ఆ నగరమంతా ‘బ్లూ’
జోధ్పూర్: ఓ గుర్రపు బంగీని తోలుకుంటూ ఓ కుర్రాడు వేగంగా దూసుకుపోవడం, ఓ మహిళ బెంచీ మీద కూర్చొని తాపీగా తేనీరు సేవిస్తుండడం, ఇంటి ప్రాంగణంలో ఓ బాలుడు బడలికతో పడుకొని ఉండడం, ఓ వీధి వాకిట గోడకు చేరగిలబడి కొంత మంది పెద్దవాళ్లు పిచ్చాపాటు మాట్లాడుకోవడం రాజస్థాన్‌లోని జోధ్పూర్ నగరంలో మనకు నిత్యం కనిపించే దశ్యాలు. ఈ దశ్యాల అన్నింటివెనకాల బ్యాక్‌గ్రౌండ్ మాత్రం ఒక్కటే కావడం విశేషం. అదే నీలి రంగు. నగరంలో ఎక్కడ చూసిన ఇళ్లకు, లోగిళ్లకు నీలి రంగే వేసి ఉంటుంది. జైపూర్‌ను పింక్ సిటీ అని పిలిచినట్లుగా జోధ్పూర్ ను బ్లూ సిటీ అని పిలవాల్సిందే.
15వ శతాబ్దంలో మహారాజా మాన్‌సింగ్ నగరంలో నిర్మించిన మెహ్రాన్‌గఢ్ కోట లోపల అద్దాలు కూడా నీలి రంగువే ఎక్కువగా ఉంటాయి. ఎందుకు ఎక్కువ మంది తమ ఇళ్లకు నీలి రంగు వేస్తారు అన్న ప్రశ్నకు ఇక్కడు రెండు ప్రధాన కారణాలు చెబుతారు. నగరంలో నివసించే హిందూ అగ్రవర్ణాల్లో మెజారిటీలైన బ్రాహ్మణులు తమ ఇళ్లకు నీలి రంగు వేసుకునే ఆచారాన్ని మొదట ప్రారంభించారట. దొంగతనాల నుంచి తమ ఇళ్లను రక్షించుకోవడం కోసం బ్రాహ్మణలు ఈ చిట్కాను ఉపయోగించారట. ఎక్కువ మంది విద్యావేత్తలు, పూజారులు ఉండే బ్రాహ్మణులను గౌరవించాలని, వారి ఇళ్లను దోచుకుంటే పాపం చుట్టుకుంటుందన్న నమ్మకం అప్పట్లో ప్రజల్లో ఉండేదట. అందుకని దొంగలకు తమ ఇళ్లని తెలియడం కోసం బ్రాహ్మణులు ఇళ్లకు నీలి రంగు వాడేవారట.
ఒకప్పుడు బ్రాహ్మణులకు మాత్రమే పరిమితమైన ఈ రంగు రానురాను నగరమంతటా విస్తరిస్తూ పోయింది. ఇతర కమ్యూనిటీ ప్రజలు కూడా ఈ రంగును ఎక్కువ ఉపయోగించడం మొదలు పెట్టారు. గోడలకు, తలుపులకు నీలి రంగు వేయడం వల్ల పురుగు, పుట్ర రాదని, చెదలు పట్టవన్న విశ్వాసంతో వారు ఈ రంగు ఉపయోగిస్తున్నారట. నీలి రంగులో ఉండే కాపర్ సల్ఫేట్ వల్ల చెదలు రావని కొందరు చెబుతున్నారు. నీలి రంగు వల్ల సూర్య కిరణాలు పరావర్తనం చెందుతాయని, ఫలితంగా నీలి రంగు వేసుకుంటే ఇల్లు చల్లగా ఉంటుందని చదువుకున్న వారు చెబుతున్నారు.