సిద్ధంగా ఉందని టాటా ఛైర్మన్ సైరస్ మిస్త్రీ స్పష్టం చేశారు. మేక్ ఇన్ ఇండియా ప్రచార కార్యక్రమంలో మిస్త్రీ పాల్గొన్నారు. ఈ సందర్భంగా మిస్త్రీ మాట్లాడుతూ.. దేశంలో మానవ వనరులు, విస్తృత మార్కెట్‌కు సానుకూల అంశాలున్నాయని తెలిపారు. తయారీ రంగంలో ఉపాధి కల్పనకు అవకాశాలు ఎక్కువ అని పేర్కొన్నారు.
ప్రపంచంలో అత్యుత్తమైన హైడ్రాలిక్ టెక్నాలజీని విప్రో అందిస్తుందని అజీం ప్రేమ్‌జీ తెలిపారు. మేక్ ఇన్ ఇండియా ప్రచార కార్యక్రమంలో పాల్గొన్న ఆయన మాట్లాడుతూ ప్రపంచ స్థాయి పరిజ్ఞానాన్ని దేశీయంగా రూపొందించామన్నారు. పోటీరంగంలో ఉన్న ఆటంకాలను తొలగించాలని మారుతి సంస్థ అభిప్రాయపడింది. ప్రపంచ దేశాలు భారత్లో పెట్టుబడి పెట్టేందుకు ఇది మంచి తరుణమని బిర్లా సంస్థల అధినేత కుమార మంగళం బిర్లా అన్నారు.
పెట్టుబడులు ఆకర్షించేందుకు ప్రభుత్వం ఇంకా చేయాల్సింది చాలా ఉందన్నారు. పారిశ్రామిక అభివృద్ధి వల్లే దేశం అభివృద్ధి చెందుతుందని ఐసీఐసీఐ ఎండీ చందా కొచ్చర్ అభిప్రాయపడ్డారు. మేక్ ఇన్ ఇండియా కార్యక్రమం తమను ఉత్తేజితం చేసిందన్నారు. పోటీ ధరలకు వస్తు ఉత్పత్తి చేయగలిగినప్పుడు తమ స్థాయి మార్కెట్ సాధించగలుగుతుందని పేర్కొన్నారు.