న్యూఢిల్లీ: భారత్‌లో పత్రికా స్వేచ్ఛ (ఫ్రీడమ్ ఆఫ్ ది ప్రెస్) నానాటికి పడిపోతోంది. గతేడాదితో పోలిస్తే దేశంలో పత్రికా స్వేచ్ఛ మూడు ర్యాంకులు దిగజారినట్లు ప్రపంచ మీడియా నిఘా సంస్థ ‘రిపోర్టర్స్ సాన్స్ ఫ్రాంటియర్స్ (సరిహద్దులులేని రిపోర్టర్లుగా తెలుగులో వ్యవహరిస్తారు)’ బుధవారం విడుదల చేసిన ‘ప్రపంచ పత్రికా స్వేచ్ఛ సూచిక’ స్పష్టం చేస్తోంది. ఇందులో భారత్ 136 స్థానంతో పొరుగునున్న పాకిస్తాన్, అఫ్గానిస్థాన్‌లకు సమీపానికి చేరుకోవడం విచారకరమని ఫ్రాంటియర్స్ వ్యాఖ్యానించింది.
భారత్‌లో పత్రికా స్వేచ్ఛ తగ్గడానికి కారణం హిందూ జాతీయ వాదులు మీడియాను భయపెట్టడం, ప్రధాన మీడియాలో స్వీయ నియంత్రణ పెరగడం, ప్రభుత్వ విమర్శకులను యావజ్జీవ శిక్షార్హమైన దేశద్రోహం కేసుల్లో ఇరికించడం, జర్నలిస్టులపై భౌతిక దాడులు పెరగడమేనని నిఘా సంస్థ పేర్కొంది.
ప్రపంచ మీడియా స్వేచ్ఛా ఇండెక్స్‌లో ఎప్పుడూ అగ్రస్థానంలో ఉండే ఫిన్‌లాండ్ ఈసారి మూడవ ర్యాంకకు పడిపోవడం, టాప్ ర్యాంక్‌ను నార్వే ఆక్రమించడం ఈసారి విశేషం. అలాగే రెండు స్థానాలు దిగజారి అమెరికా 43స్థానానికి, బ్రిటన్ 40వ స్థానానికి చేరుకున్నాయి. హంగరీ నాలుగు ర్యాంకులు దిగజారి 71 స్థానానికి, టాంజానియా రెండు ర్యాంకులు దిగజారి 83 స్థానానికి, టర్కీ నాలుగు ర్యాంకులు దిగజారి 155వ స్థానానికి చేరుకోవడాన్ని కూడా నిఘా సంస్థ విమర్శించింది.
అమెరికా, బ్రిటన్‌లు రెండేసి స్థానాలు దిగజారడానికి అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ ఎన్నికల ప్రచారం, మాజీ ప్రధాని కామెరూన్ నిర్వహించిన బ్రెక్సిట్ ఓటింగ్ కారణమయ్యాయని నిఘా సంస్థ పేర్కొంది. 148వ స్థానంలో రష్యా నిలకడగా ఉండగా, ఉత్తర కొరియా ఆఖరిస్థానానికి పడిపోయింది. 2007 నుంచి అది ఆఖరి స్థానంలో రావడం ఇదే మొదటిసారి. మే మూడున వచ్చే ప్రపంచ పత్రికా స్వేచ్ఛ దినోత్సవాన్ని పురస్కరించుకొని పారిస్‌లోని ‘రిపోర్టర్స్ సాన్స్ ఫ్రాంటియర్స్’ ప్రతి ఏటా ఈ ర్యాంకులను విడుదల చేస్తోంది.