భోపాల్: బాలీవుడ్ హీరో ఆమిర్ ఖాన్-కిరణ్‌రావుల విడాకుల అంశంపై దేశవ్యాప్తంగా తెగ చర్చ నడుస్తోంది. రెండు వివాహాలు చేసుకున్న ఆమిర్ వైవాహిక జీవితం ఇలా మధ్యలోనే ముగిసిపోవడం.. ఇద్దరు భార్యలకు విడాకులు ఇవ్వడాన్ని పలువురు తీవ్రంగా పరిగణిస్తున్నారు. ఈ క్రమంలో బీజేపీ నాయకుడు ఒకరు ఆమిర్ ఖాన్‌పై సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆయన లాంటి వల్లే దేశంలో జనాభా పెరుగుతుందని ఆరోపించారు.
ఆ వివరాలు.. మధ్యప్రదేశ్ మంద్సోర్ బీజేపీ ఎంపీ సుధీర్ గుప్తా జనాభా పెరుగుదలకు, అసమానతలకు ఆమిర్ ఖానే బాధ్యుడంటూ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఈ సందర్భంగా సుధీర్ గుప్తా మాట్లాడుతూ.. ‘‘ఆమిర్ ఖాన్ తన మొదటి భార్య రీనా దత్తాకు విడాకులు ఇచ్చాడు.. ఆమెతో కలిగిన ఇద్దరు బిడ్డలను వదిలేశాడు. ఆ తర్వాత కిరణ్ రావ్‌ను రెండో వివాహం చేసుకున్నాడు. ఆమెతో ఓ బిడ్డను కన్నాడు. ఇప్పుడు ఆమెకు విడాకులు ఇచ్చాడు. తాత కావాల్సిన వయసులో ఇప్పుడు మూడో భార్య కోసం వెతుకుతున్నాడు. దేశ జనాభాలో అసమానతలకు ఆమిరే కారణం’’ అంటూ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు.
అంతేకాక ‘‘దేశ విభజన సమయంలో పాకిస్తాన్‌కు ఎక్కువ భూభాగం.. తక్కువ జనాభా లభించగా.. మనకు అందుకు రివర్స్‌లో జరిగింది. మన దగ్గర జనాభా పెరుగుతుంది తప్ప భూభాగం పెరగడం లేదని.. ఇది ఏమాత్రం మంచిది కాదు’’ అన్నారు సుధీర్ గుప్తా.
కాగా తమ 15 ఏళ్ల వైవాహిక జీవితానికి ఆమిర్ ఖాన్- కిరణ్ రావులు చరమగీతం పాడారు. వీరికి సరోగసీ ద్వారా ఆజాద్ రావు అనే కుమారుడు ఉన్నాడు. కిరణ్ రావుని వివాహం చేసుకోకముందు ఆమిర్, రీనా దత్తాను వివాహం చేసుకోగా వారికి జునైద్ అనే కొడుకు, ఇరా అనే కుమార్తె ఉన్నారు. ఈ క్రమంలో తాజాగా ఆమిర్ ఖాన్, కిరణ్ రావులు విడిపోతున్నట్లు ప్రకటించి షాకిచ్చిన సంగతి తెలిసిందే.
Comments
Please login to add a commentAdd a comment