చెన్నై : కామంతో కళ్లుమూసుకుపోయి తల్లీ బిడ్డలను హతమార్చిన మృగాడికి న్యాయస్థానం అదే స్థాయిలో కఠినమైన తీర్పును చెప్పింది. నిందితుడికి రెండుసార్లు ఉరిశిక్ష, ఏడేళ్ల కఠిన కారాగార శిక్షను విధిస్తూ కోయంబత్తూరు మహిళా కోర్టు మంగళవారం సంచలన తీర్పు చెప్పింది. కోర్టు కథనం ప్రకారం, కోయంబత్తూరు గణపతి రామకృష్ణపురం రంగనాధన్ వీధికి చెందిన మరుదమాణిక్యంకు భార్య వత్సలాదేవీ (26) కుమారులు మగిళన్ (6), ప్రణీత్ (11నెలలు) ఉన్నారు. వీరి ఇంటిలో శివగంగై జిల్లా మానామధురైకి చెందిన సెంథిల్ (32) అద్దెకు ఉండగా, అతని ప్రవర్తన సరిగా లేకపోవడంతో యజమాని వత్సలాదేవీ అతడిని అక్కడి నుంచి ఖాళీ చేయించారు.
గత ఏడాది జూన్ 1న సెంథిల్ వత్సలాదేవీ ఇంటికి వచ్చి అత్యాచార యత్నం చేశాడు. ఆమె గట్టిగా ప్రతిఘటించడంతో విచక్షణా రహితంగా కత్తితో పలుచోట్ల పొడవడంతో ఆమె ప్రాణాలు విడిచింది. ఏమి జరుగుతోందో తెలియక బిత్తరపోయి చూస్తున్న ఆమె ఆరేళ్ల కుమారుడు మగిళన్‌ను, సమీపంలో ఏడుస్తున్న 11 నెలల పసికందు ప్రణీత్‌ను కత్తితో పొడిచి హతమార్చాడు. హతుల వద్దనున్న బంగారు వస్తువులను తీసుకుని పరారయ్యాడు. సెంథిల్‌ను కోయంబత్తూరు సమీపం సూలూరులో అరెస్ట్ చేశారు. గట్టి బందోబస్తు నడుమ నిందితుడు సెంథిల్‌ను మంగళవారం కోయంబత్తూరు కోర్టులో హాజరుపరిచారు. హతురాలి ఒంటిపై 54 చోట్ల, ఆమె కుమారులు ఆరేళ్ల చిన్నారి ఒంటిపై 21 చోట్ల, 11 నెలల పసికందుపై 11 కత్తిపోట్లు ఉన్నట్లు తేలిందని న్యాయమూర్తి చెప్పారు.
భవిష్యత్తులో ఇటువంటి దారుణాలు పునరావృతం కాకుండా కఠినమైన రీతిలో తీర్పు చెప్పబోతున్నట్లు న్యాయమూర్తి ముందుగానే ప్రకటించారు. తల్లిపై అత్యాచారం జరిపి హత్యచేసినందుకు యావజ్జీవం, తమను తాము రక్షించుకోలేని స్థితిలో ఉన్న ఇద్దరు చిన్నారులను దారుణంగా పొడిచి చంపినందుకు రెండుసార్లు ఉరిశిక్ష, వారి ఒంటిపై ఉన్న నగలను దోచుకున్నందుకు ఏడేళ్ల కఠిన కారాగార శిక్షను విధించారు. అంతేగాక ప్రతి కేసుకు రూ.1000 చొప్పున జరిమానా చెల్లించాలని, లేనిపక్షంలో మరో మూడు నెలల జైలు శిక్షను అనుభవించాలని న్యాయమూర్తి తన తీర్పులో పేర్కొన్నారు.
రెండు సార్లు ఉరి : మహిళా కోర్టు సంచలన తీర్పు
Published Tue, Mar 17 2015 10:26 PM | Last Updated on Sat, Sep 2 2017 10:59 PM
Advertisement
Advertisement