Parents Separation: How It Will Affect Children Psychiatrist Suggestions: ‘మనం ఒకరికి ఒకరం సరిపడే భార్యాభర్తలం కాలేకపోయాం. కనీసం పిల్లలకు ఉత్తమంగా నిలిచే తల్లిదండ్రులుగా అయినా ఉందాం’ ఇదీ విడాకులు తీసుకుంటున్న భార్యాభర్తలు మొదటగా ఆలోచించాల్సింది. ఇవాళ రేపు విడాకుల ఆప్షన్‌ను ఎంచుకోవడానికి భార్యాభర్తలు పెద్దగా ఆలోచించడం లేదు. కాని ‘మా ఆలోచనంతా పిల్లల గురించే’ అంటున్నారు.
‘మేము ఒకరికొకరం అక్కర్లేదు. కాని మా పిల్లలకు మేము కావాలి. ఏం చేయమంటారు’ అని నిపుణుల దగ్గరకు సలహా కోసం వస్తుంటారు. వీరితో సమస్య లేదు. సమస్యల్లా ‘ఆమె దగ్గర ఉంటే పిల్లవాడు పాడైపోతాడు’ అని తండ్రి అనుకున్నా ‘అతని దగ్గర అమ్మాయి ఉంటే చదువు అబ్బకుండా పోతుంది’ అని తల్లి అనుకున్నా పరేషాన్ మొదలవుతుంది. సపరేషన్ అంటేనే ఒక పరేషన్. మళ్లీ పిల్లలతో ఆ పరేషాన్ అవసరమా?
మాట వినే భార్యాభర్తలు
‘కొందరు భార్యాభర్తలు విడిపోయినా పిల్లల కోసం బుద్ధిగా మాట వింటారు. వీరికి మేము పిల్లలు కోరుకున్నప్పుడల్లా కలిసి కనిపించండి అని సలహా ఇస్తుంటాం. బర్త్‌డే కలిసి చేయండి... స్కూలు యానివర్సరీకి కలిసి వెళ్లండి... స్పోర్ట్స్‌డేకు వెళ్లండి. వీక్లీ విజిట్స్‌ను అడ్డుకోకండి. పిల్లవాడి ఎదుట తల్లి తండ్రిని, తండ్రి తల్లిని చిన్నబుచ్చే విధంగా మాట్లాడకండి అని చెబుతాం. వారు వింటారు. పెద్దగా సమస్య ఉండదు’ అంటారు సైకియాట్రిస్ట్ డాక్టర్ కల్యాణ చక్రవర్తి. కాని సమస్య అంతా మాట వినని భార్యాభర్తల గురించే.
విడిపోయినా మారరు
కొందరు భార్యాభర్తలు విడిపోయినా మారరు. విడాకులకు ముందు తిట్టుకుంటారు. విడాకులు అయ్యాక కూడా తిట్టుకుంటారు. ఇది పిల్లల మీద ఎంత మానసిక ఒత్తిడి కలిగిస్తుందో ఆలోచించరు. విజిట్స్‌కు వచ్చినప్పుడు ‘మీ అమ్మ ఇదా నేర్పింది’ అని అంటారు. లేదా ‘మీ నాన్న బుద్ధులే నీకూ వచ్చాయి’ అంటారు. దాంతో తల్లి కరెక్టా తండ్రి కరెక్టా అనేది అర్థం కాక పిల్లల్లో స్పిరిట్ పర్సనాలిటీ వస్తుంది. సమాజాన్ని ఎదుర్కొనే ఆత్మవిశ్వాçసం ఏర్పడదు. ఇంకొందరు మరీ దారుణంగా వ్యవహరిస్తారు.
తల్లినో తండ్రినో ఎలాగైనా దూరం చేయాలి అని పిల్లల్ని దాచేయడం.... తల్లి/తండ్రి నీడ పడనంత దూరంగా తీసుకెళ్లిపోవడం... ఆ పిల్లల్లో తల్లి/తండ్రి పట్ల చేదు ఎక్కించడం. ఇది నేరం. పిల్లలకు తల్లి ప్రేమ, తండ్రి ఆప్యాయత దూరం చేసే హక్కు ఎవరికీ లేదు. కొన్నిసార్లు బంధువులు, తాతయ్య అమ్మమ్మ నానమ్మలు కూడా విషం నూరిపోయడానికి చూస్తారు. పిల్లల హితం కోరుకునే తల్లిదండ్రులైతే వీటిని వేటినీ ఎంకరేజ్ చేయకూడదు. విడిపోయాక పాత గాయాలను రేపి పిల్లల మనసు పాడు చేయకూడదు అనుకోవాలి.
పిల్లలకు కొత్త జీవితం
భార్యాభర్తలు విడిపోయాక పిల్లల దగ్గర నేను గెలవాలి అంటే నేను గెలవాలి అనుకోవడం ప్రమాదం. నేనే మంచి అనిపించుకోవడం కూడా సరి కాదు. ఎవరు మంచో ఎవరు చెడో కేవలం ఆ భార్యాభర్తలకు మాత్రమే తెలుస్తుంది. పిల్లలకు అది చెప్పినా అర్థం కాదు. వాళ్లకు అది అనవసరం కూడా. వాళ్లకు సంబంధించి జీవితంలో పెద్ద నష్టం జరిగిపోయింది తల్లిదండ్రులు విడిపోవడం వల్ల. కాని వారిలో ఒకరిని ఎలాగైనా దూరం చేయాలనుకోవడం ఇంకా నష్టం కలిగించడం. ‘మీరు పిల్లల కోసం ఈగోను తగ్గించుకోవాలి. మంచి తల్లిని మంచి తండ్రిని అనిపించుకోవడానికి చూడాలి. కొత్త జీవితం కోసం మీరు విడిపోయారు. మీ పిల్లలకు కూడా ఒక కొత్త జీవితం ఇద్దాం అనుకోవాలి... అని తల్లిదండ్రులకు సూచిస్తాం’ అంటారు డాక్టర్ కల్యాణ చక్రవర్తి.
ఆమిర్ ఖాన్, కిరణ్‌రావులు తమ కుమారుడు ఆజాద్ రావు ఖాన్ పుట్టిన రోజును కలిసి జరపాలని నిశ్చయించుకోవడం మంచి విషయం. పుట్టినరోజునాడు తల్లిదండ్రుల సమక్షంలో ఉండాలని పిల్లలు అనుకుంటారు. ఆ ఆనందం పొందే హక్కు వారికి ఉంది. వారి ప్రపంచం బుజ్జిది. అందమైనది. అమాయకమైనది. అందులో అమ్మా నాన్నలే హీరో హీరోయిన్లు. వారు నిజ జీవితంలో విడిపోయినా ఊహల్లో అప్పుడప్పుడు వాస్తవికంగా కలిసి కనిపిస్తే వారికి ఊరట. ఆ ఊరట కలిగించడం విడాకులు పొందిన ప్రతి భార్యాభర్తల బాధ్యత. పొసగని భార్యాభర్తలు కావడం తప్పు కాదు. కాని మంచి తల్లిదండ్రులు కాకపోవడం మాత్రం ముమ్మాటికీ తప్పే. ఆ తప్పు జరగనివ్వకండి.
Comments
Please login to add a commentAdd a comment