
'హాఫ్ టికెట్' ఆదాయం రూ.160 కోట్లు!
హాఫ్ టికెట్లు ఎత్తివేయడం ద్వారా రైల్వే శాఖ భారీ ఆదాయాన్ని ఆర్జిస్తోంది. దేశంలోని 16 రైల్వే డిజన్ల 'హాఫ్ టికెట్' ఆదాయం రూ.160 కోట్లకు చేరువలో ఉంటుందని అంచనా..
ముంబై: హాఫ్ టికెట్ నిబంధనల్లో సవరణలు రైల్వే శాఖకు భారీ ఆదాయాన్ని తెచ్చిపెడుతున్నాయి. 5 నుంచి 12 ఏళ్ల మధ్య వయసున్న పిల్లలకు గతంలో హాఫ్ టికెట్(సగం ధర)పై ప్రాయాణించే వీలుండేది. గత ఏప్రిల్ లో ఈ సౌకర్యాన్ని పూర్తిగా రద్దుచేసిన రైల్వే.. పిల్లలకు కూడా పెద్దల మాదిరే ఫుల్ చార్జి వసూలు చేయాలని నిర్ణయించింది. పైసా ఖర్చు లేకుండా రెండు కోట్ల అదనపు బెర్తులు లేదా సీట్లు కల్పించాలనుకున్న రైల్వే.. హాఫ్ టికెట్లు ఎత్తివేయడం ద్వారా రూ. 525 కోట్ల అదనపు ఆదాయాన్ని ఆశిస్తోంది. హాఫ్ టికెట్ విధానం రద్దయిన తర్వాత టికెట్ల అమ్మకం ద్వారా సెంట్రల్, వెస్ట్రన్ రైల్వేస్ లు రూ.20 కోట్ల ఆదాయాన్ని ఆర్జించాయి. ఈ రెండు డివిజన్లలో వచ్చిన ఆదాయమే ఇంతుందంటే, దేశంలోని 16 రైల్వే డిజన్ల 'హాఫ్ టికెట్' ఆదాయం రూ.160 కోట్లకు చేరువలో ఉంటుందని అంచనా.
కాగా, అసలు లక్ష్యం రూ.525 కోట్లను ఆర్జించాలంటే రైల్వే అధికారులు పిల్ల ప్రయాణికుల విషయంలో ఇంకాస్త కఠినంగా వ్యవహరించాల్సిన పరిస్థితి. సెంట్రల్, వెస్ట్రన్ డివిజన్లలో ఏప్రిల్, మేలో దాదాపు 5.5 లక్షల మంది 5-12 ఏళ్ల పిల్లలు ఫుల్ టికెట్ లేకుండా ప్రయాణించారని, అంటే అన్ని లక్షల సీట్ల ఆదాయాన్ని కోల్పోయినట్లయిందని, భవిష్యత్ లో మరింత జాగ్రత్తగా వ్యవహరించి, ఆదాయాన్ని పెంచుకుంటామని ఓ అధికారి చెప్పారు. అన్ని డివిజన్లలో హాఫ్ టికెట్ రద్దు నిబంధనను కఠినంగా అమలు చేయగలితే టార్గెట్ ను చేరుకోవడం రైల్వేలకు పెద్ద విషయమేమీకాదు. అయితే పిల్లల విషయంలో కఠిన వైఖరిపై కొందరు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. రైల్వేలను కేవలం ఆదాయ వనరుగా చూడరాదంటున్నారు. మరి కొందరు మాత్రం ఈ నిబంధన బాగుందంటున్నారు.