water contamination
-
ముషీరాబాద్ చేపల మార్కెట్ కాలనీలో కలుషిత నీటి సరఫరా
-
మంచి నీళ్లే వారి కొంప ముంచాయా?
సాక్షి, కామారెడ్డి: జిల్లా లోని గాంధారి మండలం గుడి వెనుక తండా గ్రామ పరిధిలోని మర్లకుంట తండాలో విషాదకర ఘటన చోటుచేసుకుంది. ఒకే కుటుంబానికి చెందిన 11 మంది తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. వారు తాగిన మంచినీటితోనే అనారోగ్యం బారినపడ్డట్టు కుటుంబ సభ్యులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. అస్వస్థతకు గురైన రామావత్ మేగ్యా, చిలుకా భాయి కుటుంబంలోని 11 మంది కుటుంబ సభ్యుల్లో నిన్న రాత్రి చిన్నారి శ్రీనిధి (9) ప్రాణాలు కోల్పోయింది. మరో ముగ్గురి పరిస్థితి విషమంగా ఉందని కామారెడ్డి ప్రభుత్వ ఆసుపత్రి వర్గాలు తెలిపాయి. బాధితుల్లో 10 నెలల బాలుడు శ్రీకాంత్ ఐసీయూలో చికిత్స పొందుతున్నాడు. బాధితులు సేవించిన మంచినీటిని పరీక్షల కోసం ల్యాబ్‌కు పంపినట్టు అధికారులు తెలిపారు. ఈ రోజు మధ్యాహ్నం వరకు పరీక్షా ఫలితాలు రానున్నాయి. (చదవండి: ఉగ్ర పోరులో నిజామాబాద్ జవాన్ వీర మరణం) -
79 మంది విద్యార్థినులకు అస్వస్థత
సాక్షి, ఆసిఫాబాద్‌రూరల్: జిల్లా కేంద్రంలోని ఆశ్రమ బాలికల ఉన్నత పాఠశాలలో కలుషిత నీరు, ఆహారం తిని 36 మంది విద్యార్థినినులు సోమవారం రాత్రి 11 గంటలకు అస్వస్థతకు గురికాగా, ఆ సంఖ్య మంగళవారం మధ్యాహ్నం వరకు 79కి చేరింది. బాధిత విద్యార్థినులు స్థానిక ప్రభుత్వ అసుపత్రిలో చికిత్స పొందుతుండగా, అధికారుల నిర్లక్ష్యంతోనే ఈ సంఘటన చోటు చేసుకుందని వారి తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. ఇదిలా ఉంటే, తాగునీటి కోసం పాఠశాలలో ఏర్పాటు చేసిన బోర్ చెడిపోయి 20 రోజులైందని విద్యార్థులు తెలిపారు. ఈ విషయాన్ని ప్రిన్సిపాల్ స్వర్ణలతకు చెప్పినా పట్టించుకోలేదనీ.. దీంతో 10 ఏళ్లుగా వాడకుండా నిరుపయోగంగా ఉన్న చేతిపంపు నీటిని తాగాల్సి వచ్చిందని వారు వాపోయారు. కాగా, పాఠశాలను డీటీడీవో దిలీప్‌కుమార్ సందర్శించి వంటశాల పరిసరాలను పరిశీలించి సంబంధిత అధికారులపై అగ్రహం వ్యక్తం చేశారు. సిబ్బంది నిర్లక్ష్యంతోనే ఈ సంఘటన జరిగిందనీ, దీనిపై పూర్తి విచారణ చేసి బాధ్యులపై చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు. నిర్లక్ష్యమే శాపం.. జిల్లాలో మొత్తం 40 ఆశ్రమ వసతి గృహాల్లో సుమారు 13 వేల మంది విద్యార్థులు చదువుకుంటున్నారు. ఈ వసతిగృహాల్లో కనీస వసతులు కల్పించడం అటుంచి.. వాటిలో ఏదైనా ప్రమాదం జరిగితే తప్ప అధికారులు మేల్కోవడం లేదనే ఆరోపణలున్నాయి. ఈ విద్యా సంవత్సరం ప్రారంభంలోనే వాంకిడి మండలంలోని బాంబార ఆశ్రమ పాఠశాలలో 30 మంది, తిర్యాణి మండలంలోని చెలమెల గురుకుల పాఠశాల 70 మంది, కౌటాల కేజీబీవీ పాఠశాలలో 50 మంది విద్యార్థులు కలుషిత ఆహరం తిని అస్వస్థతకు గురైన సంఘటనలు జరిగాయి. ఇలా ప్రతీ ఏడాది మూడు నాలుగు సంఘటనలు జరుగుతున్నా సంబంధిత అధికారులు మాత్రం నిర్లక్ష్యం వీడటం లేదు.. ఆయా పాఠశాలల్లో సౌకర్యాలు కల్పించడం లేదని బాధిత విద్యార్థులు తల్లిదండ్రులు మండిపడుతున్నారు. వారం నుంచి కడుపునొస్తుంది.. బోర్ పని చేయకపోవడంతో చేతి పంపు నీళ్లనే తాగినం. అవి తాగినప్పుటి నుంచి కడుపు నొప్పి వస్తోంది.మేడంకు చెప్పినా ఏం కాదన్నారు. ఇప్పుడు ఎక్కువయ్యే సరికి దవాఖానకు తీసుకొచ్చిన్రు. – కళ్యాణి, 8వ తరగతి చెప్పినా పట్టించుకోలేదు.. బోర్ నీళ్లు రావడం లేదని వార్డెన్‌కు, ప్రిన్సిపాల్‌కు చెప్పినా పట్టించుకోలేదు. మురికి నీటితోనే వంటలు కూడా చేస్తున్నారు. సోలార్ ప్లాంట్లు పని చేయక చల్లనీళ్లే స్నానం చేస్తున్నం. – మౌనిక, 9వ తరగతి బాధ్యులను సస్పెండ్ చేయాలి ఇలా మళ్లీ జరగకుండా ఉండలంటే బాధ్యులైన అధికారులను వెంటనే సస్పెండ్ చేయాలి. విద్యార్థుల కోసం వచ్చిన నిధులను వారి కోసం ఖర్చు చేయకపోవడం వల్లే ఇలాంటి సంఘటనలు జరుగుతున్నాయి. -యూకే రాము, పాఠశాల చైర్మన్ ఇద్దరి సస్పెన్షన్ విద్యార్థినులు అస్వస్థతకు గురైన సంఘటనలో సిబ్బం ది నిర్లక్ష్యమే కారణమని నిర్ధారించి, ఇందుకు బాధ్యులుగా పాఠశాల ప్రధానోపా ధ్యాయురాలు స్వర్ణమంజుల, వార్డెన్ శాంతను సస్పెండ్ చేస్తున్నట్లు డీటీడీవో దిలిప్‌కుమార్ ఒక ప్రకటనలో మంగళవారం తెలిపారు. విద్యార్థుల వసతి గృహాల్లో ఇలాంటి సంఘటనలు జరిగితే కఠిన చర్యలే తీసుకోకుంటామని ఆయన పునరుద్ఘాటించారు. డీటీడీఓ దిలీప్ కుమార్ -
ఆ నీరే ఆధారం..
సాక్షి, న్యూఢిల్లీ: దేశంలో పది కోట్ల మంది ప్రజలు అధిక ఫ్లోరైడ్‌తో కూడిన నీటిని తాగుతున్నారని స్వయంగా ప్రభుత్వం లోక్‌సభలో వెల్లడించింది. పలు రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లోని 12,577 జనావాసాల్లో దాదాపు 10.06 కోట్ల మంది కలుషిత నీటి బారినపడుతున్నారని పేర్కొంది. ఫ్లోరైడ్ ప్రభావిత ప్రాంతాల్లో నీటి కల్తీని నివారించేందుకు నీటి శుద్ధి కేంద్రాలకు నీతిఆయోగ్ సిఫార్సు మేరకు రూ. 800 కోట్లు విడుదల చేశామని ప్రభుత్వం తెలిపింది. పశ్చిమ బెంగాల్, రాజస్ధాన్‌లోని మారుమూల ప్రాంతాల్లో పైప్లైన్ల ద్వారా రక్షిత మంచినీటి కోసం మరో రూ. 100 కోట్లు కేటాయించామని తాగునీరు, పారిశుద్ధ్య శాఖ మంత్రి నరేంద్ర సింగ్ తోమర్ తెలిపారు. నాలుగేళ్ల వ్యవధిలో ఫ్లోరైడ్ ప్రభావిత ప్రాంతాలన్నింటికీ రక్షిత మంచినీటిని అందుబాటులోకి తీసుకువచ్చేందుకు జాతీయ నీటి నాణ్యతా మిషన్‌ను ప్రారంభించినట్టు మంత్రి చెప్పారు. -
డంపింగ్ యార్డుపై గ్రామస్థుల నిరసన
డంపింగ్ యార్డు కారణంగా చెరువు నీరు కలుషితం అవుతోందంటూ గ్రామస్తులు ఆందోళనకు దిగారు. వివరాలివీ.. రంగారెడ్డి జిల్లా కీసర మండలం చీర్యాల సమీపంలో జీహెచ్ఎంసీ డంపింగ్ యార్డు ఉంది. ఈ యార్డు నుంచి వెలువడే వ్యర్థ జలాలు పక్కనే ఉన్న చెరువులో కలుస్తున్నాయి. సాగు నీరు కలుషితమవుతోందంటూ కొన్ని రోజులుగా గ్రామస్తులు ఆందోళన చేస్తున్నారు. ఇదే విషయమై ఒక్కటైన గ్రామస్తులు బుధవారం ఉదయం చెత్తను తీసుకువచ్చే జీహెచ్ఎంసీ వాహనాలను అడ్డుకున్నారు. పెద్ద సంఖ్యలో వాహనాలు నిలిచిపోయాయి. దీంతో రంగ ప్రవేశం చేసిన పోలీసులు ఆందోళన కారులకు నచ్చజెప్పేందుకు యత్నిస్తున్నారు. -
ప్రజల ప్రాణాలంటే మీకు లెక్క లేదా?
ఆరు జిల్లాల్లో ప్రజలకు రక్షిత మంచినీరు, ఆరోగ్య సదుపాయాలు కల్పించకపోవడంపై ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం, జల నిగమ్లపై జాతీయ హరిత ట్రిబ్యునల్ తీవ్రంగా మండిపడింది. ప్రజల ప్రాణాలంటే వీసమెత్తు గౌరవం కూడా లేదా అని ప్రశ్నించింది. ముజఫర్‌నగర్, షామ్లి, మీరట్, బాఘ్‌పత్, ఘజియాబాద్, సహారన్పూర్ జిల్లాల్లోని పలు గ్రామాల్లో ప్రజలకు నీళ్లు గానీ, కనీస ప్రాథమిక వైద్య సదుపాయాలు గానీ లేవని.. అయినా ఈ విషయంపై అదికారులు ఇంతవరకు ఎలాంటి కార్యాచరణ ప్రారంభించలేదని అసంతృప్తి వ్యక్తం చేసింది. అక్కడ ఉన్న ప్రజలకు ఎలాంటి వ్యాధులు వస్తున్నాయో గుర్తించేందుకు ఎలాంటి వైద్యపరీక్షలు చేశారో చెప్పాలని ప్రశ్నించింది. పరీక్షలు ఏమీ చేయకుండా వాళ్ల అనారోగ్యాన్ని ఎలా నిర్ధారిస్తారని నిలదీసింది. ప్రజల ప్రాణాలంటే.. మీ టేబుల్ మీద ఉన్న ఫైళ్లలా చాలా సులభంగా తీసుకుంటున్నారని మండిపడింది. సరిగా ప్రవర్తించడం నేర్చుకోవాలని ఎన్జీటీ చైర్పర్సన్ జస్టిస్ స్వతంత్రకుమార్ వ్యాఖ్యానించారు. బాఘ్‌పత్ జిల్లా ప్రధాన వైద్యాధికారిపై కూడా నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ తీవ్రంగా మండిపడింది. కలుషిత నీళ్లు తాగడం వల్ల ఆయా జిల్లాల్లో ప్రజలకు ఎలాంటి సమస్యలు వస్తున్నాయో పరీక్షించేందుకు ఎలాంటి చర్యలు తీసుకున్నారని ప్రశ్నించింది. ''స్థానికుల రక్తనమూనాలు తీసుకుని వాటిని విశ్లేషించారా? ఎందుకు చేయలేదు? వాళ్లు మీ ఇంటికి వచ్చి రక్తనమూనాలు ఇవ్వరు. వారి వద్దకు వెళ్లాల్సిన బాధ్యత మీకుంది. అసలు ప్రజల ప్రాణాలంటే మీకు లెక్కలేదు'' అని ధర్మాసనం వ్యాఖ్యానించింది. కేంద్ర జలవనరుల మండలిని సంప్రదించి, ఆరు జిల్లాల్లో శాస్త్రీయ విశ్లేషణ సాగించాలని అఖిలేష్ యాదవ్ ప్రభుత్వానికి ఎన్జీటీ సూచించింది. ఈ మొత్తం విషయంపై అక్టోబర్ 21లోగా నివేదిక సమర్పించాలని ఆదేశించింది. కలుషిత భూగర్భజలాలున్న బోర్లను వెంటనే తీసేయాలని తెలిపింది. బాఘ్‌పత్ జిల్లాలోని భూగర్భ జలాల్లో ఆర్సెనిక్ ఉండాల్సిన దానికంటే 4వేల రెట్లు ఎక్కువగా ఉందని పిటిషన్ దాఖలు చేసిన శాస్త్రవేత్త సీవీ సింగ్ తరఫు న్యాయవాది గౌరవ్ బన్సల్ తెలిపారు. దీనిపై యూపీ ప్రభుత్వం ఇచ్చిన నివేదికను ఆయన బెంచి ముందు ఉంచారు.