ప్రతీకాత్మక చిత్రం
భోపాల్: పెళ్లిల్లు స్వర్గంలో నిశ్చయమైనా.. వాటిని కలకాలం నిలుపుకోవాల్సిన బాధ్యత మన చేతుల్లోనే ఉంది. అయితే ఈ మధ్యకాలంలో చిన్న చిన్న విబేధాలతో విడాకులు తీసుకుంటున్న వారి సంఖ్య ఎక్కువ అవుతుంది. ప్రస్తుతం చెప్పుకునేది కూడా ఇలాంటి వార్తే. భర్త పోటీ పరీక్షలకు సిద్ధమవుతూ తనను పట్టించుకోవడం మానేశాడని ఓ ఇల్లాలు విడాకులు కోరింది. ఆ వివరాలు.. మధ్యప్రదేశ్‌కు చెందిన ఓ వ్యక్తికి కొద్ది రోజుల కిందటే వివాహం అయ్యింది. అయితే అతను యూపీఎస్సీ పరీక్షల కోసం సిద్ధమవుతూ.. భార్యను పట్టించుకోవడం మానేశాడు. భర్త ప్రవర్తనతో విసిగి పోయిన సదరు యువతి విడాకులు కావాలంటూ కోర్టును ఆశ్రయించింది.
కౌన్సిలింగ్ సందర్భంగా సదరు యువతి.. ‘నా భర్త పీహెచ్‌డీ పూర్తి చేశాడు. నా అత్తమామలకు నా భర్త ఒక్కడే కుమారుడు. యూపీఎస్సీ పరీక్షలకు సిద్ధమవుతున్నాడు. అయితే తన తల్లిదండ్రుల్లో ఒకరికి ఆరోగ్యం బాగాలేకపోవడంతో.. వారి బలవంతం మేరకు వివాహం చేసుకున్నాడు. వివాహం అయిన నాటి నుంచి చదువుకే అంకితం అయ్యాడు. తనకు వివాహం అయ్యి భార్య ఉందనే విషయాన్ని పట్టించుకోవడం మానేశాడు. ఇలాంటి పరిస్థితుల్లో కలిసి ఉండటం కుదరదు. అందుకే విడాకులు కోరుతున్నాను’ అని తెలిపింది. అయితే సదరు వ్యక్తి మాత్రం తన భార్య పుట్టింటికి వెళ్లిందని.. తిరిగి రావడానికి ఇష్టపడటం లేదని.. ప్రస్తుతం ఆమెతో తనకు ఎలాంటి సంబంధం లేదని తెలిపాడు. అందుకే విడాకులు మంజూరు చేయాల్సిందిగా కోరాడు. కాగా ఇరు కుటుంబాల బంధువులు, స్నేహితులు ఈ దంపతుల మధ్య సయోధ్య కుదర్చడానికి ప్రయత్నించారు. కానీ ఫలితం లేకపోయింది. దీని గురించి అధికారులు మాట్లాడుతూ.. ‘మేం వారి వివాహ బంధాన్ని కాపాడటానికి ప్రయత్నిస్తున్నాం. మరో నాలుగు సెషన్ల పాటు కౌన్సిలింగ్ నిర్వహిస్తాం. ఆ తర్వాత కూడా విడిపోవాలని నిర్ణయించుకుంటే అప్పుడు వారికి విడాకులు మంజూరు చేస్తాం’ అని తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment