షాకింగ్ విషయం చెప్పిన ప్రధాని మోదీ
పణజి: పెద్ద నోట్ల రద్దు నల్లధనం నిర్మూలనలో కీలక చర్య అని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. నల్లకుబేరులను ఎట్టిపరిస్థితుల్లోనూ వదిలి పెట్టబోమని హెచ్చరించారు. మోపా గ్రీన్ ఫీల్డ్ ఎయిర్ పోర్టుకు ఆదివారం ఆయన శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ... నల్లధనంపై ప్రాణంపోయినా వెనక్కి తగ్గేది లేదని స్పష్టం చేశారు. పెద్ద నోట్ల రద్దు ప్రజలంతా హాయిగా నిద్రపోయారని, కొంతమంది మాత్రం నిద్రపోలేకపోయారని వ్యాఖ్యానించారు. అవినీతికి వ్యతిరేకంగా 2014లో తమకు ప్రజలు ఓటు వేశారని చెప్పారు. నిజాయితీపరుల కోసం కీలక అడుగులు వేస్తున్నామన్నారు. తనకు పదవీ వ్యామోహం లేదని, అహంకారంతో పెద్ద నోట్లను రద్దు చేయలేదని అన్నారు.
‘అవినీతి అంతం చేయమని ప్రజలు నాకు అధికారం ఇచ్చారు. చేయకుండా ఎలా ఉండగలను? రూ. 500, రూ. వెయ్యి నోట్లు ఉపసంహరణ కారణంగా సామాన్య ప్రజలు ఇబ్బందులు పడడం నాక్కూడా బాధ కలిగిస్తోంది. నేనేదైనా తప్పు చేసివుంటే ఈ దేశం విధించే ఏ శిక్షకైనా సిద్ధం. ఈ యాభై రోజులు ఇబ్బందులు ఉంటాయి. తర్వాత పరిశుభ్రతా కార్యక్రమం చేపడతాం. ఉన్నత పదవుల కోసం నేను పుట్టలేదు. దేశం కోసం ఇంటిని, కుటుంబాన్ని త్యాగం చేశాను. బినామీ ఆస్తులపై చర్యలు తీసుకుంటాం.
మీకో ఆశ్చర్యకరమైన సంగతి చెబుతాను. నగలు కొనేటప్పుడు పాన్ కార్డు నంబర్ తప్పనిసరి చేయొద్దని చాలా మంది ఎంపీలు నన్ను కోరారు. పెద్ద నోట్ల రద్దు ప్రకటనకు ముందు 10 నెలలు అంతర్గతంగా కసరత్తు చేశాం. ఈ మొత్తం వ్యవహారం రహస్యంగా సాగించాం. యువకుల భవిష్యత్తును ఎందుకు పణంగా పెడుతున్నారు. ఎందుకు ఇలాంటి రాజకీయాలు చేస్తున్నారు. 2జీ స్కామ్ నిందితులు కూడా నోట్లు మార్చుకోవడానికి క్యూలో వెళ్లారు. అవినీతిని అంతం చేసే దాకా నిద్రపోన’ని మోదీ ఉద్వేగానికి లోనయ్యారు.