వివాహం అనేది మనుషులు జీవితాల్లో ముఖ్యమైన ఘట్టం. అందుకే పెళ్లి జ్ఞాపకాలు చిరకాలం గుర్తుండిపోయేలా వెడ్డింగ్ ప్లాన్ చేసుకుంటారు. ఆలుమగల మధ్య అంతా సవ్యంగా సాగితే ఏ సమస్యా ఉండదు. పొరపొచ్చాలు వస్తే పెళ్లి కాస్తా పెటాకులు అవుతుంది. ఇటీవల కాలంలో విడాకులు అనేవి సాధారణంగా మారిపోయాయి. రాజీపడి బతకడానికి ఎవరు ఇష్టపడటం లేదు. విడాకులు తీసుకుని ఎవరికి వారు హ్యాపీగా లైఫ్‌ను లీడ్ చేస్తున్నవారు ఎంతో మంది మనకు కనబడుతున్నారు.
ఇక విషయానికి వస్తే వెడ్డింగే కాదు విడాకులను కూడా సెలబ్రెట్ చేసుకుంటామంటూ సోషల్ మీడియాలో పెట్టిన ఇన్విటేషన్ తెగ వైరలయింది. రెండున్నరేళ్ల పాటు కోర్టులు చుట్టూ తిరిగి డివోర్స్ సాధించిన 18 మంది పురుషులు తమ ‘సింగిల్’ స్టేటస్‌ను సెలబ్రెట్ చేసుకోవాలని అనుకుని.. ఈ ఆహ్వానపత్రికను తయారు చేయించారు. మధ్యప్రదేశ్ రాజధాని భోపాల్ శివారులోని బిల్ఖిరియాలోని రిసార్ట్‌లో సెప్టెంబర్ 18న ఈ కార్యక్రమం తలపెట్టారు. భాయి వెల్ఫేర్ సొసైటీ అనే ఎన్జీవో ఆధ్వర్యంలో ‘వివాహ రద్దు’ను వేడుకగా చేసుకోవాలని నిర్ణయించారు.
స్వేచ్ఛ లభించినపుడు సెలబ్రెట్ చేసుకోవడంలో తప్పేంలేదని, విడాకుల అనంతర జీవితం కూడా ఆనందంగానే సాగుతుందన్న సందేశం ఇవ్వడానికే ఈ కార్యక్రమం ఏర్పాటు చేసినట్టు భాయి వెల్ఫేర్ సొసైటీ చెప్పుకొచ్చింది. తాము మహిళలకు వ్యతిరేకం కాదని.. చట్టాలను దుర్వినియోగం కాకుండా చూడాలన్నదే తమ అభిమతమని వివరణయిచ్చింది. అన్నట్టు విడాకుల కేసులతో సమస్యలను ఎదుర్కొంటున్న పురుషుల కోసం ఈ ఎన్జీవో హెల్ప్‌లైన్‌ను కూడా నడుపుతోందట!
వివాహ రద్దు వేడుక సాగేదిలా..
పెళ్లి తంతుకు రివర్స్‌లో ఈ కార్యక్రమం నిర్వహిస్తారు. పెళ్లి దండలను నిమజ్జనం చేయడం, జెంట్స్ సంగీత్, సద్బుద్ధి శుద్ధీకరణ యజ్ఞం వంటి క్రతువులు చేస్తారు. మనుషుల గౌరవాన్ని కాపాడతామని ఏడడుగుల సాక్షిగా ప్రమాణం చేయిస్తారట. (క్లిక్ చేయండి: పెళ్లి అనుకుంటే లొల్లి)
సంప్రదాయవాదుల మండిపాటు
భాయి వెల్ఫేర్ సొసైటీ నిర్వహించ తలపెట్టిన వివాహ రద్దు కార్యక్రమంపై సంప్రదాయవాదులు తీవ్రస్థాయిలో మడిపడుతున్నారు. కొన్ని స్థానిక హిందూ సంస్థలు కూడా ఆక్షేపించడంతో నిర్వాహకులు వెనక్కు తగ్గారు. ‘ప్రైవేట్ ఈవెంట్’ను రాజకీయం చేయాలని తాము కోరుకోవడం లేదని.. అందుకే కార్యక్రమాన్ని రద్దు చేస్తున్నామని నిర్వాహకులు ప్రకటించారు. (క్లిక్ చేయండి: చెప్పులతో చితక్కొట్టుకున్న అంకుల్స్..)
Comments
Please login to add a commentAdd a comment