న్యూఢిల్లీ: రైలు ప్రయాణంలో పిల్లలు, పెద్దలు అనారోగ్యం పాలైనప్పుడు వెంటనే వైద్య సాయం అందించేందుకు, క్యాటరింగ్ సర్వీస్ నుంచి కావాల్సిన ఆహార పదార్థాలు తీసుక రావాలన్నా, ఆపదలో సకాలంలో పోలీసు భద్రత కావాలన్నా కేవలం ఒక ట్వీట్ ద్వారా రైల్వే సిబ్బంది ఈ మధ్య వేగంగా స్పందించి మన అవసరాలను తీరుస్తున్నారు. ఇంతకాలం లేనిది ఇప్పుడు ఇది ఎలా జరుగుతుందనే ఆసక్తి ఎవరికైనా కలుగొచ్చు.
ఇదంతా రైల్వే మంత్రిత్వ శాఖా కార్యాలయం, నాలుగో అంతస్తులోని 454 గది నుంచి జరుగుతుంది. దానిలో ట్విట్టర్ కంట్రోల్ రూమ్‌ను ఏర్పాటు చేశారు. దీన్ని నిర్వహిస్తున్న అధికారులు ముగ్గురు. వారిలో ఒకరు అనంత్ స్వరూప్. పబ్లిక్ గ్రివెన్సెస్ ఎగ్జిక్యూటివ్ డెరైక్టర్. 1992 ఐఆర్‌పీఎస్ బ్యాచ్ అధికారి. మొత్తం కంట్రోల్ రూమ్‌ను చూసే బాధ్యత ఆయనదే.
రెండో వ్యక్తి హసీన్ యాదవ్. ఆఫీసర్ ఆన్ స్పెషల్ డ్యూటీ. మెకానికల్ ఇంజనీర్. ఆయన 2003 ఐఆర్‌ఎస్‌ఎంఈ బ్యాచ్ అధికారి. మూడో వ్యక్తి వేద్ ప్రకాష్. సమాచార, ప్రసారాల డెరైక్టర్. 1998 బ్యాచ్‌కు చెందిన ఇండియన్ రైల్వే ట్రాఫిక్ సర్వీస్ అధికారి. సోషల్ మీడియాను మేనేజ్ చేయడంలో అపార అనుభవం ఉన్న అధికారి. రైల్వే సోషల్ మీడియా సెల్ అధికారి కూడా ఆయనే. ఈ ముగ్గురు టీమ్ తమ విధుల్లో ఎప్పుడు చురుగ్గా ఉంటారు. రైల్వే మంత్రి సురేశ్ ప్రభు నేరుగా వీరి కార్యకలాపాలను పర్యవేక్షిస్తుంటారు. ప్రయాణికుడి నుంచి ట్వీట్ వచ్చిన ఐదు నిమిషాల్లో స్పందిస్తారు. ఎక్కువ సందర్భాల్లో రిప్లై కూడా ఐదు నిమిషాల్లో ఇస్తారు.
ముగ్గురి టీమ్ కథనం ప్రకారం రోజుకు 5,000 ట్వీట్లు వస్తాయి. వాటిలో 30 శాతం రీట్వీట్లు ఉంటాయి. 20 నుంచి 30 శాతం వరకు కామెంట్లు ఉంటాయి. మిగతా ట్వీట్లకు వెంటనే స్పందించాల్సి ఉంటుంది. ట్వీట్ బట్టి రైల్వేలోని ఆయా విభాగాలను అలర్ట్ చేసి పని సకాలంలో పూర్తయ్యేలా చూస్తారు. కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసినప్పటి నుంచి ఇప్పటి వరకు వారికి 7, 75, 000 ట్వీట్లు వచ్చాయి. వారి పని వేళలు ఉదయం ఆరు నుంచి మధ్యాహ్నం రెండు వరకు, రెండు నుంచి రాత్రి పది వరకు, రాత్రి పది నుంచి ఉదయం ఆరు వరకు ఉంటాయి.
ట్వీట్‌తో రైల్వే సేవలు ఆ ముగ్గురి చలువే!
Published Thu, Feb 18 2016 11:05 PM | Last Updated on Sun, Sep 3 2017 5:54 PM
Advertisement
Advertisement