మోదీ కోసం ప్రపంచ నేతల పోటాపోటీ
ఆస్ట్రేలియాలోని బ్రిస్బేన్ నగరంలో జరిగిన జి20 సదస్సు సందర్భంగా ప్రపంచ దేశాల అధినేతలంతా ఒక వ్యక్తి కోసం చూశారు. ఆయనను ఎప్పుడు కలుస్తామా, ఆయనతో చేతులు ఎలా కలపాలా, ఆయనను ఎలా ఆలింగనం చేసుకోవాలా అని ఒకరితో ఒకరు పోటీ పడ్డారు. అలా ఎదురు చూసిన వాళ్లలో అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా కూడా ఉన్నారు. ఈ విషయాన్ని స్వయంగా పాశ్చాత్య మీడియానే వెల్లడించింది. ద గార్డియన్ పత్రిక మోదీని 'రాజకీయ రాక్స్టార్'గా అభివర్ణించింది. ఆయనతో కలిసి కనిపించడానికి ప్రపంచ దేశాల అధినేతలంతా పోటీలు పడ్డారని కూడా తన కథనంలో పేర్కొంది.
జి20 రిట్రీట్ సందర్భంగా అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా, రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్, ఆస్ట్రేలియా ప్రధాని టోనీ అబాట్.. ఇలా అగ్ర రాజ్యాల అధినేతలంతా మోదీని కలిసి మాట్లాడేందుకు తహతహలాడారు. ఆసీస్ ప్రధాని టోనీ అబాట్ తమ సంప్రదాయ బార్బెక్ విందు ఇచ్చారు. తనతోను, ఒబామాతోను కలిసి మోదీ ఉన్న ఫొటోను ఆయన ట్వీట్ చేశారు.
అంతకుముందు జి20 సదస్సుకు నరేంద్రమోదీని ఆస్ట్రేలియన్ ప్రధాని సాదరంగా స్వాగతించారు. నల్లటి బంద్గలా సూటు వేసుకుని వెళ్లిన మోదీ.. అందరినీ ఆప్యాయంగా పలకరించారు. మోదీ కేవలం చేతులు కలపడమే కాక, ఆలింగనం చేసుకోవడంతో ఒక్కసారిగా మీడియా సెంటర్ నుంచి 'ఆవ్..' అనే కేకలు వినిపించాయని ద ఏజ్ పత్రిక పేర్కొంది. అబాట్కు మంచి స్నేహితులుగా పేరొందిన డేవిడ్ కామెరాన్, స్టీఫెన్ హార్పర్ల నుంచి మాత్రం ఇలాంటి ఆలింగనాలు ఏమీ లేవని తెలిపింది.
The BBQ lunch with @narendramodi and @BarackObama was an opportunity for #G20 Leaders to talk in a relaxed atmosphere pic.twitter.com/zxYcUa28et
— Tony Abbott (@TonyAbbottMHR) November 15, 2014