
తగ్గుతున్న రైలు ప్రయాణికులు
నిత్యం కిక్కిరిసి కనిపించే భారతీయ రైళ్లలో ఈమధ్య ప్రయాణికుల సంఖ్య తగ్గినట్టు తేలింది.
- ఈ ఏడాదిలో ఇప్పటికి 4 శాతం తగ్గుదల
- చార్జీల తగ్గుదలకు అవకాశముందన్న నిపుణులు
న్యూఢిల్లీ: నిత్యం కిక్కిరిసి కనిపించే భారతీయ రైళ్లలో ఈమధ్య ప్రయాణికుల సంఖ్య తగ్గినట్టు తేలింది. ఈ ఏడాది ఏప్రిల్-ఆగస్టు మధ్య కాలంలో ప్రయాణికుల సంఖ్య నాలుగుశాతం తగ్గినట్టు గుర్తించారు. దీంతో రైల్వేశాఖ ఆలోచనలో పడింది. ఈ నేపథ్యంలో రైలు చార్జీల తగ్గింపుపై చర్చ మొదలయింది. గత ఏడాదితో పోలిస్తే ఈ ఏడాది ప్రయాణికుల సంఖ్య 15 కోట్ల వరకు తగ్గిందని రైల్వేవర్గాలు తెలిపాయి. గత ఏడాది ఏప్రిల్-ఆగస్టు మధ్య కాలంలో రైల్వేకు రూ.20,204 కోట్ల ఆదాయం రాగా, ఈసారి రూ.19,394 కోట్లు మాత్రమే వచ్చింది. అంటే ఆదాయంలో 4.95 శాతం కోత పడింది. ప్రయాణికుల తగ్గుదల ఇలాగే కొనసాగితే టికెట్ చార్జీల సబ్సిడీలు పెంచకతప్పకపోవచ్చని సంబంధిత వర్గాలు అంటున్నాయి.
ప్రస్తుతం రైల్వేశాఖ ఏటా చార్జీల్లో రాయితీల కోసం రూ.29 వేల కోట్ల వరకు ఖర్చు చేస్తోంది. సరుకు రవాణా ద్వారా వస్తున్న ఆదాయంలో కొంత ఈ రాయితీల కోసం ఖర్చు పెడుతున్నారు. ఈ ఏడాది ప్రయాణికుల సంఖ్యను మరింత పెంచుకోవాలని లక్ష్యం నిర్దేశించుకున్న రైల్వేకు ప్రస్తుత పరిణామం మింగుడుపడడం లేదు. అయితే రాబోయే నెలల్లో పలు పండుగలు వస్తున్నాయి కాబట్టి మళ్లీ రైళ్లు కిక్కిరుస్తాయని అధికారులు అంటున్నారు. పండుగల రద్దీని తట్టుకోవడానికి భారీ సంఖ్యలో ప్రత్యేక రైళ్లు వేస్తున్నారు. ప్రయాణికులు భారీగా తగ్గడానికి గల కారణాలను తెలుసుకోవాలంటూ రైల్వే బోర్డు చైర్మన్ ఏకే మిట్టల్ అన్ని రైల్వే జోన్ల అధిపతులకు లేఖ రాశారు. ఇటీవలి జనరల్ మేనేజర్ల సమావేశంలో ఈ అంశంపై చాలాసేపు చర్చ జరిగినట్టు తెలుస్తోంది. తక్కువ దూరం ప్రయాణించే వారి సంఖ్య మాత్రమే భారీగా తగ్గిందని, రిజర్వేషన్లు తగ్గలేదని సీనియర్ అధికారి ఒకరు అన్నారు. టికెట్ తీసుకోకుండా ప్రయాణించే వారు పెరగడమే ఈ పరిస్థితికి కారణమైన ఉండొచ్చని ఆయన అభిప్రాయపడ్డారు. ఇలాంటి వారిని గుర్తించి తగిన చర్యలు తీసుకోవడానికి ప్రత్యేక డ్రైవ్‌లు నిర్వహిస్తున్నామని చెప్పారు.