పీఠభూమిపై పీటముడి | With Tents And Supplies, Army Digs Its Heels In Standoff With China | Sakshi
Sakshi News home page

డోకాలామ్‌లో టెంట్లు వేసిన భారత సైన్యం

Published Sun, Jul 9 2017 11:51 PM | Last Updated on Tue, Sep 5 2017 3:38 PM

పీఠభూమిపై పీటముడి

పీఠభూమిపై పీటముడి

- డోక్లామ్‌లో భారత సైన్యం మకాం
- తామూ వెనక్కి తగ్గబోమన్న చైనా
- చర్చలపై నీలినీడలు


న్యూఢిల్లీ:
భారత్, భూటాన్, చైనాల మధ్య కూడలిగా పిలిచే ‘ట్రై జంక్షన్‌’ వివాదం మరింత ముదిరింది. మూడు వారాల నుంచి దీనిపై ఇరు దేశాలూ పట్టు వీడటం లేదు.  సమస్యాత్మక ప్రాంతమైన డోక్లామ్‌ పీఠభూమిని ఎట్టిపరిస్థితుల్లోనూ వీడకూడదని భారత్‌ నిశ్చయించుకున్నట్టు తెలుస్తోంది. ఈ ప్రాంతం నుంచి వెళ్లిపోవాలంటూ చైనా చేసిన హెచ్చరికలను భారత్‌ ఏమాత్రం ఖాతరు చేయలేదు. ఇక్కడ కొనసాగేందుకే మొగ్గు చూపింది. సైనికులు డోక్లామ్‌లోనే గుడారాలను ఏర్పాటు చేసుకుని మకాం వేశారు. ఈ చర్య చైనా బెదిరింపులకు లొంగే ప్రసక్తేలేదని భారత్‌ సంకేతాలు పంపింది. మరోవైపు జవాన్లకు అవసరమైన సరఫరాలు సాగుతున్నాయని సీనియర్‌ సైన్యాధికారి ఒకరు తెలిపారు.

డోక్లామ్‌ పీఠభూమి ప్రాంతం సిక్కిం నుంచి దాదాపు 10 వేల అడుగుల ఎత్తులో ఉంటుంది.  ఈ విషయంలో రాజీ ప్రసక్తి లేదని.. బంతి ప్రస్తుతం భారత కోర్టులో ఉందని చైనా స్పష్టం చేసింది. భూటాన్‌కు ఉత్తర భాగంలోని జకర్లంగ్, పసమ్‌లంగ్‌ లోయలతో పాటు తూర్పు భాగంలోని డోక్లామ్‌ పీఠభూమిపై చైనాతో వివాదం ఉంది. వీటిల్లో డోక్లామ్‌ అత్యంత కీలకమైన ప్రాంతం. దీంతో దీన్ని సొంతం చేసుకోవాలని చైనా దుష్టపన్నాగం పన్నుతోంది. భారత్, భూటాన్, చైనా దేశాల మధ్య కూడలిగా ఉన్న ఈ ప్రాంతం చైనా ఆర్మీ ఆధీనంలోకి వెళితే ఆ దేశానికి ఎనలేని ప్రయోజనాలుంటాయి. అయితే ఇలాంటి సరిహ ద్దు సమస్యలను వివిధ స్థాయిల్లో చర్చల ద్వారానే పరిష్కరించుకోవాలని 2012లోనే రెండు దేశాలు ఓ ఒప్పందం కుదుర్చుకున్నాయి. ప్రస్తుత సమస్య విషయంలో మాత్రం ఇప్పటి వరకు అలాంటి చర్చల దిశగా చైనా ముందడుగు వేయలేదు.

భారత్‌–పాక్‌ సరిహద్దుల్లోనూ అదే పరిస్థితి
శ్రీనగర్‌: భారత్‌–పాక్‌ సరిహద్దుల్లో ఉద్రిక్తతలు కొనసాగుతూనే ఉన్నాయి. పాకిస్థాన్‌కు చెందిన ఓ సైనిక బంకర్‌ను భారత్‌ ఆర్మీ ధ్వంసం చేసింది. జమ్మూకశ్మీర్‌లోని పూంచ్‌ సరిహద్దులో ఆదివారం ఈ ఘటన జరిగింది. ఈ సందర్భంగా ఒక జవానుకు తీవ్ర గాయాలయ్యాయి. నియంత్రణ రేఖ సమీపంలోని పాక్‌ ఆర్మీ పోస్ట్‌ను భారత బలగాలు పేల్చి వేశాయి. జమ్మూకశ్మీర్‌ సరిహద్దులోని సాధారణ పౌరులపై పాకిస్థాన్‌ గత కొన్ని రోజులుగా అకారణంగా కాల్పులకు పాల్పడుతోంది. దీంతో పలువురు గాయపడ్డారు. ఈ నేపథ్యంలో సరిహద్దు గ్రామ ప్రజలపై కాల్పులు జరుపుతున్న పాక్‌ సైనిక బంకర్‌ను భారత ఆర్మీ ధ్వంసం చేసింది. ఈ ఘటనలో ఇద్దరు పాక్‌ సైనికులు చనిపోయినట్లు తెలుస్తోంది. ఇదిలా ఉంటే ఉగ్రవాదులు శనివారం సీఆర్‌పీఎఫ్‌ సైనికులపై ట్రాల్‌ ప్రాంతంలో గ్రనేడ్లతో దాడి చేశారు. ఈ ఘటనలో ఒక జవాను మరణించాడని సీఆర్‌పీఎఫ్‌ ప్రకటించింది.

మరోసారి భారత దౌత్యాధికారికి సమన్లు
ఇస్లామాబాద్‌: సరిహద్దుల్లో భారత సైనికులు కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘిస్తున్నారని ఆరోపిస్తూ పాకిస్థాన్‌ విదేశాంగ మంత్రిత్వశాఖ ఇస్లామాబాద్‌లో భారత డిప్యూటీ హైకమిషనర్‌ జేపీ సింగ్‌కు ఆదివారం సమన్లు జారీ చేసింది. భారత దళాలు జరిపిన కాల్పుల వల్ల పలువురు పాక్‌ పౌరులు మరణించారని ఆరోపించింది. భారత చర్యను ఖండించి, నిరసన వ్యక్తం చేయడానికే సమన్లు జారీ చేశామని తెలిపింది. చిరికోట్, సత్వాల్‌ సెక్టార్లలో భారత సైనికులు శనివారం కాల్పులు జరపడంతో మొత్తం ఐదుగురు మరణించారని పాక్‌ ఆరోపించింది. అయితే సింగ్‌ ఈ విషయమై శనివారం ఇస్లామాబాద్‌లో పాక్‌ విదేశాంగ అధికారులతో చర్చించారు. పాక్‌ సైనికులే కవ్వింపు చర్యలకు దిగి కాల్పులు జరపడంతో తమ పౌరులు ఇద్దరు మరణించారని తెలిపారు.

కశ్మీర్‌లో సాధారణ పరిస్థితులు
- ఆంక్షలను తొలగించిన అధికారులు
- పాక్‌పై మండిపడ్డ భారత్‌


శ్రీనగర్‌:
కశ్మీర్‌ లోయలో ఆదివారం తిరిగి సాధారణ పరిస్థితులు నెలకొన్నాయి. భద్రతా బలగాల కాల్పుల్లో ఏడాది క్రితం చనిపోయిన హిజ్బుల్‌ ముజాహిదీన్‌ సంస్థ కమాండర్‌ బుర్హాన్‌ వనీ తొలి వర్థంతి సందర్భంగా ముందుజాగ్రత్తగా సంబంధిత అధికారులు రెండురోజుల క్రితం ఆంక్షలు విధించడం తెలిసిందే. పౌరుల కదలికలతోపాటు గుమికూడడంపైనా ఎటువంటి ఆంక్షలు లేవని సంబంధిత అధికారులు తెలిపారు. వనీ వర్థంతి సందర్భంగా శనివారం ఎటువంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకపోవడం, పూర్తిస్థాయిలో ప్రశాంత వాతావరణం కనిపించడంతో ఆంక్షలను ఎత్తివేశారు. శనివారం కొన్నిచోట్ల రాళ్లు విసురుకున్న ఘటనలు చోటుచేసుకున్నాయని, అయినప్పటికీ శాంతిభద్రతలు అదుపులో ఉన్నాయని సంబంధిత అధికారి ఒకరు తెలియజేశారు. ఇదిలా ఉంటే,∙హిజ్బుల్‌ ముజాహిదీన్‌ ఉగ్రవాది బుర్హాన్‌ వనీని వీరుడిగా కీర్తిస్తూ పాకిస్థాన్‌ శనివారం చేసిన ప్రకటనపై భారత్‌ మండిపడింది. ఉగ్రవాద సంస్థ లష్కరే తయ్యబా రాసిచ్చిన ప్రకటననే పాక్‌ చదివి వినిపించిందని ఆరోపించారు. వనీ ఎన్‌కౌంటర్‌ తరువాత కశ్మీర్‌ లోయలో పెద్ద ఎత్తున హింస జరిగిన సంగతి తెలిసిందే. పాక్‌ విదేశాంగ కార్యాలయం చేసిన ప్రకటన లష్కరే ప్రకటన మాదిరే ఉందని భారత విదేశాంగశాఖ ప్రతినిధి గోపాల్‌ బాగ్లే విమర్శించారు. ఉగ్రవాదాన్ని ప్రోత్సహించడం మానాల ని పొరుగుదేశానికి సూచించారు. పాక్‌ సైన్యాధ్యక్షుడు జావెద్‌ బజ్వా సైత్యం వనీని అమరుడు అంటూ కీర్తించారు. కశ్మీరీలకు స్వయం నిర్ణయాధికారం ఉందని వాదించారు. పాక్‌ ప్రధాని నవా జ్‌ షరీఫ్‌ కూడా వనీకి నివాళులు అర్పించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement