ఆరు జిల్లాల్లో ప్రజలకు రక్షిత మంచినీరు, ఆరోగ్య సదుపాయాలు కల్పించకపోవడంపై ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం, జల నిగమ్‌లపై జాతీయ హరిత ట్రిబ్యునల్ తీవ్రంగా మండిపడింది. ప్రజల ప్రాణాలంటే వీసమెత్తు గౌరవం కూడా లేదా అని ప్రశ్నించింది. ముజఫర్‌నగర్, షామ్లి, మీరట్, బాఘ్‌పత్, ఘజియాబాద్, సహారన్‌పూర్ జిల్లాల్లోని పలు గ్రామాల్లో ప్రజలకు నీళ్లు గానీ, కనీస ప్రాథమిక వైద్య సదుపాయాలు గానీ లేవని.. అయినా ఈ విషయంపై అదికారులు ఇంతవరకు ఎలాంటి కార్యాచరణ ప్రారంభించలేదని అసంతృప్తి వ్యక్తం చేసింది. అక్కడ ఉన్న ప్రజలకు ఎలాంటి వ్యాధులు వస్తున్నాయో గుర్తించేందుకు ఎలాంటి వైద్యపరీక్షలు చేశారో చెప్పాలని ప్రశ్నించింది. పరీక్షలు ఏమీ చేయకుండా వాళ్ల అనారోగ్యాన్ని ఎలా నిర్ధారిస్తారని నిలదీసింది. ప్రజల ప్రాణాలంటే.. మీ టేబుల్ మీద ఉన్న ఫైళ్లలా చాలా సులభంగా తీసుకుంటున్నారని మండిపడింది. సరిగా ప్రవర్తించడం నేర్చుకోవాలని ఎన్‌జీటీ చైర్‌పర్సన్ జస్టిస్ స్వతంత్రకుమార్ వ్యాఖ్యానించారు.
బాఘ్‌పత్ జిల్లా ప్రధాన వైద్యాధికారిపై కూడా నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ తీవ్రంగా మండిపడింది. కలుషిత నీళ్లు తాగడం వల్ల ఆయా జిల్లాల్లో ప్రజలకు ఎలాంటి సమస్యలు వస్తున్నాయో పరీక్షించేందుకు ఎలాంటి చర్యలు తీసుకున్నారని ప్రశ్నించింది. ''స్థానికుల రక్తనమూనాలు తీసుకుని వాటిని విశ్లేషించారా? ఎందుకు చేయలేదు? వాళ్లు మీ ఇంటికి వచ్చి రక్తనమూనాలు ఇవ్వరు. వారి వద్దకు వెళ్లాల్సిన బాధ్యత మీకుంది. అసలు ప్రజల ప్రాణాలంటే మీకు లెక్కలేదు'' అని ధర్మాసనం వ్యాఖ్యానించింది. కేంద్ర జలవనరుల మండలిని సంప్రదించి, ఆరు జిల్లాల్లో శాస్త్రీయ విశ్లేషణ సాగించాలని అఖిలేష్ యాదవ్ ప్రభుత్వానికి ఎన్‌జీటీ సూచించింది. ఈ మొత్తం విషయంపై అక్టోబర్ 21లోగా నివేదిక సమర్పించాలని ఆదేశించింది. కలుషిత భూగర్భజలాలున్న బోర్లను వెంటనే తీసేయాలని తెలిపింది.
బాఘ్‌పత్ జిల్లాలోని భూగర్భ జలాల్లో ఆర్సెనిక్ ఉండాల్సిన దానికంటే 4వేల రెట్లు ఎక్కువగా ఉందని పిటిషన్ దాఖలు చేసిన శాస్త్రవేత్త సీవీ సింగ్ తరఫు న్యాయవాది గౌరవ్ బన్సల్ తెలిపారు. దీనిపై యూపీ ప్రభుత్వం ఇచ్చిన నివేదికను ఆయన బెంచి ముందు ఉంచారు.
ప్రజల ప్రాణాలంటే మీకు లెక్క లేదా?
Published Wed, Sep 7 2016 6:37 PM | Last Updated on Sat, Aug 25 2018 4:34 PM
Advertisement