
సీఎం అయ్యే విషయం యోగికి ముందే తెలుసు
లక్నో: ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రిగా యోగి ఆదిత్యనాథ్ పేరు అనూహ్యంగా ముందుకొచ్చిందని అందరూ భావించారు. ఎవరికి తెలిసినా, తెలియకపోయినా తానే ముఖ్యమంత్రినవుతాననే విషయం ఆదిత్యనాథ్‌కు ముందే తెలుసనే విషయం ‘చల్తే చల్తే’ అనే ఓ టీవీ కార్యక్రమానికిచ్చిన ఇంటర్వ్యూను చూస్తే అర్థం అవుతోంది. రాష్ట్రంలో బీజేపీ అధికారంలోకి వస్తే, రాష్ట్రంలో అన్ని కబేళాలను మూయిస్తామని, అందుకు పటిష్టమైన కార్యాచరణ రూపొందిస్తామని ఆ ఇంటర్వ్యూలో యోగి ఆదిత్యనాథ్ తెలిపారు. పోలీసులతో ‘యాంటీ రోమియో దళాలను’ ఏర్పాటు చేస్తామని కూడా చెప్పారు.
ఆయన ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన రెండు రోజుల్లోనే ఈ రెండు హామీలను వెంటనే అమలు చేశారు. దేశంలో ఒక్క యూపీలోని గోరఖ్‌పూర్‌లో మాత్రమే ముస్లింల జనాభా పెరుగకుండా నియంత్రించ గలిగామని, తాము రాష్ట్రంలో అధికారంలో లేనప్పుడే ఇది సాధించగలిగినప్పుడు కేంద్రంలో అధికారంలోవున్న బీజేపీ దేశవ్యాప్తంగా వారి జనాభా పెరగకుండా ఎందుకు చేయలేదని ఓ ప్రశ్నకు సమాధానంగా యోగి చెప్పారు.
యూపీలో క్రైస్తవుల సంఖ్య నానాటికి పెరుగుతోందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. విలాస జీవితాల ఆశ చూపుతూ క్రైస్తవ మహిళను పెళ్లి చేసుకునేందుకు హిందూ యువకులను తప్పుదారి పట్టిస్తున్నారని కూడా ఆయన అన్నారు. క్రైస్తవుల సంఖ్యను కూడా నియంత్రించేందుకు చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందని యోగి అభిప్రాయపడ్డారు.