మేక్ ఇన్ ఇండియా సక్సెస్‌కు మౌలిక పెట్టుబడులు పెరగాలి
- అసోచామ్ నివేదిక వెల్లడి
చెన్నై, సాక్షి ప్రతినిధి: ప్రధాని నరేంద్రమోదీ ఇచ్చిన మేక్ ఇన్ ఇండియా నినాదం నూరుశాతం సఫలీకృతం చేసేందుకు మౌలిక సదుపాయాల రంగంలో పెట్టుబడులు పెరగాల్సిన అవసరం ఉందని అసోచామ్ తాజా నివేదిక సూచించింది. అసోసియేటెడ్ చాంబర్ ఆఫ్ కామర్స్, ఇండస్ట్రీ ఆఫ్ ఇండియా(అసోచామ్), థాట్ ఆర్బిట్రేజ్ రీసర్చ్ ఇనిస్టిట్యూట్(టారీ) సంస్థలు మేక్ ఇన్ ఇండియా-ద నెక్ట్స్ లీప్ పేరుతో సంయుక్తంగా నిర్వహించిన అధ్యయన నివేదికను అసోచామ్ డెరైక్టర్ జనరల్ డీఎస్ రావత్, టారీ సంస్థ సంచాలకులు క్షమా కౌసిక్ సోమవారం చెన్నైలో ఆవిష్కరించారు.ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో అసోచామ్ దక్షిణ భారత విభాగం అధ్యక్షుడు, శ్రీ సిటీ వ్యవస్థాపక నిర్వాహక సంచాలకులు రవీంద్ర సన్నారెడ్డి మాట్లాడుతూ మేక్ ఇన్ ఇండియా, డిజిటల్ ఇండియా, క్లీన్ ఇండియా, స్కిల్స్ ఇండియా వంటి ప్రధాని నరేంద్ర మోదీ నినాదాలు సక్రమంగా అమలు చేయగలగితే దేశం అభివృద్ధి పథంలో పరుగులు పెడుతుందని అన్నారు.