బనశంకరి: మాయమాటలనే పెట్టుబడిగా పెట్టి అనేకమందికి బురిడీ కొట్టించి లక్షలాది రూపాయలు కాజేసిన కేసుల్లో నిందితురాలు ఆండ్రిల్లా దాస్‌గుప్తాను సిటీ సైబర్‌క్రైం పోలీసులు విచారిస్తున్నారు. అనేక చీటింగ్‌కేసుల్లో నిందితురాలిగా ఉండి ఇటీవల పోలీసులకు పట్టుబడిన ఆండ్రిల్లాను గురువారం నగర సివిల్ కోర్టులో హాజరుపరిచి మరింత విచారణ కోసం తమ కస్టడీకి ఇవ్వాలని కోర్టుకు విన్నవించారు. న్యాయమూర్తి నిందితురాలికి పోలీస్‌కస్టడీకి ఆదేశించడంతో పోలీసులు ఆమెను అదుపులోకి తీసుకున్నారు.
భర్తకే కుచ్చుటోపీ
ఆండ్రిల్లాపై నమోదైన పదికి పైగా కేసుల సమాచారం సేకరించిన పోలీసులు ఆమె బ్యాంక్ ఖాతాలను పరిశీలిస్తున్నారు. అండ్రిల్లా తన భర్తకు తెలియకుండా అతని బ్యాంకు అకౌంట్ నుంచి భారీగా నగదును తన ఖాతాకు బదిలీ చేసుకుంది. ఆ డబ్బుతో విలాసవంతమైన జీవనం గడుపుతున్నట్లు పోలీసుల విచారణలో వెలుగు చూసింది. ఉత్తర ప్రదేశ్‌కు చెందిన ప్రైవేటు కంపెనీ ఉద్యోగిని వివాహం చేసుకున్న ఆండ్రిల్లా దాస్‌గుప్తా బెంగళూరు సీవీ రామన్‌నగరలో నివాసముండేది. తన స్టార్టప్ కంపెనీలో పెట్టుబడులు, ఉద్యోగాల పేరుతో ఇంటర్నెట్‌లో భారీగా ప్రచారం చేసుకుంటోంది. ఇటీవల అండ్రిల్లా భర్త తన బ్యాంక్ ఖాతాను పరిశీలించగా రూ.42 లక్షలు బదిలీ చేసుకున్నట్లు తెలిసి, భార్యపై సైబర్‌క్రైం బ్రాంచ్ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఆమెను అరెస్ట్ చేసి తమదైన శైలిలో విచారించగా, తన తప్పును ఒప్పుకుంది.
మోసాల పుట్ట : ఇక అండ్రిల్లా నగరంలోని వివిధ పోలీస్‌స్టేషన్ల పరిధిలో పలువురు మహిళల నుంచి డబ్బు తీసుకుని ముఖం చాటేసింది. హెణ్ణూరు, భారతీనగర, వైట్‌ఫీల్డ్ పోలీస్‌స్టేషన్ల పరిధిలో ఇలాంటి కేసులు కొన్ని నమోదయ్యాయి. హర్యానాలోని ఫరీదాబాద్‌లో సూరజ్‌కుండ్‌లో ఒక పంచతారా హోటల్‌లో దిగిన అండ్రిల్లా కొన్నిరోజులు ఆతిథ్యం స్వీకరించి, బిల్లు చెల్లించకుండా ఉడాయించింది. ఈ ఘటనపై హోటల్ సిబ్బంది ఫిర్యాదు మేరకు అక్కడి పోలీసులు ఈ మాయలాడిని గతంలో అరెస్ట్ చేసినట్లు తెలిసింది. స్నేహితులు, పరిచయస్తులకు ఫోన్ చేసి తన భర్తకు క్యాన్సర్ ఉందని, అతని చికిత్సకోసం డబ్బు కావాలని నమ్మించేది. మరొకరికి తన కుమారుడికి ఆరోగ్యం బాగాలేదని వారి వద్ద నుంచి డబ్బు తీసుకునేది. ఇంకా కొంతమందికి తన తల్లిని ఆసుపత్రిలో చేర్చామని, అత్యవసవరంగా ఊరికి వెళ్లడానికి వెంటనే విమానం టికెట్లను బుక్ చేయాలని కోరేది. టికెట్ పంపాక డబ్బును ఖాతాలోకి వేస్తానని చెప్పి నకిలీ మెసేజ్‌లు పంపి మోసగించేదని పోలీసులు తెలిపారు. విచారణలో మరిన్ని చీటింగ్‌లు బయటపడవచ్చని సైబర్‌క్రైం వర్గాలు తెలిపాయి.
Comments
Please login to add a commentAdd a comment