
ఆదిలాబాద్: ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని ఓ స్థలం విషయంలో వచ్చిన కోర్టు తీర్పు సంచలనంగా మారింది. సినిమా రోడ్ సమీపంలోని అన్నభావు సాఠే విగ్రహం నుంచి మున్సిపల్ కార్యాలయం వైపుగా వెళ్లే రోడ్డుకిరువైపులా బారికేడ్లను ఏర్పాటు చేసి ఈ స్థలం తమదేనంటూ గురువారం ప్లెక్సీని ఏర్పాటు చేయడం కలకలం రేపింది. రాణీసతీజీ కాలనీ సమీపంలోని సాయి పంచవటి హోటల్‌తో పాటు దానిని ఆనుకుని ఉన్న దుకాణాల స్థలం గతంలో సోమా గంగారెడ్డితో పాటు వారికి సంబంధించినదని అతడి తనయుడు సోమ రవి తెలిపారు. రికార్డుల్లో ఈ భూమి తమ పేరిటే ఉందని తెలిపాడు.
అయితే ఈ స్థలాన్ని గతంలో ఓ వైద్యుడు ఇతరులకు విక్రయించాడని, దీంతో తాము 23ఏళ్లుగా పోరాడుతున్నామని, తాజాగా ఈ భూమిపై అన్ని హక్కులు సోమ గంగారెడ్డి కుటుంబీకులకే ఉన్నట్లుగా కోర్టు ఇచ్చిందని తెలిపాడు. కోర్టు తీర్పు మేరకు 33 గుంటలతో కూడిన ఈ భూమిని తమ అధీనంలోకి తీసుకుని బారికేడ్లను ఏర్పాటు చేసినట్లు పేర్కొన్నాడు.
దీంతో పాటు దిస్ ల్యాండ్ బిలాంగ్స్ టు సోమ గంగారెడ్డి అండ్ అదర్స్ అన్ని ప్లెక్సీ ఏర్పాటు చేశాడు. దీనిని గమనించిన వాహనదారులు, పాదచారులు, షాపుల నిర్వాహకులు పెద్ద ఎత్తున అక్కడకు తరలివచ్చారు. షాపుల, హోటల్ నిర్వాహకులు సైతం వెళ్లేందుకు ఇబ్బందులు పడడంతో ఎలాంటి ఘర్షణలు జరుగకుండా ఎస్సై హరిబాబు ఆధ్వర్యంలో సాయుధ పోలీసులు ఉదయం నుంచి రాత్రి వరకూ బందోబస్తు చేపట్టారు.
Comments
Please login to add a commentAdd a comment