మృగాడికి రెండు సార్లు ఉరి
చెన్నై, సాక్షి ప్రతినిధి: కామంతో కళ్లుమూసుకుపోయి ఓ మహిళను, అభం శుభం తెలియని ఆమె కుమారులను హతమార్చిన కిరాతకుడిని రెండుసార్లు ఉరి తీయాలని, ఏడేళ్ల కఠిన కారాగార శిక్ష విధించాలని కోయంబత్తూరు మహిళా కోర్టు మంగళవారం సంచలన తీర్పు చెప్పింది. కోర్టు కథనం ప్రకారం వివరాలు ఇలా ఉన్నాయి. కోయంబత్తూరు గణపతి రామకృష్ణపురం రంగనాథన్ వీధికి చెందిన మరుదమాణిక్యానికి భార్య వత్సలాదేవీ (26), కుమారులు మగిళన్ (6), ప్రణీత్ (11నెలలు) ఉన్నారు. వీరి ఇంటిలో శివగంగై జిల్లా మానామధురైకి చెందిన సెంథిల్ (32) అద్దెకు ఉంటున్నాడు. సెంథిల్‌కు అతని భార్యకూ మధ్య తరచూ తగాదాలు చోటుచేసుకునేవి. మరుదమాణిక్యం, వత్సలాదేవీ ఇద్దరు వారికి నచ్చజెప్పేవారు. కొన్ని రోజుల తరువాత సెంథిల్ భార్య అతడి ఇంటి నుంచి వెళ్లిపోయింది. ఈ దశలో సెంథిల్ వ్యవహారంలో మార్పు రావడంతో వత్సలాదేవీ అతని చేత ఇంటిని ఖాళీ చేయించారు. గత ఏడాది జూన్ 1న సెంథిల్ వత్సలాదేవీ ఇంటికి వచ్చి ఆమెపై అత్యాచారానికి యత్నించాడు.
ఆమె గట్టిగా ప్రతిఘటించడంతో మరింత రెచ్చిపోయిన అతను సమీపంలోని కత్తి తీసుకుని ఆమె, గొంతు కడుపు తదితర భాగాల్లో విచక్షణా రహితంగా పొడిచాడు. రక్తం మడుగుల్లో విలవిలా కొట్టుకుంటూ ఆమె ప్రాణాలు విడిచింది. ఈ దారుణాన్ని భయంతో చూస్తున్న ఆమె ఆరేళ్ల కుమారుడు మగిళన్‌ను సమీపంలో ఏడుస్తున్న 11 నెలల పసిబిడ్డ ప్రణీత్‌ను ఇష్టం వచ్చినట్లు కత్తితో పొడిచి హతమార్చాడు. హతుల వద్దనున్న బంగారు వస్తువులను తీసుకుని పరారయ్యాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు ప్రత్యేక బృందంగా ఏర్పడి నిందితుడు సెంథిల్‌ను కోయంబత్తూరు సమీపం సూలూరులో అరెస్ట్ చేశారు. కోయంబత్తూరు మహిళా కోర్టులో గత వారం వరకు విచారణ సాగగా మంగళవారానికి (ఈనెల 17వ తేదీ) వాయిదా పడింది.
ఈ దశలో గట్టి బందోబస్తు నడుమ నిందితుడు సెంథిల్‌ను మంగళవారం కోర్టులో హాజరుపరిచారు. సరిగ్గా అదే సమయంలో హతురాలు వత్సలాదేవి తల్లిదండ్రులు, అత్తగారు బంధువులతో కోర్టు ప్రాంగణం నిండిపోయింది. సరిగ్గా 12 గంటలకు విచారణ పూర్తికాగా న్యాయమూర్తి సుబ్రమణియన్ తీర్పు చెప్పారు. హతురాలి ఒంటిపై 54 చోట్ల కత్తిపోట్లు ఉన్నాయన్నారు. ఆరేళ్ల చిన్నారి ఒంటిపై 21 కత్తిపోట్లు, 11 నెలల పసికందుపై 11 కత్తిపోట్లు ఉన్నట్లు తేలిందని న్యాయమూర్తి చెప్పారు. వత్సలాదేవి లొంగలేదనే ఆత్రంలో ఆమెను, సాక్ష్యం చెబుతారనే భీతితో ఇద్దరు చిన్నారులను నిందితుడు సెంథిల్ కిరాతకంగా హతమార్చినట్లు రుజువైందని చెప్పారు. భవిష్యత్తులో ఇటువంటి నేరాలకు మరెవ్వరూ పాల్పడని రీతిలో తీర్పు చెప్పబోతున్నట్లు ముందుగానే ప్రకటించారు.
మహిళపై అత్యాచారం జరిపి హత్యచేసినందుకు యావజ్జీవ శిక్ష, తమను తాము రక్షించుకోలేని స్థితిలో ఉన్న ఇద్దరు చిన్నారులను దారుణంగా పొడిచి చంపినందుకు రెండు సార్లు ఉరి శిక్ష, వారి ఒంటిపై ఉన్న నగలను దోచుకున్నందుకు ఏడేళ్ల కఠిన కారాగారశిక్షను విధించారు. అంతేగాక ప్రతి కేసుకు రూ.1000 చొప్పున జరిమానా చెల్లించాలని, లేనిపక్షంలో మరో మూడునెలల జైలు శిక్షను అనుభవించాలని న్యాయమూర్తి తన తీర్పులో పేర్కొన్నారు. కోర్టు తీర్పు వెలువడగానే హతురాలి తల్లిదండ్రులు, అత్తగారు, బంధువులంతా ఒకరినొకరు ఓదార్చుకుంటూ కన్నీరు మున్నీరయ్యారు.