భార్య భోజనానికి రాలేదని.. ప్రొఫెసర్ ఆత్మహత్య
ఆయనో కాలేజీలో ప్రొఫెసర్. అయితే ఎప్పుడు ఆయన మూడ్ ఎలా ఉంటుందో ఆయనకే తెలియదు. చిన్నచిన్న విషయాలకు కూడా ఉత్తినే కోపం తెచ్చుకుంటారు. అలాగే చిన్న కారణంతో ఏకంగా ప్రాణాలు తీసుకున్నారు. బెంగళూరు కేఆర్ పురంలోని ఈస్ట్ వెస్ట్ కాలేజిలో ప్రొఫెసర్గా పనిచేసే సునీల్ దొడ్డన్నయ్య (32) తన భార్య, ఇద్దరు పిల్లలు, తల్లిదండ్రులతో కలిసి ఇదిరానగర్ ప్రాంతంలోని లాల్ బహదూర్ శాస్త్రి నగర్లో నివాసం ఉంటారు.
అందరూ కలిసి భోజనం చేద్దామనుకున్నారు. కానీ భార్య మాత్రం పది నిమిషాలు ఆలస్యంగా వచ్చింది. దాంతో ప్రొఫెసర్ గారికి ఎక్కడలేని కోపం వచ్చి, తన బెడ్రూంలోకి వెళ్లి తలుపు తాళం వేసుకున్నట్లు ఆయన తండ్రి దొడ్డన్నయ్య పోలీసులకు తెలిపారు. అయితే ఇంతకుముందు కూడా కోపం వచ్చినప్పుడల్లా అలాగే చేసేవారు కాబట్టి తల్లిదండ్రులు పెద్దగా పట్టించుకోలేదు. కానీ, మర్నాటి ఉదయం కూడా ఎంత పిలిచినా పలకకపోవడం, తలుపు కొట్టినా పట్టించుకోకపోవడంతో భయపడి తలుపు బద్దలుకొట్టి చూడగా, అప్పటికే సునీల్ సీలింగ్ ఫ్యాన్కు ఉరేసుకుని కనిపించారు. ఆయన గదిలో ఎలాంటి సూసైడ్ నోట్ కూడా లేదని పోలీసులు తెలిపారు.