ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ప్రతిష్ట మసకబారుతోందా ? గద్దెనెక్కి ఏడాది తిరిగిందో లేదో ఆయనపై ఫెయిల్యూర్ సీఎం అని ముద్ర పడిపోతోందా ? పాలనా రంగంలో వైఫల్యాలు, భాగస్వామ్య పార్టీల అసంతృప్తి సెగలు, ఉప ఎన్నికల్లో ఓటమి, సహచర మంత్రులతో వ్యవహారశైలి, రాష్ట్ర నాయకత్వంపై నలుగురు దళిత ఎంపీల తిరుగుబాటు, అన్నింటికి మించి ప్రజల్లో ఉన్నప్పడు ఆయన వ్యక్తిగత ప్రవర్తన అన్నీ కలిసి యోగికున్న ఇమేజ్‌ని డ్యామేజీ చేసేస్తున్నాయనే అభిప్రాయం వినిపిస్తోంది.
ఇప్పుడు తాజాగా ఉన్నావ్ రేప్ కేసు బాధితురాలి తండ్రి పోలీసు దెబ్బలు తాళలేక మృతి చెందడం, ఆ కుటుంబం బీజేపీ ఎమ్మెల్యే కుల్‌దీప్ సింగ్ సెంగార్‌పై చేస్తున్న ఆరోపణలతో యోగి ప్రభుత్వం చిక్కుల్లో పడింది. దేశానికి గుండెకాయ వంటి రాష్ట్రంలో అపూర్వమైన విజయం సాధించిన ఏడాదిలోగా లెక్కలేనన్ని వివాదాలు తలెత్తడం, సహచర నేతలే సీఎం వ్యవహార శైలిపై ఫిర్యాదులు ఇవ్వడంతో రాజకీయ వాతావరణమే వేడెక్కింది. సరిగ్గా ఏడాది క్రితం యూపీ అసెంబ్లీ ఎన్నికల్లో అనూహ్యమైన విజయాన్ని సొంతం చేసుకున్న బీజేపి ఎవరూ ఊహించని విధంగా ఒక యోగిని తీసుకువచ్చి సీఎం పీఠంపై కూర్చోబెట్టింది. అయిదు సార్లు గోరఖ్‌పూర్ ఎంపీగా వరస విజయాలు సాధించిన ఒక వీరుడిగా గుర్తించిన బీజేపీ అధినాయకత్వం ఆయనని ముఖ్యమంత్రిని చేసింది. కానీ ఏడాది తిరిగేలోగా ఎన్నో వివాదాలు ఆయనని చుట్టుముట్టాయి. ముఖ్యంగా రాష్ట్రంలో భద్రత గాల్లో కలిసిపోయిందనే విమర్శలు వెల్లువెత్తాయి.
బీజేపీకి కంచుకోటవంటి గోరఖ్‌పూర్, ఫూల్‌పుర్ ఉప ఎన్నికల్లో ఓటమి నుంచి ఇంకాతేరుకోకముందే రాష్ట్రంలో దళితులపై అరాచకాలు పెరిగిపోతున్నాయంటూ సొంత పార్టీకి చెందిన నలుగురు దళిత ఎంపీలు సావిత్రీ బాయ్ ఫూలే, చోటేలాల్, యశ్వంత్ సింగ్, అశోక్ డోహ్రెలు రాష్ట్ర నాయకత్వంపై ఆగ్రహం వ్యక్తం చేయడం రాజకీయంగా ప్రకంపనలు సృష్టించింది. ఇక ప్రభుత్వ భవనాలకు, చివరికి అంబేడ్కర్ విగ్రహానికి కూడా కాషాయి రంగు పూయడం వివాదానికి దారి తీసింది. మరోవైపు యూపీలో బీజేపీ మిత్రపక్షమైన సుహేల్‌దేవ్ భారతీయ సమాజ్ పార్టీ(ఎస్‌బీఎస్‌పీ) నాయకుడు ప్రకాశ్ రాజభర్ కూడా సీఎం తనని ఖాతరు చేయడం లేదని సంకీర్ణ ధర్మానికి తిలోదకాలు ఇచ్చారంటూ ధ్వజమెత్తడం కలకలం రేపింది. యోగి తీరు మార్చుకోకపోతే ప్రభుత్వం నుంచి తప్పుకుంటామని ఆయన హెచ్చరికలు కూడా జారీ చేశారు.
వ్యక్తిగత ప్రవర్తనపైనా ఆరోపణలు
యోగి ఆదిత్యనాథ్ వ్యక్తిగత ప్రవర్తనపై కూడా ఇటీవల కాలంలో తీవ్రమైన విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. యోగి ఆదిత్యనాథ్‌కు తలబిరుసు ఎక్కువంటూ సొంత పార్టీ నేతలే అంతర్గత సంభాషణల్లో చర్చించుకుంటున్నారు. యూపీలో ఎస్సీ, ఎస్టీలపై పెరిగిపోతున్న అరాచకాలను ముఖ్యమంత్రి దృష్టికి తీసుకువెళ్లాలని ప్రయత్నించినప్పుడు, ఆయన తన మాటలు వినకపోగా తననే తిరిగి దూర్భాషలాడారంటూ బీజెపీ ఎంపీ ఛోటేలాల్ ఖర్వార్ చేసిన ఆరోపణలు, భారత్ బంద్ సమయంలో ఎస్సీ, ఎస్టీలపై రాష్ట్ర పోలీసులు తప్పుడు కేసులు బనాయించారంటూ మరో ఎంపీ మరో ఎంపీ అశోక్ డొహ్రె చేసిన విమర్శలు సీఎంను ఆత్మరక్షణలో పడేశాయి.
చివరికి సాధారణ ప్రజలతో కూడా ఆయన తీరుతెన్ను సరిగా ఉండదనే గుసగుసలు వినిపిస్తున్నాయి. గత వారంలో అయూష్ బన్సల్ అనే యువకుడు మీడియా ముందే ముఖ్యమంత్రి ప్రవర్తనపై సంచలన ఆరోపణలు చేశారు. ఒక భూ కబ్జా కేసు విషయాన్ని సీఎం దృష్టికి తీసుకువెళ్లడానికి జనతా దర్బార్‌కు వెళ్లినప్పుడు ఆయన తనను ఆవారా అంటూ హేళన చేశారని, తాను తీసుకెళ్లిన ఫైల్ ముఖాన కొట్టారంటూ బన్సల్ ఆరోపించారు. గత కొన్నాళ్లుగా సీఎం చుట్టూ నెలకొన్న వివాదాలన్నీ ప్రధానికి లేఖల రూపంలో ఫిర్యాదులుగా వెళ్లాయి.
ఆర్‌ఎస్‌ఎస్ నివేదికతో డేంజర్‌బెల్స్
యూపీ సీఎంపై ఫిర్యాదులు వెల్లువెత్తుతుండడంతో నిజానిజాలను తెలుసుకోవడానికి ఆర్‌ఎస్‌ఎస్ నేతలు కృష్ణ గోపాల్, దత్తాత్రేయ హోసబోలేమూడు రోజుల పాటు రాష్ట్రంలో పర్యటించి ఉప ముఖ్యమంత్రులు, ఇతర మంత్రులు, పార్టీ నేతలు, కార్యకర్తలతో మాట్లాడారు. యోగి పాలనపై అన్ని వర్గాల్లోనూ అసంతృప్తి నెలకొందని వారి పరిశీలనలో వెల్లడి కావడంతో ఆదిత్యనాథ్ చిక్కుల్లో పడినట్టయింది. అంతేకాదు బీజేపీకి వ్యతిరేకంగా ముస్లింలు, దళితుల్ని కూడగట్టడంలో ఎస్పీ, బీఎస్పీలు తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నాయంటూ ఆర్‌ఎస్‌ఎస్ నేతలు నివేదిక ఇచ్చారు.
దీంతో గత శనివారం ఢిల్లీ వెళ్లి మరీ బీజేపీ అధినాయకత్వానికి యోగి ఆదిత్యనాథ్ వివరణ ఇచ్చుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. నరేంద్రమోదీ, అమిత్‌షాలను మర్యాదపూర్వకంగానే కలిశానని ఆదిత్యనాథ్ చెబుతున్నప్పటికీ మరి కొద్ది రోజుల్లోనే యోగి ప్రభుత్వంలోనూ, పార్టీపరంగానూ భారీగా మార్పులు ఉంటాయని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. యూపీలో పరిస్థితిని చక్కదిద్దడానికి ఈ నెల 11న అమిత్ షా ఆ రాష్ట్రంలో పర్యటించనున్నారు. మరి షా పర్యటనతో యూపీలో రాజకీయ పరిణామాలు ఎలాంటి మలుపు తిరుగుతాయా అన్న ఆసక్తి రాజకీయ వర్గాల్లో నెలకొని ఉంది.
ఏడాది పాలనపై ప్రజలు ఏమన్నారు ?
యూపీ సీఎంగా ఆదిత్యనాథ్ గద్దెనెక్కి మార్చినెలలోనే ఏడాది పూర్తయింది. ఆ సందర్భంగా కొన్ని స్వచ్ఛంద సంస్థలు చేసిన సర్వేలలో ప్రభుత్వ పాలనపై ప్రజలు కొంతవరకు అసంతృప్తి వ్యక్తం చేశారు.
అంచనాలకు తగ్గ విధంగా యోగి పరిపాలన లేదని 43 శాతం మంది తేల్చి చెప్పారు.
మహిళలపై అకృత్యాలు అడ్డుకట్ట పడలేదని 36 శాతం మంది అభిప్రాయపడ్డారు
స్కూళ్ల ఫీజుపై నియంత్రణ లేదంటూ 61 శాతం మంది అసంతృప్తి వ్యక్తం చేశారు.
అవినీతిని అరికట్టలేకపోయారని 52 శాతం మంది అభిప్రాయపడ్డారు.
ఆరోగ్య రంగం ఏ మాత్రం మెరుగుపడలేదన్నవారు 50 శాతం మంది
మొత్తమ్మీద చూస్తే యోగి అంచనాలను అందుకోవడంలో విఫలమయ్యారనే అభిప్రాయమైతే నెలకొంది.
(సాక్షి నాలెడ్జ్ సెంటర్)
Comments
Please login to add a commentAdd a comment